సాక్షి, హైదరాబాద్: తమ నుంచి తీసుకున్న రూ.604 కోట్ల రుణాన్ని తిరిగి చెల్లించడంలో ప్రముఖ నిర్మాణ సంస్థ ఐవీఆర్‌సీఎల్ లిమిటెడ్ విఫలమైన నేపథ్యంలో ఆ సంస్థ దివాలా ప్రక్రియను ప్రారంభించాలంటూ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దాఖలు చేసిన కంపెనీ పిటిషన్‌పై నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ (ఎన్‌సీఎల్‌టీ) స్పందించింది. ఐవీఆర్‌సీఎల్ లిమిటెడ్ దివాలా ప్రక్రియ (సీఐఆర్‌పీ)ను ప్రారంభించేందుకు అనుమతినిచ్చింది.
ఇందులో భాగంగా దివాలా పరిష్కారదారు (ఐఆర్‌పీ)గా కోల్‌కతాకు చెందిన సుతను సిన్హాను నియమించింది. ఈ మేరకు ఎన్‌సీఎల్‌టీ జ్యుడీషియల్ సభ్యులు విత్తనాల రాజేశ్వరరావు, సాంకేతిక సభ్యులు రవి కుమార్ దురైస్వామిలతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. తన ఉత్తర్వుల్లో ధర్మాసనం ఐవీఆర్‌సీఎల్‌కు పలు ఆదేశాలు జారీ చేసింది.
ఐఆర్‌పీకి సహకరించాలని ఆదేశం
దివాలా ప్రక్రియ విషయంలో ఐఆర్‌పీకి పూర్తిస్థాయిలో సహకరించాలని ఐవీఆర్‌సీఎల్‌కు ధర్మాసనం తేల్చి చెప్పింది. అన్ని రికార్డులను ఐఆర్‌పీకి అందుబాటులో ఉంచాలంది. అంతేకాక కంపెనీ ఆస్తులను అమ్మడం గాని, అన్యాక్రాంతం చేయడం గాని చేయరాదంది. అంతేకాక తాకట్టు పెట్టిన ఆస్తులు ఏవైనా ఉంటే, ఆ ఆస్తులను అమ్మడానికి వీల్లేదని స్పష్టం చేసింది. అలాగే దివాలా ప్రక్రియ ప్రారంభం కాగానే ఆ విషయాన్ని బహిరంగంగా తెలియజేయాలని ఐఆర్‌పీని ధర్మాసనం ఆదేశించింది.
ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్‌రప్టసీ బోర్డ్ ఆఫ్ ఇండియా (ఐబీబీఐ) వెబ్‌సైట్‌లో ఉంచడంతో పాటు, పత్రికల్లో సైతం ప్రకటనలు ఇవ్వాలంది. అలాగే ఐవీఆర్‌సీఎల్ వెబ్‌సైట్‌లో కూడా దివాలా ప్రక్రియ గురించి తెలియజేయాలని ఆ సంస్థను ఆదేశించింది. దివాలా ప్రక్రియకు సంబంధించి అన్ని పార్టీలతో సమావేశం నిర్వహించాలని ఐఆర్‌పీని ఆదేశించింది. మొత్తం ప్రక్రియను 180 రోజుల్లో పూర్తి చేయాలంది.
అప్పటి లోపు ఇప్పటి వరకు ఏం చేశారో తెలియజేస్తూ పూర్తి వివరాలతో ఓ అఫిడవిట్‌ను తమ ముందుంచాలని ఐఆర్‌పీకి ధర్మాసనం స్పష్టం చేసింది. తదుపరి విచారణను ఈ నెల 19కి వాయిదా వేసింది. 2014, 15 సంవత్సరాల్లో ఎస్‌బీఐ 6 ఖాతాల కింద ఐవీఆర్‌సీఎల్ లిమిటెడ్‌కు రూ.898.49 కోట్ల మేర రుణం మంజూరు చేసింది. అయితే ఇందులో కొంత మొత్తం చెల్లించిన ఐవీఆర్‌సీఎల్, గత ఏడాది అక్టోబర్ నాటికి రూ.604.15 కోట్ల మేర బకాయి పడింది.
Comments
Please login to add a commentAdd a comment