
దీపా కర్మాకర్‌కు తెలంగాణ సర్కారు నజరానా
ఒలింపిక్స్‌లో అమ్మాయిలు అద్భుత ప్రతిభా పాటవాలు ప్రదర్శించడం స్పూర్తిదాయకమని..
హైదరాబాద్: రియో ఒలింపిక్స్ లో జిమ్నాస్టిక్ విభాగంలో నాలుగో స్థానంలో నిలిచిన దీపా కర్మాకర్‌కు తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రూ.50 లక్షల నజరానా ప్రకటించారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కార్యాలయం ఆదివారం ఒక ప్రకటన విడుదల చేసింది. 52 సంవత్సరాల తర్వాత ఒలింపిక్స్ క్రీడల్లో జిమ్నాస్టిక్స్ విభాగంలో అర్హత పొందిన తొలి భారత జిమ్నాస్ట్‌గా దీపా కర్మాకర్ రికార్డు సృష్టించారని ప్రకటనలో పేర్కొన్నారు.
ఒలింపిక్స్‌లో అమ్మాయిలు అద్భుత ప్రతిభా పాటవాలు ప్రదర్శించడం స్పూర్తిదాయకమని సీఎం కేసీఆర్ కొనియాడారు. అమ్మాయిలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని, యావత్ భారతావని వారికి అండగా నిలవాలని ప్రకటనలో ఆయన సూచించారు. రియో ఒలింపిక్స్ లో అద్భుత ప్రదర్శన చేసినా తృటిలో దీప కాంస్య పతకాన్ని కోల్పోయిన విషయం తెలిసిందే.