చార్మినార్ కట్టడం సమీపంలోని బండికా అడ్డా ప్రాంతంలో ఈనెల 12న తవ్వకాల్లో...
శాలిబండ: చార్మినార్ కట్టడం సమీపంలోని బండి కా అడ్డా ప్రాంతంలో ఈనెల 12న తవ్వకాల్లో బయటపడ్డ నిర్మాణాల్లో సొరంగం లేదని చార్మినార్ ఏసీపీ కె.అశోక చక్రవర్తి స్పష్టం చేశారు. గతంలో ఇక్కడ పోలీస్ బ్యారెక్స్ ఉండేవని, ప్రస్తుతం తవ్వకాలు జరుపుతుండగా బ్యారెక్స్ నిర్మాణాలు బయట పడ్డాయన్నారు. సొరంగం ఉందన్న మాటల్లో వాస్తవం లేదన్నారు. కాగా పోలీస్ క్వార్టర్స్ నిర్మాణ పనులు సోమవారం యథావిధిగా కొనసాగాయి.
పురావస్తు అధికారులకు నో ఎంట్రీ...!
బండికా అడ్డాలో ఆదివారం బయటపడిన భారీ గోతిని పరిశీలించేందుకు వచ్చిన పురావస్తు శాఖ డిప్యూటీ డెరైక్టర్ విజయ్ కుమార్ బృందానికి నిరాశ ఎదురైంది. స్థానిక పోలీసులు వారిని గోతి వద్దకు రాకుండా అడ్డుకున్నారు. నగర పోలీస్ కమిషనర్ అనుమతి లేనందున అక్కడికి వెళ్లనివ్వబోమని స్పష్టం చేశారు. దీంతో చేసేది లేక అధికారులు వెనుదిరిగారు. కాగా, నిర్మాణ పనులు జరుగుతున్న పోలీస్ క్వార్టర్స్ స్థలంలోకి పురావస్తు శాఖ అధికారులు అడుగుపెడితే వారు ఆ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుంటారనే అనుమానంతోనే ఆ శాఖ అధికారులను పోలీసులు అడ్డుకున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
అది రహస్య స్థావరం: పురావస్తుశాఖ డీడీ
సాక్షి,సిటీబ్యూరో: చార్మినార్ సమీపంలోని బండి కా అడ్డాలో బయటపడింది సొరంగ మార్గం కాదని తెలంగాణ రాష్ట్ర పురావస్తుశాఖ డిప్యూటీ డెరైక్టర్ జె.విజయ్‌కుమార్ తెలిపారు. సోమవారం ఆయన సాక్షితో మాట్లాడారు. పోలీసుల ఆధీనంలో ఉన్న ఆ ప్రాంతంలో పోలీస్ క్వార్టర్స్ నిర్మాణం కోసం త్వకాలు చేపట్టగా భారీ సొరంగం ఆనవాళ్లు కన్పించాయని, అయితే, అది అందరూ అనుకున్నట్టు సొరంగం కాదన్నారు. ఇది శుత్రువుల దాడి నుంచి రక్షించుకొనేందుకు కుతుబ్‌షాహీల కాలంలో భూగర్భంలో నిర్మించిన రహస్య స్థావరం, సీక్రెట్ సెల్‌గా భావిస్తున్నామన్నారు.