
గడ్డం పెంచుకో.. అభివృద్ధికి అడ్డుపడకు
ఉత్తమ్‌ను ఉద్దేశించి ఎంపీ కవిత సూచన
మెట్‌పల్లి: ‘నువ్వు పగటి కలలు కంటూ ఎంతకాలమైనా గడ్డం పెంచుకో...కానీ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు అడ్డంరాకు’ అని నిజామాబాద్ ఎంపీ కల్వకుంట్ల కవిత పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఉద్దేశించి అన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలో వచ్చే వరకు గడ్డం తీయనని ఆయన చెబుతున్నారంటూ ఆమె ఎద్దేవ చేశారు. జగిత్యాల జిల్లా మెట్‌పల్లిలో మంగళవారం వివిధ పార్టీల నాయకులు టీఆర్‌ఎస్‌లో చేరిన సందర్భంగా జరిగిన సమావేశంలో కవిత మాట్లాడారు.
తెలంగాణలో బలమైన రాజకీయ శక్తిగా ఎదిగి నిలబడే పార్టీ ఒక్క టీఆర్‌ఎస్ మాత్రమేనని కవిత పేర్కొన్నారు. బంగారు తెలంగాణ సాధనకే ఇతర పార్టీల నుంచి వేలాది మంది నాయకులంతా గులాబీ కండువా వేసుకుంటున్నారని, వారి చేరికతో బలమైన రాజకీయ శక్తిగా టీఆర్‌ఎస్ ఎదుగుతుందన్నారు ఎమ్మెల్యేలు విద్యాసాగర్‌రావు, పుట్ట మధు, జెడ్‌పీ చైర్‌పర్సన్ ఉమ పాల్గొన్నారు.