పోల‘వరం’పై ఇంత నిర్లక్ష్యమా?
♦ ఇన్ని రోజులుగా పూర్తి చేసింది 15 శాతం పనులేనా..?
♦ ఇలాగైతే అదనపు నిధులు మంజూరు చేయాలని ఎలా ప్రతిపాదిస్తాం?
♦ రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసిన జాయింట్ పార్లమెంటరీ కమిటీ
సాక్షి, హైదరాబాద్: ‘పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో మరీ ఇంత నిర్లక్ష్యమా.. సీడబ్ల్యూసీ (కేంద్ర జల సంఘం), పీపీఏ(పోలవరం ప్రాజెక్టు అథారిటీ)లను ఉత్సవ విగ్రహాలుగా మార్చడంలో ఆంతర్యమేమిటి.. కేంద్రం ఇప్పటి వరకు విడుదల చేసిన నిధుల వినియోగానికి సంబంధించిన లెక్కలు చెప్పకుండా పోలవరం ప్రాజెక్టుకు అదనపు నిధులు మంజూరు చేయాలని మేం ఎలా ప్రతిపాదించగలం.. ఇప్పటి దాకా పూర్తి చేసింది కేవలం 15 శాతం పనులేనా.. కనీసం సమగ్ర ప్రణాళిక కూడా రూపొందించుకోలేరా..’ అంటూ జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ- జలవనరులు) రాష్ట్ర ప్రభుత్వాన్ని నిలదీసింది.
పోలవరం నిర్మాణ పనులకు సంబంధించి ఇప్పటికీ సమగ్ర ప్రణాళిక రూపొందించకపోవడాన్ని బట్టి చూస్తే, ప్రాజెక్టును పూర్తి చేయడంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో తెలుస్తోందంటూ జేపీసీ ఛైర్మన్ హుకుంసింగ్, సభ్యులు.. రాష్ట్ర ప్రభుత్వ తీరును తూర్పారబట్టినట్లు సమాచారం. గోదావరి, కృష్ణా నదీ పరివాహక ప్రాంతాల్లోని ప్రాజెక్టుల స్థితిగతులు, కేంద్రం నిధులతో చేపట్టిన ప్రాజెక్టుల పురోగతి, నీటి లభ్యత తదితర అంశాలపై ైహైదరాబాద్‌లోని నోవాటెల్ హోటల్‌లో శనివారం జేపీసీ సమీక్షించింది. కేంద్రం జాతీయ ప్రాజెక్టుగా ప్రకటించిన పోలవరంను సకాలంలో పూర్తి చేయడానికి ఉదారంగా నిధులు మంజూరు చేయాలని జలవనరుల శాఖ ముఖ్య కార్యదర్శి శశిభూషణ్ కుమార్ కోరుతూ తక్షణం రూ.1500 కోట్లు విడుదల చేసేలా చూడాలని జేపీసీని అభ్యర్థించినట్లు సమాచారం.
లెక్కలు చెప్పండంటే స్పందించరా?
పోలవరం ప్రాజెక్టు పనుల్లో పురోగతిని సమీక్షించే సమయంలో కూడా రాష్ట్ర సర్కార్ తీరుపై జేపీసీ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘ప్రాజెక్టు హెడ్ వర్క్స్ చేపట్టి ఇప్పటికి 40 నెలలు కావస్తోంది. 20 నెలల్లో పనులు పూర్తి చేస్తామని చెబుతున్నారు. క్షేత్ర స్థాయిలో మాత్రం కేవలం 15 శాతం పనులు మాత్రమే పూర్తయినట్లు కేంద్ర జలవనరుల శాఖ మంత్రి ఉమాభారతి, పీపీఏ ఛైర్మన్ అమర్జీత్ సింగ్‌లకు ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ నివేదిక ఇచ్చింది.
ఇప్పటి వర కు కేంద్రం విడుదల చేసిన నిధుల వినియోగానికి సంబంధించిన లెక్కలు (యుటిలిటీ సర్టిఫికెట్) చెప్పాలంటూ పీపీఏ మూడు సార్లు లేఖలు రాసినా స్పందించక పోవడంలో ఆంతర్యమేమిటి? కనీసం ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించిన సమగ్ర ప్రణాళిక నివేదికను కూడా రూపొందించకపోతే.. ఆ ప్రాజెక్టును ఎలా పూర్తి చేస్తారు?’ అంటూ జేపీసీ చైర్మన్ హుకుం సింగ్ ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలిసింది.
ఇష్టానుసారం డిజైన్ మారుస్తారా?
‘పోలవరం డ్యాం నిర్మాణంలో ఇష్టానుసారం డిజైన్ మారుస్తారా.. గోదావరి ట్రిబ్యునల్ ప్రకారం సీడబ్ల్యూసీ రూపొందించిన డిజైన్ల మేరకే ప్రాజెక్టు నిర్మాణాన్ని చేపట్టాలి. డిజైన్ల అంశంలో సీడబ్ల్యూసీని ఎలా విస్మరిస్తారు?’ అంటూ పోలవరం ప్రాజెక్టు అథారిటీ(పీపీఏ) సభ్య కార్యదర్శి ఆర్కే గుప్తాను, రాష్ట్ర ప్రభుత్వాన్ని జేపీసీ సభ్యుడు, ఒడిశా ఎంపీ మహంతి ప్రశ్నించారని తెలిసింది. పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి కొరవడిందని.. కాంట్రాక్టు సంస్థ సక్రమంగా పనులు చేయకపోయినా ఏమీ పట్టనట్లు వ్యవహరించడమే అందుకు నిదర్శనమని ఉన్నత స్థాయి నిపుణుల కమిటీ ఇటీవల కేంద్రానికి నివేదిక ఇచ్చిన విషయం విదితమే.