
హోదా తెస్తే పవన్‌కు అనుచరుడిగా మారతా
ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి ప్రత్యేక హోదా తెస్తానంటే ఎంపీలంతా టీడీపీకి రాజీనామా చేసి జనసేన అధినేత పవన్ కల్యాణ్ వెంటే నడుస్తామని టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి సవాల్ చేశారు. తామంతా ఏం చేయాలో, ఎలా చేయాలో చెబితే అలాగే నడుచుకుంటామన్నారు. ఆదివారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ హోదా తీసుకొస్తే పవన్‌కు అనుచరుడిగా మారిపోతానని వ్యాఖ్యానించారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం స్పష్టమైన వైఖరితో రావాలని పవన్‌కు సూచించారు. అంతే కాని నోరు ఉంది కదా అని ఇష్టానుసారం మాట్లాడటం సరికాదని మండిపడ్డారు. తమకు హిందీ రాకపోవచ్చు గానీ, ఇంగ్లిష్ వచ్చని అన్నారు. మూర్ఖపు కేంద్ర ప్రభుత్వం తమ మాట విననంత మాత్రాన తమని నిందించడం తగదన్నారు. ఏపీ ఎంపీలంతా రాజీనామా చేసినా నరేంద్ర మోదీకి ఏమీ కాదని చెప్పారు. హోదా విషయంలో మోదీ పట్టుదలతో ఉన్నారు.. ఏపీ పట్ల వ్యతిరేకత స్పష్టంగా చూపిస్తున్నారని ఆరోపించారు.
మోదీకి దేవుడు మంచి బుద్ధి ఇవ్వాలని కోరారు.
దేశానికి ద్రోహం చేసింది గాంధీ, నెహ్రూలే: దేశానికి అత్యంత ద్రోహం చేసింది మహాత్మాగాంధీ, నెహ్రూయేనంటూ జేసీ దివాకర్‌రెడ్డి ఆరోపించారు. ప్రధానమైన తప్పిదం పాకిస్తాన్‌ను విభజించడానికి ఒప్పుకోవడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు.