ఏప్రిల్ 2న జేఈఈ మెయిన్!
ఈ నెల చివరి వారంలో నోటిఫికేషన్.. డిసెంబర్ 1 నుంచి రిజిస్ట్రేషన్లు
సాక్షి, హైదరాబాద్: ఎన్‌ఐటీ, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు నిర్వహించే జేఈఈ మెయిన్ రాత పరీక్షను 2017-18 విద్యా సంవత్సరంలో ప్రవేశాల కోసం వచ్చే ఏడాది ఏప్రిల్ 2న నిర్వహించేందుకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను అక్టోబర్ చివరి వారం లేదా నవంబర్ మొదటి వారంలో జారీ చేసే అవకాశముంది. ఇందుకోసం వెబ్‌సైట్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టినట్లు సమాచారం. డిసెంబర్ 1 నుంచి రిజిస్ట్రేషన్‌కు అవకాశం కల్పించేందుకు చర్యలు చేపడుతోంది.
ఏప్రిల్ మొదటి ఆదివారం (2న) జేఈఈ మెయిన్ ఆఫ్‌లైన్ పరీక్షను నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. ఆ తర్వాత నాలుగైదు రోజులకు ఆన్‌లైన్ పరీక్షలు వరుసగా నాలుగు రోజుల పాటు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. కాగా, మే 21న జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహిస్తామని ఇటీవల ఐఐటీల కౌన్సిల్ స్పష్టం చేసిన నేపథ్యంలో జేఈఈ మెయిన్ ఫలితాలను ఏప్రిల్ చివరి వారంలోనే ప్రకటించేందుకు సీబీఎస్‌ఈ కసరత్తు చేస్తోంది. ఫలితాలు వెల్లడించిన రోజు నుంచే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు రిజిస్ట్రేషన్‌ను ప్రారంభించనుంది.