నేతన్నకు భరోసా ఇస్తున్నాం | Ktr about Handloom workers | Sakshi
Sakshi News home page

నేతన్నకు భరోసా ఇస్తున్నాం

Published Wed, Mar 28 2018 2:38 AM | Last Updated on Wed, Mar 28 2018 2:38 AM

Ktr about Handloom workers - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ‘నేతన్నల పరిస్థితిపై అంచనా లేని గత ప్రభుత్వాలు వారిని గాలి కొదిలేశాయి. దీంతో వారి జీవితాలు దుర్భ రంగా మారిపోయాయి. మా ప్రభుత్వం నేతన్నల జీవితాలను మెరుగుపరిచే  చర్యలు విజయవంతంగా అమలు చేస్తోంది’ అని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు. చేనేత రంగానికి ప్రోత్సాహంపై మంగళవారం శాసనమండలిలో జరిగిన చర్చకు ఆయన సమాధానమిచ్చారు.

‘ప్రపంచ వస్త్ర ఉత్పత్తిలో దేశ వాటా 4 శాతమే. కాని చైనా 35 శాతాన్ని మించింది. బంగ్లాదేశ్‌ 14%తో ముందుంది. మనం చైనాతో పోటీపడేలా నేత పరిశ్రమ లను ప్రోత్సహించాలి. అందుకే వరంగల్‌లో 1,200 ఎకరాల్లో మెగా టెక్స్‌టైల్‌ పార్కు ఏర్పాటు చేశాం. కానీ దీనికి కేంద్రం నుంచి సహకారం కరువైంది’అని వివరించారు. గుండ్లపోచంపల్లిలోని అపెరల్‌ పార్కు 20 వేల మందికి ఉపాధినిచ్చేలా చర్యలు తీసుకుంటామని కేటీఆర్‌  ప్రకటించారు.

కార్మికులు కాదు.. కళాకారులు
చేనేత పని వారిని కార్మికులు అనకూడదని, కళాకారులుగా అభివర్ణించాలని కేటీఆర్‌ అభిప్రాయపడ్డారు. అంత అద్భుత పనితనం వారిలో ఉందని, కానీ గత ప్రభుత్వాలు పట్టించుకోకపోవటంతో వారివి వలస బతుకులయ్యాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘2002లో భూదాన్‌పోచంపల్లిలో వారం రోజుల్లో ఏడుగురు నేతన్నల ఆత్మహత్యతో కేసీఆర్‌ చలించిపోయారు.

నాటి ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవటంతో జోలపట్టి రూ.మూడున్నర లక్షలు వసూలు చేసి సాయం చేశారు. 2007లో సిరిసిల్లలో మరమగ్గం నేతలు ఆత్మహత్యలకు పాల్పడుతుండటంతో టీఆర్‌ఎస్‌ పక్షాన రూ.50 లక్షలతో ట్రస్టు ఏర్పాటు చేసి సూక్ష్మ రుణాలకు అవకాశం కల్పించడం కేసీఆర్‌ నిబద్ధతకు నిదర్శనం. తాజాగా రూ.1,200 కోట్ల బడ్జెట్‌ కేటాయించాం.

చేనేత కార్మికుల రుణమాఫీకి రూ.40 కోట్లు కేటాయించాం.రుణాల్లో సబ్సిడీ మొత్తాన్ని 50 శాతానికి పెంచాం’అని వివరించారు. రాష్ట్రంలో ఎన్ని చేనేత, మరమగ్గం నేత కుటుంబాలున్నాయో లెక్కలు తీసి చర్యలకు ఉపక్రమించామని చెప్పారు. రాష్ట్రంలో ప్రస్తుతం 17,523 చేనేతమగ్గాలు, 35,000 మరమగ్గాలున్నాయని పేర్కొన్నారు.

వస్త్రాన్ని మేమే కొంటాం
చేనేత పని వారు ఏటా 4.08 కోట్ల మీటర్ల వస్త్రాన్ని మాత్రమే ఉత్పత్తి చేస్తున్నారని, మరమగ్గాల ద్వారా 63 కోట్ల మీటర్ల వస్త్రం ఉత్పత్తి అవుతోందని కేటీఆర్‌ తెలిపారు. పాఠశాలలు సహా భవిష్యత్‌ సింగరేణి, ఆర్టీసీ కార్మికుల యూనిఫామ్స్‌కు కూడా వారి నుంచే వస్త్రాలు కొంటామని చెప్పారు.

బతుకమ్మ చీరల పేరుతో మరమగ్గాల ద్వారా నేసిన చీరలు కొంటున్నామని చెప్పారు. నేతన్నలకు పొదుపు పథకాన్ని అమలు చేస్తున్నామని, ఎంత వాటా పొదుపు చేస్తే అంతకు రెట్టింపు ప్రభుత్వం జోడించి జమ చేస్తోందని పేర్కొన్నారు. 36 వేల మందికి ఆసరా పింఛన్‌ ఇస్తున్నామని, గద్వాలలో రూ.15 కోట్లతో చేనేత పార్కు ఏర్పాటు చేస్తున్నామని, అన్ని జిల్లా కేంద్రాల్లో టెస్కో షోరూమ్‌లు ఏర్పాటు చేస్తామని చెప్పారు.

సమంత ఒక్క రూపాయి తీసుకోవట్లేదు
నేత పరిశ్రమకు తెలంగాణ బ్రాండ్‌ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న సినీనటి సమంత ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకోవటం లేదని కేటీఆర్‌ స్పష్టం చేశారు. సమంతను నియమించడంపైనా ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయని, దీని వెనక వేరే ఎజెండా లేదని సభ దృష్టికి తెచ్చారు. పట్టు పరిశ్రమకు కూడా చేయూత అందించేందుకు చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. బీజేపీ సభ్యుడు రామచందర్‌రావు సహా అధికార పార్టీ సభ్యులు కలిపి మొత్తం తొమ్మిది మంది ఈ చర్చలో తమ అభిప్రాయాలు సభ ముందుంచారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement