మూడే మూడు చెక్కుల్లో పరిహారం | KCR orders to give permission for projects | Sakshi
Sakshi News home page

మూడే మూడు చెక్కుల్లో పరిహారం

Published Wed, May 4 2016 2:39 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

మూడే మూడు చెక్కుల్లో పరిహారం - Sakshi

మూడే మూడు చెక్కుల్లో పరిహారం

- ప్రాజెక్టుల నిర్వాసితులకు ఒకేసారి అందించాలని సీఎం కేసీఆర్ ఆదేశం
- నిర్వాసితులను ఆదుకునేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి
-ఎక్కడైనా పునరావాసానికి వెసులుబాటు కల్పించాలి
- నిర్వాసితుల పరిహారం, భూసేకరణపై అధికారులతో సీఎం సమీక్ష

 
 సాక్షి, హైదరాబాద్: భారీ నీటిపారుదల ప్రాజెక్టులతో నిర్వాసితులయ్యే వారిని పూర్తి స్థాయిలో ఆదుకునేందుకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. కొన్ని ప్రాంతాల్లో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులు గూడు చెదిరిన పక్షుల్లా తయారవుతారని, అలాంటి వారికి కొత్త జీవితం ప్రసాదించాలని సూచించారు. వ్యవసాయ భూమికి, ఇల్లు-పశువుల కొట్టం-చెట్లు తదితర ఆస్తులకు, కొత్త ఇంటి నిర్మాణానికి..ఒకేసారి నిర్వాసితులకు మూడింటి చెక్కులను అందించాలన్నారు. ఏక మొత్తంలో డబ్బులు ఇవ్వడం వల్ల నిర్వాసితులు తమకిష్టమొచ్చిన ప్రాంతంలో స్థిరపడే అవకాశం కలుగుతుందన్నారు. స్థానికంగా ఉండే మంత్రులు, ఎమ్మెల్యేలు నిర్వాసితులతో మాట్లాడి అవసరమైన భూసేకరణ పూర్తి చేయాలని కోరారు. భూ నిర్వాసితులకు పరిహారం, రిజర్వాయర్ల నిర్మాణానికి భూసేకరణ తదితర అంశాలపై క్యాంపు కార్యాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు.
 
 రాష్ట్రంలో కోటి ఎకరాలకు సాగునీరు అందించేందుకు ప్రాజెక్టులను నిర్మిస్తున్నామని, రిజర్వాయర్ల నిర్మాణంతో కొంత ముంపు తప్పదని సీఎం కేసీఆర్ అన్నారు. ఎక్కువ ముంపు లేకుండా వీటిని రీ డిజైన్ చేసినట్లు చెప్పారు. మంత్రులు హరీశ్‌రావు, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్యే రామలింగారెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, సీఎంవో ముఖ్య కార్యదర్శి నర్సింగ్‌రావు, అధికారులు మురళీధర్, హరే రామ్, వెంకటేశ్వర్లు, గోవిందరావు, మెదక్ జేసీ వెంకట్రాంరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
 
 పనులు వేగంగా జరగాలి: పాలమూరు, కాళేశ్వరం ప్రాజెక్టులకు కావాల్సిన అధికార లాంఛనాలు పూర్తి చేసినందున పనుల్లో వేగం పెంచాలని సీఎం కేసీఆర్ కోరారు. కాళేశ్వరం ప్రాజెక్టు బ్యారేజీ పూర్తయ్యే దాకా ఎదురుచూడకుండా పంప్ హౌజ్ ద్వారా నీరు పంపాలని చెప్పారు. రాబోయే ఏడాదిన్నరలోగానే కాళేశ్వరం నుంచి మిడ్‌మానేరు దాకా నీటిని పంపడం లక్ష్యంగా పెట్టుకోవాలన్నారు. బ్యారేజీలు, పంప్‌హౌజ్‌లు, రిజర్వాయర్లు సమాంతరంగా నిర్మాణం కావాలన్నారు. ఎక్కడ సమస్య తలెత్తినా వెంటనే స్పందిం చి పరిష్కరించాలని మంత్రి హరీశ్‌రావును సీఎం ఆదేశించారు. కరీంనగర్ జిల్లాలో కట్టే రిజర్వాయర్ల భూసేకరణ బాధ్యత తీసుకోవాలని మంత్రి ఈటల, కలెక్టర్ నీతూ ప్రసాద్‌ను కోరారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement