రైతులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువు
సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి
కరీంనగర్: టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి, సీఎం కేసీఆర్‌కు రైతుల పట్ల చిత్తశుద్ధి లేదని, ప్రచార పటాటోపమే తప్ప చేసిందేమీ లేదని సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి ధ్వజ మెత్తారు. కరీంనగర్‌లో ఆదివారం టీపీ సీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు ఆరెపల్లి మోహన్‌తో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు.
రైతు సమస్యలపై సీఎం కేసీఆర్‌కు అవగాహన లేదని, రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు గిట్టుబాటు ధర లేక ఆత్మహత్యలు చేసుకుంటుంటే.. చోద్యం చూస్తున్నారని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం మద్దతు ధర చెల్లించడం లేదని ఆరోపించడం వరకే రాష్ట్ర ప్రభుత్వం పరి మితమవ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన వాగ్దానాలు అమలు కావడం లేదని, ప్రభుత్వ తీరును చూస్తుం టే మాటలు కోటలు దాటుతున్నా.. చేతలు గడప దాటడం లేదని ఎద్దేవా చేశారు.