7 నెలలెందుకు.. తక్షణమే ఇవ్వండి
వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లపై జీవన్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దరఖాస్తు చేసుకున్న రైతులందరికీ 7 నెలల్లోగా వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లను మంజూరు చేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించడం.. రైతులను మోసం చేయడమేనని సీఎల్పీ ఉపనేత టి.జీవన్‌రెడ్డి అన్నారు. కనెక్షన్ల కోసం డీడీలు కట్టి నెలల తరబడి ఎదురుచూస్తున్న రైతులకు తక్షణమే విద్యుత్ కనెక్షన్లు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. బుధవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే రైతులంతా విద్యుత్ కనెక్షన్ల కోసం ఐదేళ్లుగా వేచి చూస్తున్నారని, మళ్లీ 7 నెలలు ఆగాలనడం సరికాదని అన్నారు. 2004కు ముందు రైతులపై అక్రమ కేసులు పెట్టి పెద్ద ఎత్తున చార్జీలు వసూలు చేస్తే, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఉచిత విద్యుత్‌ను అమలు చేసి వ్యవసాయాన్ని పండుగలా చేశామన్నారు. టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఒక్క విద్యుత్ కనెక్షన్ కూడా ఇవ్వలేదన్నారు.
గిట్టుబాటు ధర కల్పించండి: మల్లు రవి
రాష్ట్రంలో తీవ్రమైన నష్టాల్లో ఉన్న రైతాంగం పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకోవాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు మల్లు రవి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించని పక్షంలో వారు తీవ్రంగా నష్టపోయే ప్రమాదముందని హెచ్చరించారు. రైతు సమస్యలపై తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం ఉద్యమిస్తుంటే...ఆయనను అవమానించేలా మాట్లాడటం టీఆర్‌ఎస్‌కు సరికాదని అన్నారు.