సొంత ఊళ్లకు పయనం
సాక్షి, సిటీబ్యూరో : సొంత ఊళ్లలో ఓటు హక్కును వినియోగించుకొనేందుకు మూడు రోజులుగా సీమాంధ్రకు తరలివెళ్తున్న ప్రయాణికుల రద్దీ మంగళవారం తారాస్థాయికి చేరుకుంది. బుధవారం ఎన్నికలు కావడంతో నగరవాసులు భారీ సంఖ్యలో బయలుదేరారు. దీంతో నగరంలోని రైల్వేస్టేషన్‌లు, బస్‌స్టేషన్‌లు కిటకిటలాడాయి. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్రయాణికుల రద్దీని నియంత్రించేందుకు ప్రత్యేకంగా బందోబస్తును ఏర్పాటు చేశారు.
బస్సులు, రైళ్లలోనే కాకుండా లక్షలాది మంది ప్రజలు సొంత వాహనాలు, ట్యాక్సీల్లో బయలుదేరి వెళ్లారు. మూడు రోజులుగా చార్జీలు రెట్టింపు చేసిన ప్రైవేట్ ఆపరేటర్లు మంగళవారం కూడా దోపిడీ కొనసాగించారు. అయితే పోటీలో ఉన్న అభ్యర్థులే ప్రయాణ చార్జీలను భరిస్తుండడంతో ప్రయాణికులు చార్జీలు రెట్టింపయినా లెక్క చేయకుండా బయలుదేరారు. మంగళవారం ఒక్క రోజే సుమారు ఐదు లక్షల మంది బయలుదేరినట్లు అంచనా.
కిక్కిరిసిన ఎంజీబీఎస్ ...
మహాత్మాగాంధీ బస్‌స్టేషన్ ప్రయాణికులతో కిక్కిరిసింది. రోజూ నడిచే 850 దూరప్రాంత బస్సులతో పాటు, మంగళవారం మరో 700 బస్సులను అదనంగా ఏర్పాటు చేశారు. విశాఖ, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, కర్నూలు, కడప, నె ల్లూరు, తిరుపతి తదితర ప్రాంతాలకు ప్రయాణికులు బయలుదేరి వెళ్లారు. ప్రైవేట్ బస్సులు సైతం కిటకిటలాడాయి. కూకట్‌పల్లిహౌసింగ్‌బోర్డు, అమీర్‌పేట్, లక్డీకాపూల్, కోఠి, అబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్, వనస్థలిపురం, తదితర ప్రాంతాల నుంచి ప్రైవేట్ బస్సులు బయలుదేరాయి.
ప్రయాణికుల ధర్నా..
సికింద్రాబాద్ నుంచి రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాలకు వెళ్లే ప్రధాన ఎక్స్‌ప్రెస్‌ల వద్ద గందరగోళం నెలకొంది. వెయిటింగ్ లిస్టు ప్రయాణికులు, రిజర్వేషన్ నిర్ధరణకాని వాళ్లు, జనరల్ బోగీ ప్రయాణికుల నుంచి తీవ్రమైన ఒత్తిడి రావడంతో వారిని స్లీపర్‌క్లాస్ బోగీల్లోకి అనుమతించారు. దీంతో అప్పటికే స్లీపర్‌క్లాస్‌లో రిజర్వేషన్లు చేసుకున్న ప్రయాణికులు ఆందోళనకు గురయ్యారు. సాధారణ ప్రయాణికులంతా బోగీల్లోకి ఎక్కేయగా రిజర్వేషన్ ప్రయాణికులు ప్లాట్‌ఫామ్‌పైనే ఉండిపోవలసి వచ్చింది.
విశాఖకు వెళ్లవలసిన జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో ఇలాంటి పరిస్థితే చోటుచేసుకుంది. కొంతమంది టీసీలు ప్రయాణికుల వద్ద అదనపు డబ్బులు తీసుకొని ఎస్-6 బోగీలోకి సాధారణ ప్రయాణికులను ఎక్కించడంతో 30 మందికి పైగా రిజర్వేషన్ ప్రయాణికులు స్టేషన్ మేనేజర్ కార్యాలయం వద్ద ధర్నాకు దిగారు. దీంతో మరో రైలులో వారిని విశాఖకు పంపించేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు.
ఎంజీబీఎస్ వద్ద ప్రయాణికుల అభిప్రాయాలు..
ఓటు వేసేందుకు వచ్చా..
నేను మహారాష్ట్ర ఉద్దిర్‌లో వ్యాపారం చేస్తున్నా. ఎన్నికల్లో ఓటు వేసేందుకు వ్యాపారాన్ని మానుకుని మా స్వస్థలమైన చిత్తూరు జిల్లా కలకడ మండలం, కోన గ్రామానికి వెళ్తున్నా. - నాగస్వామి నాయక్
బంధువులతో కలిసి..
పదేళ్ల క్రితం రాజమండ్రి నుంచి నగరానికి వచ్చి రంగారెడ్డి జిల్లా యమన్‌నగర్‌లో చిరు వ్యాపారం చేసుకుంటూ జీవిస్తున్నాం. ఎన్నికల్లో ఓటు వేసేందుకు మా బంధువులతో కలిసి రాజమండ్రికి వెళ్తున్నా. - ఎండపల్లి వీరవేణి
పనిమానేసి వెళ్తున్నా..
కొన్నేళ్ల క్రితం నగరానికి వచ్చి శంషాబాద్‌లో భవన నిర్మాణ కాంట్రాక్టర్‌గా పనిచేస్తున్నా. మా స్వస్థలమైన కావలి (నెల్లూరు జిల్లా) లో ఓటు వేసేందుకు పనిమానేసి వెళ్తున్నా. - శ్రీనివాస్, శంషాబాద్