
ప్రతీ అమ్మాయి కోసం గాలిపటాన్ని ఎగరేద్దాం!
- పతంగుల పండుగకు సర్వంసిద్ధం
సాక్షి, హైదరాబాద్: సంక్రాంతి పండుగ సందర్బంగా గురువారం నుంచి ఆరు రోజుల పాటు నిర్వహించే రెండో అంతర్జాతీయ పతంగుల పండుగకు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాట్లు పూర్తి చేసింది. అమ్మాయిల చదువు, సాధికారతపై అవగాహన పెంపొందించడంలో భాగంగా నిర్వహించనున్న ఈ పండుగను వీక్షించడానికి 50,000 మంది ప్రేక్షకులు వస్తారని అంచనా. 17 దేశాల నుంచి 70 అంతర్జాతీయ కైట్ ఫ్లయర్స్, మనదేశం నుంచి 40 జాతీయ మంది కైట్ ఫ్లయర్స్ ఈ వేడుకల్లో పాల్గొంటారని రాష్ట్ర పర్యాటక శాఖ తెలిపింది. పీపుల్స్ ప్లాజాలో గురువారం జరిగే ప్రత్యేక కైట్ ఫ్లయింగ్ కార్యక్రమంతో ఈ వేడుకలు ప్రారంభం కానున్నాయి.
ఆగాఖాన్ అకాడమీలో ఈ నెల 13, 14,15 తేదీల్లో ‘ఆకాశాన్ని రంగుల మయం చేద్దాం- ప్రతీ అమ్మాయి కోసం గాలిపటాన్ని ఎగరేద్దాం’అనే నినాదంతో ప్రధాన వేడుకలు జరుగుతాయి. యాదగిరి, వరంగల్ జిల్లాల్లో ఈ నెల 16, 17 తేదీల్లో పతంగుల పండుగ జరుగుతుంది. రాబోయే అయిదేళ్లలో పతంగుల పండుగను రాష్ట్ర వ్యాప్తంగా జరుపుకునేలా చర్యలు తీసుకోనున్నట్లు పర్యాటక శాఖ తన ప్రకటనలో తెలిపింది.