హైదరాబాద్: ప్రమాదస్థాయికి చేరిన హుస్సేన్ సాగర్ను మున్సిపల్ శాఖమంత్రి కేటీఆర్ శుక్రవారం పరిశీలించారు. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న వరదకు నగరం నడిబొడ్డులో ఉన్న హుస్సేన్ సాగర్ జలాశయం నిండుకుండను తలపిస్తున్న విషయం తెలిసిందే. జీహెచ్ఎంసీ మేయర్ బొంతు రామ్మోహన్ తో కలిసి ఆయన అక్కడ పరిస్థితిని సమీక్షించారు. ప్రస్తుతం హుస్సేన్ సాగర్‌లో పూర్తిస్థాయి నీటిమట్టం(513 అడుగులు) కొనసాగుతుందని గుర్తించిన మంత్రి ఇన్‌ఫ్లో, ఔట్‌ఫ్లోల గురించి అడిగి తెలుసుకున్నారు.
అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని కేటీఆర్ సూచించారు. ప్రస్తుతం జలాశయానికి ఇన్‌ఫ్లో 5,700 క్యూసెక్కులుగా ఉండగా.. కాలువల ద్వారా 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. కాగా గత మూడు రోజులుగా నగరాన్ని వాన ముంచెత్తుతున్న విషయం తెలిసిందే.