న్యాయ వ్యవస్థపై తప్పుడు అభిప్రాయం కలుగుతుంది!
‘జబర్దస్త్’ కేసులో ఉమ్మడి హైకోర్టు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: ‘టీవీ కార్యక్రమాలు ముఖ్యంగా హాస్య ప్రధాన కార్యక్రమాలను ప్రజలు విస్తృతంగా వీక్షిస్తుంటారు. కొద్దిపాటి అక్షరాస్యత ఉన్న వారు, నిరక్ష్యరాస్యులు, గ్రామీణ నేపథ్యం కలిగిన వారు ఆయా హాస్య ప్రధాన కార్యక్రమాల్లో న్యాయమూర్తులు, న్యాయ వాదులను ఉద్దేశించి పలికే డైలాగులను బట్టి న్యాయ స్థానాల్లో కార్యకలాపాలు ఇలానే జరుగుతాయని నమ్మే అవకాశం ఉంది. అటువంటి కార్యక్రమాలు సాధారణ ప్రజానీకం మనస్సుల్లో న్యాయ వ్యవస్థపై తప్పుడు అభి ప్రాయం కలిగించే ప్రమాదం ఉంది. దీనివల్ల న్యాయ మూర్తులు, న్యాయవాదుల ప్రతిష్టకు, హుందాతనానికి భంగం కలుగుతుంది’ అని ఉమ్మడి హైకోర్టు పేర్కొంది.
అయితే జబర్దస్త్ వంటి కార్యక్రమాలపై చట్టపరంగా ఎటువంటి నిషేధంగానీ, నియంత్రణగానీ లేదని, ఇటువంటి వాటి నియంత్రణకు మార్గదర్శకాలు రూపొందిస్తే తప్ప న్యాయవ్యవస్థ ప్రతిష్టను దిగ జార్చే కార్యక్రమాలను అడ్డుకోవడం కష్టసాధ్యమని తెలిపింది. ఇదే సమయంలో అనిర్ధిష్ట బృందాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు పరువు నష్టం కిందకు రావంటూ జబర్దస్త్ టీంపై దాఖలైన కేసును కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ ఎం.సత్యనారాయణ మూర్తి ఇటీవల తీర్పు వెలువరించారు. 2014 జూలై 10న జబర్దస్త్ షోలో న్యాయ వ్యవస్థను కించపరిచేలా స్కిట్‌ను ప్రదర్శించారంటూ సదరు కార్యక్రమం న్యాయనిర్ణేతలు నాగేంద్రబాబు, రోజా, యాంకర్లు అనసూయ, రష్మీ, ఇతర కళాకారులపై న్యాయవాది వై.అరుణ్‌కుమార్ కరీంనగర్ జిల్లా హుజురాబాద్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ కేసును కొట్టేయాలంటూ నాగేంద్రబాబు, రోజా తదితరులు హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై విచారణ జరిపిన న్యాయమూర్తి.. నాగేంద్రబాబు తదితరులపై దాఖలు చేసిన కేసును కొట్టేస్తున్నట్లు పేర్కొన్నారు.