ఎగువనున్న కర్ణాటక ప్రాజెక్టులు నిండటంతో కృష్ణా జలాలు బుధవారం రాత్రికి లేక గురువారం ఉదయం జూరాలకు చేరనున్నాయి. ప్రస్తుతం నారాయణపూర్ డ్యామ్ నుంచి 77వేల క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ ఆల్మట్టి నుంచి నీటి విడుదల భారీగా ఉండటంతో నారాయణఫూర్ నుంచి ఔట్ ఫ్లో మరింతగా పెరిగే అవకాశం ఉందని నీటి పారుదల శాఖ వర్గాలు చెబుతున్నాయి.
ఆశగా రాష్ట్ర ప్రాజెక్టులు..
ఎగువ వర్షాలతో కర్ణాటకలోని ప్రాజెక్టుల్లో సుమారు 200 టీఎంసీల నీరు చేరగా, రాష్ట్రంలోని ప్రాజెక్టులో మాత్రం కేవలం 8టీఎంసీల నీరు మాత్రమే వచ్చింది. దీంతో మన ప్రాజెక్టులన్నీ ఖాళీగానే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 590 అడుగుల మట్టానికి గానూ నీటి నిల్వ 503 అడుగులకు పడిపోయింది. శ్రీశైలంలో 885 అడుగులకు గానూ కేవలం 788 అడుగులో 23టీఎంసీల నీటి లభ్యత మాత్రమే ఉంది. జూరాలలో కేవలం 9.66 టీఎంసీలకు 3.58 టీఎంసీల నీరు ఉంది. రెండేళ్లుగా సరైన ప్రవాహాలు లేక వట్టిపోయిన ప్రాజెక్టులన్నీ ప్రస్తుతం ఎగువ నుంచి వస్తున్న ప్రవాహాల కోసం ఆశగా ఎదురుచూస్తున్నాయి.