‘హార్ట్ బీటింగ్ సర్జరీ’ పరిశోధనకు అంతర్జాతీయ గుర్తింపు | international recognition to Heart Beating Surgery research, | Sakshi
Sakshi News home page

‘హార్ట్ బీటింగ్ సర్జరీ’ పరిశోధనకు అంతర్జాతీయ గుర్తింపు

Published Sun, Oct 16 2016 4:03 AM | Last Updated on Mon, Sep 4 2017 5:19 PM

‘హార్ట్ బీటింగ్ సర్జరీ’  పరిశోధనకు అంతర్జాతీయ గుర్తింపు

‘హార్ట్ బీటింగ్ సర్జరీ’ పరిశోధనకు అంతర్జాతీయ గుర్తింపు

భారతీయ పరిశోధనలను అనుసరిస్తున్న విదేశీవైద్యులు
స్టార్ ఆస్పత్రి వైద్యుడి ఘనత


సాక్షి,హైదరాబాద్: భారతీయ హృద్రోగ వైద్యుడి పరిశోధనకు అరుదైన గౌరవం లభించింది. ఆ వైద్యుడి పరిశోధన ‘జర్నల్ ఆఫ్ థొరాసిక్ అండ్ కార్డియో వ్యాస్కూలర్ సర్జరీ’లో ప్రచురితం కావడం విశేషం. ఈ పరిశోధనను విదేశీ పరిశోధకులు కూడా ప్రామాణికంగా తీసుకోవడం మరో విశేషం. సాధారణంగా కిడ్నీ పనితీరు మందగించి, గుండె నొప్పితో బాధపడుతున్న రోగులకు గుండె కదలికలను పూర్తిగా నిలిపివేసి ప్రత్యామ్నాయంగా లంగ్ హార్ట్ పంపింగ్ మిషన్ సహాయంతో బైపాస్ సర్జరీ చేస్తుంటారు. కానీ, బంజారాహిల్స్ స్టార్ ఆస్పత్రికి చెందిన సీనియర్ కన్సల్టెంట్ కార్డియాక్ సర్జన్ డాక్టర్ లోకేశ్వర్‌రావు సజ్జ బైపాస్ సర్జరీలో లంగ్ హార్ట్ పంపింగ్ మిషన్‌తో అవసరం లేకుండా గుండె కొట్టుకుంటున్న సమయంలోనే శస్త్రచికిత్స చేశారు.

ఇలా 2006లో తన వద్దకు వచ్చిన 116 మంది రోగులపై ‘హార్ట్ బీటింగ్ సర్జరీ’ పేరుతో పరిశోధన చేశారు. వీరిలో సగం మందికి గుండె కొట్టుకుంటున్న సమయంలో బైపాస్ సర్జరీ చేయగా, మరో సగం మందికి గుండె స్పందనలను పూర్తిగా నిలిపేసి శస్త్రచికిత్స చేశారు. గుండె స్పందనలు నిలిపివేసి కృత్రిమ యంత్ర సహకారంతో సర్జరీ చేయించుకున్న రోగుల కంటే గుండె కొట్టుకుంటున్న సమయంలో శస్త్రచికిత్స చేయించుకున్న రోగులే త్వరగా కోలుకోవడంతో పాటు సక్సెస్ రేటు కూడా ఎక్కువగా ఉన్నట్లు నిరూపించారు.

ఇదే అంశాన్ని 2006 ఏప్రిల్ 30న ఫిలడెల్ఫియాలో జరిగిన 86వ  అమెరికన్ అసోసియేషన్ ఫర్ థొరాసిక్ సర్జరీ వార్షిక సమావేశంలో చర్చించారు. ఈ పరిశోధనను ఇప్పటి వరకు వంద మంది వైద్యులు ప్రామాణికంగా తీసుకున్నారు. ఓ దేశీయ వైద్యుడి పరిశోధన విదేశీ పరిశోధనకు ప్రామాణికంగా తీసుకోవడం భారత హృద్రోగ వైద్యచరిత్రలో ఇదే తొలిసారి. దేశంలో 60% మంది వైద్యులు, అమెరికాలో 20% మంది వైద్యులు, యూరప్‌లో 40%  మంది వైద్యులు ఈ హార్ట్ బీటింగ్ సర్జరీని అనుసరిస్తున్నట్లు డాక్టర్ లోకేశ్వర్‌రావు ప్రకటించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement