కేటీఆర్.. అహంకారం మంచిది కాదు
పాతాళానికి ఎవరుపోతారో చూద్దాం: జానా, షబ్బీర్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీని పాతాళానికి తొక్కాలని కుసంస్కారంతో మాట్లాడిన మంత్రి కేటీఆర్ వ్యాఖ్యలను ఖండిస్తున్నామని కాంగ్రెస్ శాసనసభాపక్ష నాయకుడు కె.జానారెడ్డి, ఉపనేత టి.జీవన్‌రెడ్డి, శాసనమండలిలో విపక్ష నేత షబ్బీర్ అలీ అన్నారు. గాంధీభవన్‌లో సోమవారం వారు విలేకరులతో మాట్లాడారు.
కుసంస్కారం కలిగినవారు మంత్రులైనా, మరెవరైనా ఒక్కటేనని జానారెడ్డి వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ గురించి నోటికొచ్చి నట్టుగా మాట్లాడిన ఎన్నో పార్టీలు పాతాళానికి వెళ్లడం కాంగ్రెస్ పార్టీ చూసింద న్నారు. కాంగ్రెస్ పార్టీని తిడితే ఆకాశంపై ఉమ్మివేసినట్టేనని షబ్బీర్ అలీ అన్నారు. అహంకారం తలకెక్కిన మంత్రి కేటీఆర్‌ను రాళ్లతోకొట్టే రోజు త్వరలోనే ఉందని హెచ్చరించారు. జీవన్‌రెడ్డి మాట్లాడుతూ, మంత్రి కేటీఆర్‌కు రోజులు దగ్గరప డుతు న్నాయని హెచ్చరించారు. ఎవరు పాతాళానికి వెళ్తారో చూద్దామని సవాల్ చేశారు.
తప్పుడు కేసులతో తలవంపులు తేవద్దు: రాజకీయ ప్రత్యర్థులపై తప్పుడు కేసులుపెట్టి పోలీసు వ్యవస్థకు ప్రభుత్వం తలవం పులు తెస్తోందని జానారెడ్డి, షబ్బీర్ అలీ, జీవన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. వరంగల్‌లో టీఆర్‌ఎస్ నేతను హత్య చేసినవారు స్వయంగా లొంగిపోయారని, అయినా కాంగ్రెస్ నేత రాజేందర్‌రెడ్డిపై కేసు పెట్టడం అన్యాయమని అన్నారు. హతునితో రాజకీయ వైరాన్ని సాకుగా చూపించి, కేసును బనాయించడం రాజకీయాల్లో మంచిదికాదని, ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే తీవ్ర పరిణామాలుంటాయని జానారెడ్డి, షబ్బీర్‌అలీ హెచ్చరించారు.