ఈసారీ జంబ్లింగ్ వాయిదా
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
ఏ కాలేజీకి ఆ కాలేజీలోనే.. ఉన్నత స్థాయి సమీక్షలో నిర్ణయం
{పైవేటు యాజమాన్యాల ఒత్తిడే కారణమా?
హైదరాబాద్: ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల్లో జంబ్లింగ్ విధానం అమలు చేయవద్దని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సోమవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అధ్యక్షతన జరిగిన సమీక్షలో ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వచ్చే ఫిబ్రవరి 3 నుంచి 24వ తేదీ వరకు ఈ ప్రాక్టికల్ పరీక్షలను ఏ కాలేజీ విద్యార్థులకు ఆయా కాలేజీల్లోనే నిర్వహిస్తారు. ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల నిర్వహణలో జంబ్లింగ్ విధానం అమ లు చేస్తామని, ఒక కాలేజీ విద్యార్థులకు ఆ కాలేజీలో కాకుండా వేరే కాలేజీలో నిర్వహించే లా (ప్రాక్టికల్ పరీక్ష కేంద్రాల జంబ్లింగ్) చర్యలు చేపడతామని ఏటా విద్యాశాఖ మంత్రులు ముందుగా ప్రకటిస్తూనే ఉన్నారు. కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థల ఒత్తిడి తలొగ్గి జంబ్లింగ్ అమలు వాయిదా వేస్తూనే ఉన్నారు. 2014, 2015 వార్షిక పరీక్షల సమయంలో ఇదే జరిగింది. తాజాగా ఈ సారి కూడా జంబ్లింగ్ అమలును వాయిదా వేశారు.
దీంతో కార్పొరేట్, ప్రైవేటు విద్యా సంస్థలు తమ విద్యార్థులకు ఇష్టారాజ్యంగా ప్రాక్టికల్ మార్కులు వేసుకునే అవకాశం ఉంది. అయితే ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల మధ్య పోటీ వాతావరణంలో విద్యార్థులు నష్టపోయే పరిస్థితి ఉన్నందున జంబ్లింగ్‌ను వాయిదా వేసినట్లు కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఒక్క మార్కు తేడాతోనూ ఎంసెట్‌లో ర్యాంకులు మారిపోయే పరిస్థితి ఉందన్నారు. ప్రభుత్వ విద్యార్థులకు నష్టం వాటిల్లే ప్రమాదముండడంతోపాటు ప్రైవేటు యాజమాన్యాలు కూడా జంబ్లింగ్‌ను వాయిదా వేయాలని కోరడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు.