
ఘనంగా కేసీఆర్ జన్మదిన వేడుకలు
సిటీబ్యూరో:ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలు మంగళవారం నగరంలో ఘనంగా జరిగాయి. మంత్రులు, టీఆర్‌ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు, నాయకులు, కార్యకర్తలు వివిధ చోట్ల జరిగిన వేడుకల్లో పాల్గొని శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు సీఎం పుట్టిన రోజు, శివరాత్రి వేడుకలు ఒకే రోజురావడంతో పలు చోట్ల దేవాలయాల్లో టీఆర్‌ఎస్ కార్యకర్తలు ప్రత్యేక పూజలు జరిపించారు. భక్తులకు పండ్లు పంపిణీ చేశారు. కొన్నిచోట్ల ఆస్పత్రుల్లో రోగులకు పండ్లు అందజేశారు. పలు చోట్ల రక్తదాన శిబిరాలు జరిగాయి. సికింద్రాబాద్ సీఎస్‌ఐ వెస్లీ చర్చిలో కేసీఆర్ అభిమానులు కేక్ కట్ చేశారు. ఉస్మానియా ఆసుపత్రిలో, ఎంజే మార్కెట్‌లో జరిగిన కేసీఆర్ జన్మదిన వేడుకల్లో ఉపముఖ్యమంత్రి మహమూద్ అలీ పాల్గొన్నారు. ఉస్మానియాలో అంబులెన్స్ కోసం ఆయన ఎమ్మెల్సీ నిధులను అందజేశారు. ఆగాపురాలో టీఆర్‌ఎస్ కార్యకర్తలు అన్నదానం ఏర్పాటు చేశారు. కంటోన్మెంట్, ముషీరాబాద్, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ తదితరచోట్ల కేసీఆర్ జన్మదిన వేడుకలు జరిగాయి. మరోవైపు సికింద్రాబాద్‌లో ఫోరమ్ ఫర్ స్ట్రీట్ చిల్డ్రన్ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో ఎక్సైజ్ మంత్రి పద్మారావు పాల్గొని పిల్లలకు పుస్తకాలు పంపిణీ చేశారు. అంబర్‌పేట్ ఛేనెంబర్ లో పార్టీ కార్యాలయంలో జరిగిన వేడుకల్లో టీఆర్‌ఎస్ నగర కన్వీనర్ మైనంపల్లి హనుమంతరావు పాల్గొన్నారు.
ప్రత్యేక ప్రార్ధనలు...
సికింద్రాబాద్ సీఎస్‌ఐ వెస్లీ చర్చిలో కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రత్యేక ప్రార్ధనలు జరిపి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో హోమంత్రి నాయిని నర్సింహారెడ్డి, ఎంపీ కవిత, ఎమ్మెల్సీ రాజేశ్వర్‌రావు తదితరులు పాల్గొన్నారు. మైనారిటీ సంక్షేమం కోసం ప్రభుత్వం అనేక చర్యలు చేపడుతుందని ఈ సందర్భంగా నాయిని తెలిపారు. సీఎం కేసీఆర్ క్రైస్తవుల అభివృద్ధి, సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు చెప్పారు. బాచుపల్లి సాయినగర్‌లో జరిగిన వేడుకల్లో ఎంపీ కవితతో పాటు, మంత్రి జగదీశ్వర్‌రెడ్డి పాల్గొన్నారు. మియాపూర్‌లో జరిగిన రక్తదాన శిబిరంలో రవాణా మంత్రి మహేందర్‌రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. మలక్‌పేట్ బాలికల అంధుల పాఠశాలలోనూ కేసీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి.