
కొడుకు, కూతురు పెత్తనం చెలాయిస్తారా?
హైదరాబాద్: టీఆర్‌ఎస్ పార్టీలో బీసీ, మైనార్టీ నేతలను ఆ పార్టీ అధినేత, తెలంగాణ సీఎం కేసీఆర్ అవమానిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు ధ్వజమెత్తారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో గెలుపు బాధ్యతలను హైదరాబాద్ బీసీ, మైనార్టీ మంత్రులకు కాకుండా.. తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్, టీఆర్ఎస్ ఎంపీ కవితకు అప్పగించడమే ఇందుకు నిదర్శనమని వీహెచ్ విమర్శించారు.
మంత్రులు, ఎమ్మెల్యేలు పార్టీ పల్లకీ మోస్తే.. సీఎం కొడుకు, కూతురు పెత్తనం చెలాయిస్తారా? అని ఆయన తీవ్రంగా మండిపడ్డారు. కాంగ్రెస్‌లో మేయర్ అభ్యర్థిని ప్రకటించే సంప్రదాయం లేదని వీహెచ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ నుంచి తాలు అంతా బయటకు పోయిందని, ఇక గట్టి నేతలే పార్టీలో ఉన్నారని అన్నారు.