20వేల ఎకరాలు ఎడారిగా మారాయి
బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి
కేసీఆర్ నాయకత్వంలో రైతుల సంక్షేమం కోసమే పని చేస్తున్నాం
అసెంబ్లీలో మాట్లాడిన ఆర్మూర్ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి
వేల్పూర్ : జిల్లాలోని ఎస్సారెస్పీ ప్రాజెక్టు ద్వారా 25 కిలోమీటర్ల వరకుకాకతీయ, వరద కాలువల తవ్వకం జరిగిందని బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. వాటి వల్ల 16 చెరువులు ధ్వంసం కాగా, ఆ చెరువుల కింద 20 వేల ఎకరాలకు భూగర్భజలాలు అందకుండా పోవడం తో ఆ భూములు ఎడారిగా మారాయని సభాపతికి వివరించారు. ఆ భూములకు నీటిసౌకర్యం కోసం శ్రీరాంసాగర్ నుంచి 5 టీఎంసీల నీటిని అధికారికంగా కేటాయించాలని కోరారు. నియోజకవర్గంలో వాల్టా చట్టం కింద 88 గ్రామాలుంటే, అందులో 44 గ్రామాలను డార్క్ ఏరియాగా ప్రకటించారన్నారు. డార్క్ ఏరియా కింద పేర్కొన్న గ్రామాలలో భూగర్భజలాలు లేవని బోర్లు వేసుకోనివ్వరని, దానివల్ల రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. వాల్టా చట్టాన్ని సమీక్షించి, భూగర్భ జలాలు పెరిగిన గ్రామాలను గుర్తింపజేయాలని కోరారు. అసెంబ్లీలో మాట్లాడే అవకాశం కల్పించినందుకు సీఎం కే సీఆర్‌కు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
ఉద్యమ నాయకుడిగా ఆర్మూర్ ప్రాంతానికి వచ్చిన కేసీఆర్, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని తనతో అన్నాడని.. అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో రైతుల సంక్షేమం కోసమే పనిచేస్తున్నామని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల్లో జీరో అవర్‌లో ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి శనివారం ప్రసంగించారు. గత ప్రభుత్వ పాలనలో ఆర్మూర్ ప్రాంత రైతాంగం ఎర్రజొన్నల డబ్బుల కోసం ఉద్యమాలు చేసిందన్నారు. తాను కూడా స్వయంగా ఆరు రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేశానని చెప్పారు. ఆ సమయంలో దీక్ష శిబిరాన్ని సందర్శించిన కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం చేపట్టాల్సిన కార్యక్రమాల గురించి తనతో మాట్లాడారని తెలిపారు. ఎన్నికల సమయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఎర్రజొన్న బకాయిలు చెల్లిస్తానని హామీ ఇచ్చిన సీఎం కేసీఆర్ హామీకి కట్టుబడి రెండు నెలల్లోనే పది కోట్ల ఎర్రజొన్న బకాయిలను విడుదల చేశారని అన్నారు. అదేవిధంగా దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోని నిర్ణయాన్ని వ్యవసాయ రుణాల మాఫీ విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం తీసుకుందన్నారు. రూ. నాలుగు వేల 250 కోట్ల వ్యవసాయ రుణాలను సింగిల్ చెక్ ద్వారా బ్యాంకులకు చెల్లించిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. అంతేకాకుండా రూ. 480 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతులకు అందజేసిందని అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా డిమాండ్ ఉన్న పసుపును ఆర్మూర్ ప్రాంత రైతులు పండిస్తున్నారని అన్నారు. కానీ గత ప్రభుత్వాల చర్యల కారణంగా గిట్టుబాటు ధర లభించక పసుపు రైతులు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అందుకే ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో పసుపు రైతుల సంక్షేమం కోసం కృషి చేస్తున్నామని అన్నారు. పసుపునకు పార్కు, పరిశోధన కేంద్రం, శుద్ధి కర్మాగారం ఏర్పాటు చేయించి పసుపు రైతులకు గిట్టుబాటు ధర ఇప్పించే ప్రయత్నాలను ప్రారంభించానని అన్నారు.
రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు..
Published Sun, Nov 16 2014 2:40 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement