కంట్లో నలుసు!
ఐటీ, అనుబంధ ఉద్యోగుల్లో పెరుగుతున్న కంటి సమస్యలు
70 శాతం మందికి ‘కంప్యూటర్ విజన్ సిండ్రోమ్’
మారిన జీవనశైలే కారణమంటున్న నిపుణులు
జాగ్రత్తపడకపోతే ప్రమాదమని హెచ్చరిక
సిటీబ్యూరో: రోజంతా కంప్యూటర్లకు అతుక్కుపోవడం, గంటల తరబడి టీవీల ముందు కూర్చోవడం, రెప్పవాల్చకుండా అదే పనిగా పని చేయడం, కనీస విరామం లేకపోవడం వల్ల ఐటీ దాని అనుబంధ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల్లో నూటికి 70 శాతం మంద్ఙికంప్యూటర్ విజన్ సిండ్రోమ్*(సీవీఎస్)వ్యాధితో బాధపడుతున్నట్లు వైద్యుల పరిశోధనలో వెల్లడైంది. కళ్లు ఎరుపెక్కడం, కంట్లో నలుసులు ఏర్పడటం, మంట, దురద, తడారి పోవడం, నీరు కారడం, వంటి సమస్యలు కంటి చూపుపై తీవ్ర ప్రభావాన్ని చూపుతున్నాయి. నగరం లోని వాసన్, అగర్వాల్, ఎల్వీప్రసాద్, సరోజినీదేవి, మ్యాక్స్‌విజన్, తదితర కంటి ఆస్పత్రుల్లో ప్రతి రోజూ 400కుపైగా కేసులు న మోదవుతుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. జీవనశైలిని మార్చుకోకపోతే భవిష్యత్తులో కంటి చూపు దెబ్బతినే అవ కాశం లేకపోలేదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రెప్పవాలిస్తేనే రక్షణ
నగరంలో ఐటీ, దాని అనుబంధ రంగాల్లో మూడు లక్షలకు పైగా ఉద్యోగులు పని చేస్తున్నట్లు అంచనా. ఇక ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయా ల్లోనూ కంప్యూటర్ల వినియోగం తప్పని సరిగా మారింది. చివరికి షాపింగ్ మాల్స్‌లో కూడా వీటి వినియోగం పెరిగింది. కనురెప్ప వాల్చ కుండా గంటల తరబడి కంప్యూటర్ స్క్రీన్‌పై పని చేస్తుండటం వల్ల కళ్లు దెబ్బతింటున్నాయి. ఐటీ అనుబంధ రంగాల్లో పని చేస్తున్న ప్రతి వంద మందిలో 70 శాతం మంది ఏదో ఒక సమస్యతో బాధపడుతున్నట్లు ప్రముఖ కంటి వైద్య నిపుణుడు డాక్టర్ సుధాకర్ రెడ్డి తెలిపారు. కళ్లపై పెరుగుతున్న ఒత్తిడి కారణంగా ఇరిటేషన్‌కు గురవుతున్నారు. ప్రతి చిన్న అంశానికి చిరాకు పడుతున్నారు. ఇదిలా ఉండగా పిల్లలు సైతం గేమ్స్ పేరుతో కంప్యూటర్లకు అతుక్కుపోతున్నారు. గంటల తరబడి టీవీలను వీక్షిస్తుండంతో చూపు మందగించడం వల్ల పుస్తకంలోని అక్షరాలను కూడా చదువలేక పోతున్నారు.
కాపాడుకోవచ్చు ఇలా
కనురెప్పవాల్చకుండా అదేపనిగా కంప్యూటర్‌పై పని చేయకూడదు. ప్రతి 15 నిమిషాలకు ఒకసారి కంప్యూటర్ స్క్రీన్ నుంచి దృష్టి ని మరల్చాలి. కంట్లో మంట ఉన్నప్పుడు కనురెప్పలను రెండు చేతులతో మూసి అదిమిపట్టుకోవాలి. కంప్యూటర్ల ముందు కూర్చున్నప్పుడు ట్యూబ్ లైట్లు ఆర్పేయకూడదు. చీకట్లో పనిచేయడం వల్ల కంప్యూటర్ స్క్రీన్ కాంతి ప్రభావం నేరుగా కంటిపై పడుతుంది. ప్రతి పదిహేను నిమిషాలకు ఒకసారి 20 నుంచి 30సార్లు కళ్లను మూసి తెరవాలి. కంప్యూటర్ మానిటర్‌కు కళ్లకు కనీసం రెండు అడుగుల దూరంలో ఉండేలా చూసుకోవాలి. కళ్లు దురదగా అనిపిస్తే చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
కంటికి ఓ వ్యాయామం
నిమిషానికి పదిసార్లు కళ్లు మూసి తెరవడం వల్ల ఒత్తిడి మాయమవుతుంది.కనుగుడ్లను కిందికి, పైకి కనీసం పదిసార్లు కదిలించాలి.కుడి నుంచి ఎడమకు, ఎడమ నుంచి కుడికి కనీసం పదిహేను సార్లు తిప్పాలి.ఎదురుగా ఉన్న గోడపై గుర్తుపెట్టి దానిపై దృష్టిని కేంద్రీకరించి చూపు మెరుగు పరుచుకోవచ్చు.మంచి నీరు, పళ్ల రసాలు ఎక్కువగా తాగడం ద్వారా కంటి సమస్యను జయించవచ్చు.రోజుకు ఎనిమిది గంటలు నిద్రపోవాలి.దోస కీర ముక్కలను కనురెప్పలపై ఉంచడం వల్ల ఒత్తిడి మాయమవడంతో పాటు కలర్ కూడా మెరుగు పడుతుంది.
- డాక్టర్ రవీందర్‌గౌడ్, కంటి వైద్య నిపుణుడు
ఇండియన్ ఆప్తమాలజీ సొసైటీ ప్రకారం
వైద్యులకు అందుతున్న ఫిర్యాదులు ఇలా..
కళ్లు అలసి పోవడం 64.95 శాతం
ఒత్తిడికి గురికావడం 48.83 శాతం
తలనొప్పి 45.68 శాతం
మెడ, భుజాలనొప్పి 44.01శాతం
ఇరిటేషన్‌కు గురికావడం 37.5 శాతం
కళ్లల్లో మంట/దురద 34.38 శాతం
రెండు దృశ్యాలు కన్పించడం 30.48 శాతం
కంటి నుంచి నీరు కారడం 14.78 శాతం