‘జునూద్’... 27వ మాడ్యుల్!
1992 నుంచి నగరంలో ఊపందుకున్న మాడ్యుల్ సంస్కృతి
‘తెహరీఖ్’ మినహా అన్నీ బయట నుంచి వచ్చినవే
‘గత చరిత్రల్ని’ అధ్యయనం చేస్తున్న పోలీసు, నిఘా
సిటీబ్యూరో: జునూద్ అల్ ఖలీఫా ఏ హింద్... దేశ వ్యాప్తంగా పేలుళ్లకు కుట్రపన్ని జాతీయ దర్యాప్తు సంస్థకు చిక్కిన మాడ్యుల్ ఇది. గత నెలలో 12 నగరాల్లో చిక్కిన 14 మందిలో హైదరాబాద్‌కు చెందిన నలుగురు ఉన్నారు. దీంతో సహా ఇప్పటి వరకు నగరంలో వెలుగులోకి వచ్చిన మాడ్యుల్స్ సంఖ్య 27కు చేరింది. విదేశాల్లో ఉండే ఉగ్రవాద సంస్థలు... దేశీ ముష్కరులు ఏదైనా విధ్వంసానికి కుట్ర పన్నితే ఈ పని చేసేందుకు ముందుగా కొందరిని ఎంచుకుంటారు. వీళ్లు ఒకరికి ఒకరు తెలిసి ఉండచ్చు లేదా తెలియకపోవచ్చు. అయినా కొన్ని లింకుల ద్వారా వీరంతా బృందంగా ఏర్పడి అనుకున్న పనిని ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు. దీన్నే మాడ్యుల్ అంటారు. ‘జునూద్’కు చెందిన నలుగురు సిటీలో చిక్కడంతో పోలీసు, నిఘా వర్గాలు 1992లో జరిగిన అదనపు ఎస్పీ కృష్ణప్రసాద్ హత్యకు ఒడిగట్టిన హిజ్బుల్ ముజాహిదీన్ మొదలు 2007, 2013ల్లో జంట పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం), అంతర్జాతీయ ఉగ్రవాద సంస్థ ఐసిస్ వరకు ప్రతి ఒక్క మాడ్యుల్ చరిత్రను పూర్తిగా అధ్యయనం చేస్తున్నారు. ఫలితంగా ముష్కరమూకలకు సంబంధించిన లింకులు దొరికే అవకాశం ఉందని భావిస్తున్నారు.
ముజాహిదీన్-ఇ-ఇస్లాం: పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ హిజ్బుల్ ముజాహిదీన్‌లో అంతర్భాగంగా పని చేసింది. 1992లో టోలిచౌకి లో ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్‌ను అతిదారుణంగా హత్య చేసింది దీని సభ్యులే. మన్జీమ్-ఇస్లాహుల్-ముస్లమీన్: ముంబైకి చెందిన డాక్టర్ జలీస్ అన్సార్ ఈ మాడ్యుల్‌కు నేతృత్వం వహించాడు. 1993లో నగరంలోని అనేక ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడింది. ఫసీయుద్దీన్ మాడ్యుల్: నగరానికి చెందిన విశ్వ హిందూ పరిష్యత్ నేతలు నందరాజ్ గౌడ్‌ను 1992లో, పాపయ్య గౌడ్‌ను 1993లో హత్య చేసింది. ఐఖ్వాన్-ఉల్-ముస్లమీన్: ఈ మాడ్యుల్ నగర వ్యాప్తంగా విధ్వంసాలు సృష్టించాలని 1993లో కుట్ర పన్నింది. దీన్ని ఛేదించిన నగర పోలీసులు గౌహర్ అమీన్ మీర్, నసీర్ అహ్మద్ భట్ తదితరులను అరెస్టు చేశారు.
