
'చంద్రబాబును నమ్మి బాధపడుతున్నారు'
హైదరాబాద్: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును నమ్మి మోసపోయామని రైతులు బాధపడుతున్నారని వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే కాకాని గోవర్దన్ రెడ్డి అన్నారు. రైతుల రుణమాఫీపై ఎన్నో ఆంక్షలు విధించారని విమర్శించారు. వ్యవసాయ రుణాలమాఫీపై చంద్రబాబు చేసిన తొలిసంతకం పరిస్థితి ఏమైందని ప్రశ్నించారు. బుధవారం ఏపీ అసెంబ్లీలో ద్రవ్యవినిమయ బిల్లుపై చర్చలో కాకాని మాట్లాడుతూ.. గత బడ్జెట్ అంచనాలకు, వాస్తవాలకు పొంతన లేదని అన్నారు. ద్రవ్యవినిమయ బిల్లును వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకించింది.
2014-15 బడ్జెట్ లెక్కలు ఎందుకు దాచిపెట్టారని కాకాని ప్రశ్నించారు. 2016-17 బడ్జెట్ ప్రసంగం అంతా తప్పుల తడకేనని విమర్శించారు. జీడీపీ రేటుపై కూడా అనుమానాలున్నాయని పేర్కొన్నారు. దివంగత నేత వైఎస్ఆర్ వ్యవసాయాన్ని పండుగ చేసి చూపించారని చెప్పారు. వైఎస్ఆర్ ముఖ్యమంత్రి అయ్యాక రైతులకు ఉచిత విద్యుత్ అందించే ఫైలుపై తొలి సంతకం చేశారని, తుదిశ్వాస విడిచే వరకు దాన్ని కొనసాగించారని గుర్తుచేశారు. రైతుల రుణమాఫీ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం మాటతప్పిందని విమర్శించారు. పోలవరం ప్రాజెక్టుపై ప్రభుత్వం చెప్పే మాటలు నమ్మకంగా లేవని అన్నారు.