ఎంతకైనా తెగిస్తాం | Kcr takes on AP govt | Sakshi
Sakshi News home page

ఎంతకైనా తెగిస్తాం

Published Thu, May 5 2016 2:41 AM | Last Updated on Tue, Aug 21 2018 5:36 PM

ఎంతకైనా తెగిస్తాం - Sakshi

ఎంతకైనా తెగిస్తాం

మీరు ఇటుకతో కొడితే.. మేం రాయితో కొడతాం
చంద్రబాబు సర్కారు తీరుపై సీఎం కేసీఆర్ ఫైర్
ఏపీలో చిల్లర రాజకీయాల కోసం తెలంగాణ ప్రజలపై యుద్ధమా?
లేచికూర్చున్న బెబ్బులిని కదిలించొద్దు.. తీరు మార్చుకోకుంటే మీకే నష్టం
గోదావరిలో నీళ్లు తీసుకునే దమ్ము, వివేకం, తెలివి ఏపీకి లేవు
మీ ఆటలు ఇక సాగవు.. ఉన్న విలువ పోగొట్టుకోవద్దు..
తెలంగాణ రైతాంగం బోర్లు వేసి బోర్లా పడింది.. బోర్ల కోసం రూ.38 వేల కోట్లు ఖర్చు చేసిన దుస్థితి తెలంగాణది
టీఆర్‌ఎస్‌లో చేరిన ఖమ్మం ఎంపీ పొంగులేటి, ఎమ్మెల్యే పాయం

 
సాక్షి, హైదరాబాద్: తాము న్యాయంగా ప్రాజెక్టులు కట్టుకుంటుంటే ఏపీ సర్కారు చిల్లరమల్లర రాజకీయాలు చేస్తోందని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు మండిపడ్డారు. తెలంగాణ ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తామని కుండబద్దలు కొట్టారు. ఏపీ నాయకులు చిల్లర మల్లర రాజకీయాలు మానుకోవాలని.. లేచి కూర్చున్న బెబ్బులిని కదిలించవద్దని హెచ్చరించారు. అది వారికే నష్టమని స్పష్టం చేశారు. బుధవారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ సమక్షంలో వైఎస్సార్‌సీపీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు టీఆర్‌ఎస్‌లో చేరారు.
 
 ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. పాలమూరు ప్రాజెక్టును అడ్డుకునేందుకు ఏపీ కేబినెట్ చేసిన తీర్మానం, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్. జగన్‌మోహన్‌రెడ్డి దీక్ష ప్రకటనపై మండిపడ్డారు. ‘‘ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌గా ఉన్నప్పుడు అప్పటి ముఖ్యమంత్రులు, సాగునీటి మంత్రులు ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారమే కృష్ణా నదిలో 368 టీఎంసీలు, గోదావరిలో 950 టీఎంసీలను తెలంగాణకు కేటాయించారు. ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి, కొబ్బరికాయలు కొట్టారు. పాలమూరు ప్రాజెక్టు పనులకు రూ.7కోట్లు కూడా మంజూరు చేశారు. ఆ కేటాయింపుల మేరకే ఇప్పుడు ప్రాజెక్టులు కట్టుకుంటామంటుంటే ఏపీ రాజకీయ నేతలు చిల్లర మల్లర రాజకీయాలు చేస్తున్నారు. చంద్రబాబు, జగన్ మనపై యుద్ధం చేస్తున్నారు. ఇది ఎంతవరకు సబబు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా కోటి ఎకరాలకు నీళ్లిచ్చి తీరుతాం. న్యాయంగా పోరాడుతాం. ప్రజల కోసం ఎంతకైనా తెగిస్తాం..’’ అని కేసీఆర్ స్పష్టం చేశారు.  
ఏపీ సర్కారుకు దమ్ము లేదు!
 ఏపీకి గోదావరిలో నీటిని తీసుకునే దమ్ము లేదని సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘‘నేను యాగం చేసినప్పుడు ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించేందుకు అమరావతి వెళ్లాను. కనీసం గంట పాటు గోదావరి జలాల గురించి మాట్లాడిన. మూడు నాలుగు వేల టీఎంసీలు సముద్రంలోకి వెళ్లిపోతోందని... తెలంగాణ వాటా తీసుకున్నాక, ఏపీ బాగా తీసుకోవచ్చని చెప్పిన. అసెంబ్లీ వేదికగా అధికారికంగా సీఎం హోదాలో ఇచ్చిన పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లోనూ లెక్కలు చెప్పిన. వాస్తవానికి గోదావరి నుంచి నీళ్లు తీసుకోవడం తెలంగాణకే కష్టం. 500 మీటర్లు ఎత్తిపోయాలి. అదే ఏపీ అయితే 50 మీటర్ల నుంచి 250 మీటర్లు లిఫ్టు చేస్తే చాలు. అయినా ప్రతీ విషయంలో రాద్ధాంతం చేస్తున్నారు.
 
