
కాంగ్రెస్ నేతల దీక్ష వెనుక రాజకీయ కుట్ర
కొత్త జిల్లాలు ప్రజల సౌకర్యం కోసమే..: మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ నేతలు చేస్తున్న దీక్ష వెనుక రాజకీయ కుట్ర దాగుందని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. ప్రజల సౌకర్యం కోసమే కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నామని.. నాయకులు, పార్టీల కోసం కాదని స్పష్టం చేశారు. కొత్త జిల్లాల ఏర్పాటు అశాస్త్రీయంగా ఉందని కాంగ్రెస్ నేతలు వారి అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నారని ఎద్దేవా చేశారు. గద్వాల, జనగామలను జిల్లాలుగా చేయాలనే డిమాండ్‌తో డీకే అరుణ, పొన్నాల లక్ష్మయ్య ఇందిరాపార్కు వద్ద దొంగ దీక్ష చేస్తున్నారని ఆరోపించారు.
టీఆర్‌ఎస్ ఎల్పీ కార్యాలయంలో జూపల్లి శనివారం ఎమ్మెల్యేలు ఆలె వెంకటేశ్వర్‌రెడ్డి, అంజయ్యయాదవ్, ఎమ్మెల్సీ నారాయణరెడ్డితో కలసి విలేకరులతో మాట్లాడారు. జిల్లాల ఏర్పాటులో టీఆర్‌ఎస్‌కు రాజకీయ కోణం ఉంటే సీఎం కేసీఆర్ తనయుడు, మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న సిరిసిల్ల జిల్లా అయ్యేదని, అక్కడా ఆందోళనలు జరుగుతున్నాయని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న వనపర్తి జిల్లా అవుతోందని, టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న జనగామ మాత్రం ఆ జాబితాలో లేదన్నారు. ఈ ఉదాహరణలు చాలవా, జిల్లాల ఏర్పాటులో రాజకీయ ప్రయోజనాలు లేవని అర్థం చేసుకోవడానికి అని ప్రశ్నించారు.