
విలీనం ముమ్మాటికీ తప్పు: జానారెడ్డి
♦ టీడీపీ ఎమ్మెల్యేలపై స్పీకర్ నిర్ణయాన్ని తప్పుబట్టిన సీఎల్పీనేత
♦ అసెంబ్లీలోనూ నిలదీస్తాం
♦ కొత్త రాష్ట్రంలో ఇదేనా నూతన ఒరవడి?
♦ ప్రజాస్వామికవాదులు స్పందించాలని విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: పార్టీ ఫిరాయించిన టీడీపీ శాసనసభ్యులను టీఆర్‌ఎస్‌లో విలీనం చేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయం ముమ్మాటికీ తప్పు అని ప్రతిపక్షనాయకుడు కె.జానారెడ్డి వ్యాఖ్యానించారు. శుక్రవారం అసెంబ్లీ ఆవరణలోని సీఎల్పీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, విలీన నిర్ణయం అనైతికమన్నారు. పార్టీ ఫిరాయింపులు, ప్రతిపక్షపార్టీల శాసనసభ్యులను అధికారపార్టీలో విలీనం చేస్తూ స్పీకర్ తీసుకున్న నిర్ణయంపై ప్రజాస్వామ్యవాదులు, మీడియా, మేధావులు స్పందించాలని విజ్ఞప్తి చేశారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ఏడాదిగా స్పీకరుకు ఫిర్యాదుచేస్తున్నామని జానారెడ్డి వెల్లడించారు.
వీరిపై చర్యలు కోరుతూ ఇచ్చిన పిటిషన్లు స్పీకర్ దగ్గర పెండింగులో ఉండగానే ఫిరాయించిన ఎమ్మెల్యేలను అధికార పార్టీలో విలీనం చేస్తూ ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్రశ్నించారు. ఏడాది కిందటి ఫిర్యాదులను పట్టించుకోకుండా రెండురోజుల క్రితం విలీనం చేయాలంటూ వారు లేఖలు ఇస్తే దానిపై నిర్ణయం తీసుకోవడం ఎంతవరకు సమంజసమన్నారు. రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించాల్సిన స్పీకరే ఇలాంటి నిర్ణయాన్ని తీసుకుంటే ఇంకా ఎవరికి చెప్పుకోవాలని జానారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. స్పీకర్ తీసుకున్న నిర్ణయం తప్పు, తప్పు, తప్పు అని జానారెడ్డి వ్యాఖ్యానించారు. తమ ఫిర్యాదులను పట్టించుకోనందుకు న్యాయస్థానంలో పోరాడుతామని ప్రకటించారు.
కొత్తగా ఏర్పాటైన రాష్ట్రంలో ప్రభుత్వం భావితరాలకు ఆదర్శంగా ఉంటుందని భావించామన్నారు. ఇదేనా కొత్త ప్రభుత్వం అనుసరిస్తున్న కొత్త విధానాలు అని ప్రశ్నించారు. ధర్మాన్ని నిలబెట్టాల్సినవారే హరిస్తుంటే ఇంకా ప్రజాస్వామ్యానికి అర్థం ఏముందన్నారు. అసెంబ్లీలోనే దీనిపై నిలదీస్తామన్నారు. భవిష్యత్తులో ఏం చేయాలనేదానిపై రాజ్యాంగ నిపుణులతో చర్చిస్తామని వెల్లడించారు. స్పీకర్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టాలనే ఆలోచనలేదన్నారు. అవిశ్వాసం పెడితే నెగ్గడానికి అవసరమైన బలం తమకు లేదన్నారు. అలా తీర్మానం పెడితే చర్చకు తప్ప నెగ్గడానికి ఉపయోగపడదన్నారు. మెజారిటీ ఉంది కదా అని ప్రతిపక్షాలను అణచి వేయాలనే ధోరణి ఎవరికైనా మంచిది కాదని జానారెడ్డి హెచ్చరించారు.
సభా నిర్వహణకు సహకరించాలన్నారు
అనివార్య పరిస్థితుల వల్ల బడ్జెట్ సమావేశాలను ప్రారంభించడానికి ఆలస్యమైందని, బడ్జెట్‌ను ఆమోదించడానికి ఆదివారాల్లోనూ శాసనసభను నడిపించడానికి సహకరించాలంటూ అధికారపక్షం కోరిందని జానారెడ్డి వెల్లడించారు. తక్కువ సమయం ఉన్నందున సెలవురోజుల్లోనూ సభను నడిపించడానికి అంగీకరించినట్టు చెప్పారు. శీతాకాల సమావేశాలను కూడా నిర్వహించలేదన్నారు. ఇది సరికాదన్నారు. ప్రశ్నోత్తరాల తర్వాత వాయిదా తీర్మానాలపై చర్చించాలనే నిర్ణయం సరికాదన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ సభ్యుడు రాంరెడ్డి వెంకటరెడ్డి మృతితో ఏర్పడిన ఖాళీలో పోటీ పెట్టకుండా, ఏకగ్రీవం చేయాలన్న తమ సభ్యుడు పువ్వాడ అజయ్ ప్రతిపాదనకు ప్రభుత్వం స్పందించలేదని జానారెడ్డి చెప్పారు. మహారాష్ట్రతో రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా చేసుకున్న జల ఒప్పందంతో సాధించిందేమీ లేదన్నారు. దీనివల్ల తెలంగాణకు తీవ్ర నష్టమని, కేవలం మహారాష్ట్రకు ఉపయోగపడేలా ఒప్పందం చేసుకున్నారని విమర్శించారు.