మేం బతుకుతం.. మీరు బతుకొద్దనడం దుర్మార్గం. అయినా గోదావరిలో నీటిని తీసుకునే దమ్ము మీకు లేదు. వివేకం, తెలివి లేదు. తెలంగాణపై ఎందుకు ఏడుస్తున్నరు. తెలంగాణ ఇప్పుడు స్వతంత్ర రాష్ట్రం. మీ బెదిరింపులకు భయపడం. మీరు ఇటుకతో కొడితే మేం రాయితో కొడతం. మీ ఆటలు ఇక సాగవు. ఉన్న విలువ పోగొట్టుకోవద్దు. పొరుగు రాష్ట్రాలతో సఖ్యంగనే ఉంటం. ఏపీ, తెలంగాణ పరస్పరం సహకరించుకోవాలె. కుతంత్రాలు మానండి. తెలంగాణ ప్రజల ప్రయోజనాలను బలిపెట్టొద్దు. చంద్రబాబు నీతేమిటో, వైఎస్సార్‌సీపీ నీతేమిటో మాకు తెలుసు. కడుపులో కత్తులు పెట్టుకుని, నోట్లో బెల్లం పెట్టుకుని మాట్లడుతరు..’’ అని విమర్శించారు.
 
 తెలంగాణది వలసల దుస్థితి..
 తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నదే నిధులు-నీళ్లు-నియామకాల్లో అన్యాయం జరుగుతోందనే సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. గత 58 ఏళ్లలో బోర్లు వేసి తెలంగాణ రైతాంగం బోర్లా పడిందని.. దేశంలో ఎక్కడా లేని విధంగా ఇక్కడ 24 లక్షల పంపుసెట్లు ఉన్నాయని చెప్పారు. సుమారు రూ.30వేల కోట్ల నుంచి రూ.38వేల కోట్ల దాకా బోర్ల కోసం ఖర్చు చేశారన్నారు. తెలంగాణది వలస బతుకని, 37 లక్షల జనాభా ఉన్న మహబూబ్‌నగర్ జిల్లా నుంచి 18 లక్షల మంది వలస పోయారని చెప్పారు. అలాంటి ప్రాంతానికి నీళ్లివ్వొద్దంటూ దాడి చేస్తున్నరని మండిపడ్డారు. దుమ్ముగూడెం దగ్గర ఇప్పటికీ వేల క్యూసెక్కుల నీరు కిందకు వెళ్లిపోతోందన్నారు. సరిహద్దుగా గోదావరి నది ఉన్నా ఖమ్మం జిల్లా కరువు, తాగునీటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నది సమైక్య రాష్ట్రంలో జరిగిన అన్యాయం వల్లేనని కేసీఆర్ పేర్కొన్నారు.
 
 టీఆర్‌ఎస్‌కు నిబద్ధత ఉంది
 తెలంగాణ సమాజమంతా ఏకం కావాల్సిన సందర్భమిదని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ‘‘వైఎస్సార్‌సీపీ నుంచి వచ్చి టీఆర్‌ఎస్‌లో చేరడానికి కారణం ఉంది.. ఇవి చిల్లర మల్లర చేరికలు కావు. రాజకీయ ఏకీకరణలో భాగం. టీఆర్‌ఎస్‌లో కొత్త వారికి కూడా పాత వారితో సమాన స్థాయి గౌరవం ఉంటుంది.. టీఆర్‌ఎస్ నిబద్ధత ఉన్న పార్టీ. ఉద్యమంలో అనేక బాధలు పడ్డాం. అందుకే ప్రజలు అధికారం ఇచ్చారు. మంత్రి తుమ్మలను ఒకటే కోరుతున్నా... పాలు నీళ్లలా అందరినీ కలుపుకొని వెళ్లాలి..’’ అని సూచించారు. అవకాశాలు అందరికీ వస్తాయని, సముచిత స్థానం ఉంటుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రులు మహమూద్ అలీ, కడియం శ్రీహరి, మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, కేటీఆర్, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు జలగం వెంకట్రావు, పువ్వాడ అజయ్, తాటి వెంకటేశ్వర్లు, మదన్‌లాల్ తదితరులు పాల్గొన్నారు.
 
తెలంగాణ వాదులుగానే చేరాం: పొంగులేటి, పాయం వెంకటేశ్వర్లు
తెలంగాణవాదులుగా బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకే తాము టీఆర్‌ఎస్‌లో చే రినట్లు ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, పాయం వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం సీఎం కేసీఆర్ వారికి గులాబీ కండువాలు కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. అనంతరం పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడారు. కృష్ణా నీటి విషయంలో, పాలమూరు ప్రాజెక్టుకు వ్యతిరేకంగా దీక్ష చేస్తానన్న ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటన చూసి తట్టుకోలేక పోయానని చెప్పారు.
 
 ఏపీ విషయంలో ఆయన పోరాటంలో న్యాయం ఉందని, కానీ తెలంగాణ విషయంలో అది ఏకపక్ష నిర్ణయమని పేర్కొన్నారు. తెలంగాణలో ఇబ్బంది ఎదురవుతుందని తెలిసినా జగన్ ఆ నిర్ణయం తీసుకున్నారని... ఇది ఏపీ విషయంలో సరైనదే అయినా, తెలంగాణ విషయంలో అన్యాయమని వ్యాఖ్యానించారు. ఇక బంగారు తెలంగాణలో భాగస్వామి కావడానికి టీఆర్‌ఎస్‌లో చేరానని పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement