రూ.630 కోసం హత్య
నిందితుడి అరెస్టు
సీసీ కెమెరాల ఆధారంగా గుర్తింపు
నాంపల్లి: డబ్బు కోసం ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న గుర్తుతెలియని వ్యక్తిని బండరాయితో మోది హత్య చేసిన కేసులో నిందితుడని హబీబ్‌నగర్ పోలీసులు అరెస్టు చేశారు. శుక్రవారం హబీబ్‌నగర్ పోలీసు స్టేషన్‌లో గోషామహాల్ ఏసీపీ రాంభూపాల్ రావు, ఇన్‌స్పెక్టర్ ఆర్.సంజయ్ కుమార్ కేసు వివరాలు వెల్లడించారు. బెంగుళూరుకు చెందిన సయ్యద్ జబిర్ ఆటో డ్రైవర్‌గా పని చేసేవాడు. తాగుడుకు బానిసైన అతను జులాయిగా తిరుగుతూ హైదరాబాద్‌కు చేరుకున్నారు. హబీబ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో తిరుగుతూ నిద్రిస్తున్న వారి జేబుల్లోని డబ్బులు తీసుకుని మద్యం సేవించేవాడు. ఈ నెల 4న అర్ధరాత్రి మల్లేపల్లి బడే మసీదు సమీపంలోని నేషనల్ ఎలక్రానిక్స్, మొబైల్ దుకాణం వద్ద ఫుట్‌పాత్‌పై నిద్రిస్తున్న 35 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తి జేడులో ఉన్న డబ్బులు లాక్కునే ప్రయత్నం చేశాడు.
అయితే అతడు ప్రతిఘటించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయిన జబీర్ బాగా ఆకలితో ఉన్న జబీర్ ఏలాగైనా అతడి నుంచి డబ్బు లాక్కోవాలని నిర్ణయించుకున్నాడు. దీంతో బండరాళ్లను తీసుకువచ్చి సదరు వ్యక్తి తలపై మోదడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. అతని జేబులో ఉన్న రూ.630 తీసుకుని పరారయ్యారు. తెల్లవారుజామున టీ తాగేందుకు అక్కడికి వచ్చిన పురానాపూల్ ప్రాంతానికి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ అకైఫ్ మీర్జా బైక్‌ను మొబైల్ షాపు ముందు పార్క్ చేసి హోటల్ లోపలికి వెళుతుండగా ఫుట్‌పాత్‌పై రక్తం మడుగులో పడి ఉన్న యువకుడిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల పుటేజీ ఆధారంగా నిందితుడిని గుర్తించేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, సయ్యద్ జబిర్ హత్య చేసినట్లుగా గుర్తించారు. శుక్రవారం మల్లేపల్లిలోని ఎస్‌బిహెచ్ బ్యాంకు వద్ద అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.