అల్-జిహాద్: కాశ్మీర్‌కు చెందిన ఈ టైస్ట్ ఆర్గనైజేషన్ 1994లో నగరంలో నెట్‌వర్క్ ఏర్పాటు చేసుకుంది. ముస్లిం ముజాహిదీన్: అస్ఘర్ అలీ నేతృత్వంలో 1997లో ఈ మాడ్యుల్ ఏర్పడింది. ఐపీఎస్ అధికారి కృష్ణప్రసాద్ హత్య కేసులో నిందితుడిగా ఉన్న మీర్జా ఫయాజ్ అహ్మద్ బేగ్‌ను నాంపల్లి కోర్టు నుంచి తప్పించింది. ఎల్‌ఈటీ మాడ్యుల్: పాక్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరేతొయిబా (ఎల్‌ఈటీ) 1998లో సలీం జునైద్‌ను హైదరాబాద్ పంపింది. పాతబస్తీలో షెల్టర్ ఏర్పాటు చేసుకుని ఇక్కడి యువతను ఆకర్షించడానికి ప్రయత్నించి పట్టుబడ్డాడు.
1999లో వాలీ మహ్మద్ జహీద్ అలియాస్ హఫీఖ్ వఖ్వారీ అలియాస్ తాహెర్ మాడ్యుల్, 2000ల్లో ఆజం ఘోరీ నేతృత్వంలో ఐఎంఎంఎం మాడ్యుల్, దీన్‌దార్ అంజుమన్ సంస్థ, 2001లో హిజ్బుల్ ముజాహిదీన్, గణేష్ నిమజ్జన ఉరేగింపులో పేలుళ్లకు కుట్ర పన్నిన అబ్దుల్ అజీజ్ అలియాస్ గిడ్డా అజీజ్ మాడ్యుల్, అష్వక్ అలీ మాడ్యుల్, 2002లో దిల్‌సుఖ్‌నగర్‌లోని సాయిబాబా ఆలయం వద్ద పేలుడుకు పాల్పడిన అబ్దుల్ బారీ మాడ్యుల్, 2003లో గుజరాత్ మాజీ హోంమంత్రి హరేన్ పాండ్య హత్య కేసులో అరెస్టు అయిన అస్ఘర్ అలీ మాడ్యుల్, 2004లో బీజేపీ నేత ఇంద్రసేనారెడ్డి హత్యకు కుట్ర పన్నిన జైష్-ఏ-మహ్మద్ మాడ్యుల్, సికింద్రాబాద్‌లోని గణేష్ టెంపుల్ పేల్చివేతకు కుట్ర పన్నిన నసీరుద్దీన్ మాడ్యుల్, పాకిస్తానీ అర్షద్ మాలిక్ మాడ్యుల్, 2004/2005ల్లో గులాం మజ్దానీ అలియాస్ నవీద్ మాడ్యుల్ చురుకుగా పని చేశాయి.
2005 అక్టోబర్ 12న చోటు చేసుకున్న టాస్క్‌ఫోర్స్ కార్యాలయంపై జరిగిన మానవబాంబు దాడి దీని పనే. ఆపై అదే ఏడాది ముజీబ్ అహ్మద్ మాడ్యుల్, 2006/2007ల్లో షాహెద్ అలియాస్ బిలాల్ మాడ్యుల్స్ నగరంలో కార్యకలాపాలు సాగించాయి. ఇక 2007, 2013ల్లో నగరంలో జంట పేలుళ్లకు పాల్పడిన ఇండియన్ ముజాహిదీన్ మాడ్యుల్‌లో స్థానికులు ఎవరూ లేరు. ఆపై విఖార్ అహ్మద్‌కు చెందిన తెహరీఖ్ గల్బా ఏ ఇస్లాం (టీజీఐ) మాడ్యుల్ పోలీసుల పైనే తూటా ఎక్కుపెట్టింది. సల్మాన్ మొయినుద్దీన్, అప్ఫా జబీన్‌లతో కూడిన ఐసిస్ మాడ్యుల్, దీనికి అనుబంధంగా వెలుగులోకి వచ్చిన ‘జునూద్’ ప్రస్తుతం పోలీసు, నిఘా వర్గాలకు ముచ్చెమటలు పట్టిస్తున్నాయి.