పెట్టుబడుల వరద
- నెలల్లో రాష్ట్రానికి రూ.33 వేల కోట్ల పెట్టుబడులు
- లక్ష మందికిపైగా ఉపాధి అవకాశాలు
- రాష్ట్రవ్యాప్తంగా 1,609 కంపెనీలకు అనుమతులు
- అందులో 106 భారీ కంపెనీలకు సీఎంవో లైన్ క్లియర్
- మొత్తం రూ. 409 కోట్ల సబ్సిడీ ఇచ్చిన ప్రభుత్వం
- దళిత పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహం
- మూలధనం సమకూర్చే యోచనలో సర్కారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు పెట్టుబడుల వరద మొదలైంది. ప్రపంచ దృష్టిని ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నూతన పారిశ్రామిక విధానానికి తొలి ఏడాది భారీ స్పందనే వచ్చింది. అనుమతుల జారీని సరళతరం చేయటం, ఆశించిన రాయితీలు కల్పించటంతో అంచనాలకు మించి పారిశ్రామికవేత్తలు ఆసక్తి కనబరిచారు. గడచిన ఎనిమిది నెలల వ్యవధిలోనే దాదాపు రూ.33,101 కోట్ల పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చినట్లు ప్రభుత్వం అంచనా వేసింది. దీంతో దాదాపు లక్ష మందికి పైగా ఉపాధి అవకాశాలొస్తాయని అధికారులు చెబుతున్నారు.
ఇప్పటికే అమెజాన్, మైక్రోమాక్స్, ఐటీసీ వంటి బహుళ జాతి సంస్థలతో పాటు దేశీయ సంస్థలు తమ యూనిట్లను రాష్ట్రంలో నెలకొల్పేందుకు ముందుకు వచ్చాయి. ముచ్చర్లలో ఫార్మా సిటీతో పాటు వరంగల్‌లో టెక్స్‌టైల్ హబ్, ఖమ్మంలో మెగాఫుడ్ పార్కులకు ప్రభుత్వం సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేసింది. అత్యధికంగా డిమాండ్ ఉన్న ఏరోస్పేస్ రంగంలోని కంపెనీలను ఆకర్షించేందుకు సర్కారు అత్యంత ప్రాధాన్యమిస్తోంది. ఇప్పటికే ఆదిభట్ల, నాదర్‌గుల్‌లో రెండు ఏరోస్పేస్ పార్కులకు స్థలాలు గుర్తించిన ప్రభుత్వం కొత్తగా ఎలిమినేడులో మూడో పార్కుకు త్వరలో పునాది రాయి వేయనుంది.
స్పెషల్ చేజింగ్ సెల్‌తో సత్ఫలితాలు
ముఖ్యమంత్రి కార్యాలయం(సీఎంవో)లో స్పెషల్ చేజింగ్ సెల్ ఏర్పాటుతో భారీ పరిశ్రమల ఏర్పాటుకు మార్గం సుగమమైంది. కొత్త విధానం ప్రకారం రూ.5 కోట్లలోపు పెట్టుబడులు పెట్టే పరిశ్రమలకు జిల్లా స్థాయిలో, రూ.5 కోట్లకుపైగా పెట్టుబడులు పెట్టే సంస్థలకు పరిశ్రమల శాఖ కమిషనరేట్ నుంచి అనుమతులు జారీ చేసేలా ప్రభుత్వం విధానాలు రూపొందించింది. రూ.200 కోట్లకు మించి పెట్టుబడులు పెట్టే సంస్థల దరఖాస్తులను స్వయంగా సీఎంవోలోని స్పెషల్ ఛేజింగ్ సెల్ పరిశీలిస్తుంది. టీఎస్‌ఐపాస్ అమల్లోకి వచ్చాక రాష్ట్రస్థాయి నుంచి జిల్లాల వరకు మొత్తం 1,609 కంపెనీలు అనుమతులు తీసుకున్నాయి.
వాటిలో ముఖ్యమంత్రి కార్యాలయం 106 భారీ, మధ్య తరహా పరిశ్రమలకు అనుమతులు జారీ చేసింది. సీఎంవో అనుమతులు పొందిన కంపెనీల పెట్టుబడుల అంచనా మొత్తం రూ.8,491 కోట్లకు చేరింది. వీటిద్వారా ద్వారా దాదాపు 34,500 మంది నిరుద్యోగులకు ఉపాధి లభించనుంది. అందులో 32 యూనిట్లు ఉత్పత్తిని ప్రారంభించగా మిగతావన్నీ ప్రాథమిక దశ(గ్రౌండింగ్)లో ఉన్నాయి. సీనియర్ ఐఏఎస్ అధికారి శాంతికుమారి సీఈవోగా ఏర్పాటైన ఈ స్పెషల్ ఛేజింగ్ సెల్ పరిశ్రమల అనుమతులను పర్యవేక్షిస్తోంది. ఇండస్ట్రీస్ కమిషనరేట్ ద్వారా మరో 300 కంపెనీలకు అనుమతులిచ్చారు. ఈ పెట్టుబడుల మొత్తం రూ.22 వేల కోట్లు ఉంటుందని అధికారులు అంచనా. వీటిద్వారా మరో 64 వేల నుంచి 70 వేల మందికి ఉపాధి దొరకనుంది. వీటితోపాటు 1,203 చిన్న కంపెనీలు, పరిశ్రమలు జిల్లా స్థాయిలో అనుమతులు పొందాయి.
ఆక ర్షిస్తున్న సబ్సిడీలు, నిరంతర విద్యుత్
కొత్త పారిశ్రామిక చట్టంలోని సింగిల్ విండో విధానం, దరఖాస్తు చేసుకున్న పదిహేను రోజుల్లోపు అనుమతుల జారీతో పాటు ప్రభుత్వం కల్పించే రాయితీలు పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయి. నిరంతర విద్యుత్‌తో పాటు విద్యుత్తు సబ్సిడీ, పెట్టుబడి, అమ్మకపు పన్ను రాయితీలను ప్రభుత్వం కల్పిస్తోంది. 2014-15లో పరిశ్రమల సబ్సిడీకి రూ.467 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం టీఎస్ ఐపాస్ చట్టం అమల్లోకి వచ్చాక.. తొలి ఆరు నెలల్లోనే పరిశ్రమల సబ్సిడీకి రూ.409 కోట్లు వెచ్చించింది.
ఏడాదిలో ఇది రెట్టింపు అవుతుందని పరిశ్రమల శాఖ అంచనా వేస్తోంది. మరోవైపు టీ ప్రైడ్ ద్వారా దళిత పారిశ్రామికవేత్తలకు మరింత ప్రోత్సాహకం ఇచ్చే ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం దళిత పారిశ్రామికవేత్తలకు పెట్టుబడుల్లో 45 శాతం రాయితీ అమల్లో ఉంది. వీరికి మొత్తం మూలధనం సమకూర్చే ప్రతిపాదన ప్రభుత్వం పరిశీలనలో ఉంది. ముఖ్యమంత్రి దీనికి సానుకూలంగానే ఉన్నారని, త్వరలోనే ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.