సత్వరం ఎన్నిక నిర్వహించాలి
- ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఈసీకి వైఎస్సార్‌సీపీ వినతి
- కమిషన్ దృష్టికి టీడీపీ కౌన్సిలర్ల దౌర్జన్యకాండ
సాక్షి, హైదరాబాద్: అధికార టీడీపీ దౌర్జన్య కాండ ఫలితంగా వాయిదా పడిన ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను సత్వరమే నిర్వహించడానికి చర్యలు తీసుకోవాలని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు విజ్ఞప్తి చేసింది. కడప ఎమ్మెల్యే షేక్ బేపారి అంజాద్ బాషా నేతృత్వంలో పార్టీ నేతలు మంగళవారం ఏపీ ఎన్నికల కమిషనర్ రమేష్‌కుమార్‌ను కలసి కోరారు. ఈ నెల 15, 16 తేదీల్లో చైర్మన్ ఎన్నిక జరక్కుండా ప్రొద్దు టూరులో టీడీపీ కౌన్సిలర్లు ఎలా అడ్డంకుల ను సృష్టించిందీ కమిషన్ దృష్టికి తీసుకొచ్చా రు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి తరఫున ఆయన పంపిన వినతిపత్రాన్ని కమిషనర్‌కు అందజేశారు.
వారిని అనర్హులుగా చేయండి:రాచమల్లు
చైర్మన్ ఎన్నిక జరక్కుండా ఆగడాలు సృష్టించిన టీడీపీ కౌన్సిలర్లపై అనర్హత వేటు వేయాలని, ఇలాంటి దుండగులు తదుపరి జరిగే ఎన్నికల్లో పాల్గొనకుండా చర్యలు తీసుకోవాలని రాచమల్లు తన వినతిపత్రంలో పేర్కొన్నారు. చైర్మన్ ఎన్నిక నిర్వహణకు సాధ్యమైనంత త్వరగా చర్యలు తీసుకుని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
ఏపీలో ప్రజాస్వామ్యం ఉందా!
అధికారులు పూర్తిగా టీడీపీకి తొత్తులుగా వ్యవహరించి ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్మన్ ఎన్నికను వాయిదా వేయడం దారుణమని ఎమ్మెల్యే అంజాద్‌బాష విమర్శించారు. ఈసీకి ఫిర్యాదు చేసిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ... ఏపీలో అసలు ప్రజాస్వామ్యం ఉందా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ జరిగిందంతా తాము కమిషన్‌కు ఫిర్యాదు చేశామని, త్వరలో ఎన్నికలు జరుపుతామని, ఎన్నికల కమిషన్ నుంచే ఒక పరిశీలకుల బృందాన్ని ఎన్నికకు పంపుతామని కమిషనర్ తమకు హామీ ఇచ్చారని తెలిపారు.