పోడు భూములను సొంతదారులకిచ్చేయాలి
వైఎస్సార్‌సీపీ నేత కొండా రాఘవరెడ్డి
సాక్షి, హైద రాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వం హరితహారం పేరిట పోడు భూములు సాగు చేసుకుంటున్న ఆదివాసీలు, గిరిజనులను తీవ్ర ఇబ్బందులకు గురిచే స్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ధ్వజమెత్తింది. బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్ కాంగ్రెస్ తెలంగాణ ప్రధానకార్యదర్శి కొండా రాఘవరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, ఇదేనా బంగారు తెలంగాణ అంటే.. అని ప్రశ్నించారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి సీఎంగా ఉండగా 2006 లో అటవీహక్కుల చట్టాన్ని తీసుకొచ్చి, ఖమ్మం జిల్లాలో కొన్ని లక్షల ఎకరాల్లో పోడుభూముల్లో గిరిజనులు, ఇతర సాగుదారులకు పట్టాలిచ్చిన విషయాన్ని గుర్తుచేశారు.
టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా వెంటనే మిగతా వారికి పట్టాలివ్వాలని, వారికి బ్యాంకుల నుంచి రుణాలు అందేలా చూడాలని డిమాండ్ చేశారు. ఖమ్మంజిల్లాలో పోడు భూములు అన్యాక్రాంతం చేయడాన్ని ఖండించారు. ‘‘పోడుకు రాజకీయ చెర’’ శీర్షికతో సాక్షి దినపత్రికలో వచ్చిన కథనాన్ని ఉటంకిస్తూ ఇటు తెలంగాణలోని అధికారపార్టీ నాయకులు, అటు ఏపీకి చెందిన రాజకీయ నాయకులు అక్రమంగా పోడుభూములను ఆక్రమించుకుని, వాటిని లీజుకు ఇచ్చుకోవడాన్ని తప్పుబట్టారు.
వాస్తవంగా ఈ పోడు భూములను సొంతదారులకు అప్పగించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. త్వరలోనే తమ పార్టీ పక్షాన ఆ భూములను సందర్శించి సమాచారాన్ని సేకరిస్తామని చెప్పారు. జిల్లాల పునర్‌వ్యవస్థీకరణ విషయంలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఒక పద్ధతి ప్రకారం కాకుండా రకరకాలుగా మాట్లాడుతోందని ధ్వజమెత్తారు. ముందుగా ఏదో ఒక డ్రాఫ్ట్‌నిచ్చి దానిపై వచ్చే ఫీడ్‌బ్యాక్‌ను తీసుకుంటామని చెప్పి, మళ్లీ ఇప్పుడు క్షేత్రస్థాయి పరిశీలన అంటూ మాట్లాడుతున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం వాస్తవాలకు దగ్గరగా వ్యవహరించాలని సూచించారు.