మండలిలో కేటీఆర్ వర్సెస్ షబ్బీర్
‘మేము పెట్టిన భిక్షతో..’ అంటూ వ్యాఖ్యానించిన షబ్బీర్ అలీ
- పోరాటాలతోనే తెలంగాణ వచ్చిందన్న మంత్రి కేటీఆర్
- తెలంగాణ అమరులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందంటూ కాంగ్రెస్ విమర్శ
సాక్షి, హైదరాబాద్: అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలతో అసెంబ్లీ సమావేశాలు వేడెక్కుతున్నాయి. మంగళవారం శాసనసభలో మాటల యుద్ధం జరగగా.. బుధవారం శాసన మండలిలో పరస్పర విమర్శలు దుమారం రేపాయి. వ్యవసాయం అంశంపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా టీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ.. ‘మేము పెట్టిన భిక్షతో..’ అని విపక్షనేత షబ్బీర్ అలీ చేసిన వ్యాఖ్య గందరగోళం రేపింది. ఇటు షబ్బీర్ అలీ, అటు మంత్రి కేటీఆర్‌ల మాటల యుద్ధం జరిగింది.
రైతుల బాధలు పట్టవా..?
చర్చలో తొలుత షబ్బీర్ అలీ మాట్లాడారు. నాలుగు విడతలుగా రుణమాఫీని అమలు చేస్తుండడంతో రైతులు తనఖా పెట్టిన ఆస్తుల పత్రాలు బ్యాంకుల స్వాధీనంలోనే ఉన్నా యని.. దాంతో వారికి కొత్త రుణాలు లభిం చడం లేదని పేర్కొన్నారు. పంట నష్టం, గిట్టుబాటు ధర లభించక రాష్ట్రంలో ఇప్పటి వరకు 2,650 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్పారు. కానీ ప్రభుత్వం మాత్రం 750 మరణాలను మాత్ర మే ధ్రువీక రించిందని.. అందులోనూ 340 కుటుంబాలకే పరిహా రం చెల్లించిందని విమర్శించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీ లెవరూ పరామ ర్శించలేదని.. రైతు ఆత్మహత్యలు ఆగిపో యేలా రైతుల్లో భరోసా కల్పించడంలో ప్రభుత్వం విఫ లమైందని ధ్వజమెత్తారు.
ఈ సమయంలో కేటీఆర్ జోక్యం చేసుకుంటూ.. రైతు ఆత్మ హత్యల విషయంలో అం దరం బాధపడుతు న్నామని చెప్పారు. గతంలో రూ.1.5 లక్షలు మాత్రమే ఉన్న పరిహారాన్ని తమ ప్రభుత్వం రూ.5 లక్షలకు పెం చిందన్నారు. షబ్బీర్ అలీ విద్యుత్ మంత్రిగా ఉన్నప్పుడు వ్యవసాయానికి మూడు విడతల్లో రెండు గంటల చొప్పున విద్యుత్ సరఫరా జరిగేదని.. దీంతో రైతులు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారని పేర్కొన్నారు. గత ప్రభు త్వాల హయాంలో ఎరువులు, విత్తనాల కోసం రైతులు లైన్లలో నిలబడేవారని... తమ ప్రభుత్వం వచ్చాక ఎక్కడైనా లైన్లు కన బడుతున్నాయా? అని ప్రశ్నించారు.
షబ్బీర్ వర్సెస్ కేటీఆర్..
కేటీఆర్ వ్యాఖ్యలపై షబ్బీర్ అలీ తీవ్రంగా ఆగ్రహించారు. ‘మేము పెట్టిన భిక్షతో...’ అని ఆయన ఆవేశంగా మాట్లాడుతుండగానే మైక్ కట్ అయింది. అయితే కేటీఆర్ ఆగ్రహంగా స్పందిస్తూ.. ‘‘తెలంగాణ ఇచ్చి పొరపాటు చేశామని శాసనసభలో విపక్ష నేత అంటారు. మేం భిక్ష పెట్టామని ఇక్కడ విపక్ష నేత అంటారు. ప్రజలు పోరాడి తెలంగాణ తెచ్చుకున్నారు. ఎవరూ పెట్టిన భిక్ష కాదు..’’ అని పేర్కొన్నారు. దీంతో షబ్బీర్ కల్పిం చుకుంటూ.. తెలంగాణ కోసం ప్రాణాలSర్పించిన అమరులను ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, కొందరికి మాత్రమే రూ.10 లక్షల పరిహారం చెల్లించి చేతులు దులుపుకొందని ఆరోపించారు. అమరుల పేర్లు ఎత్తే నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీకి లేదని, హంతకులే సంతాపాలు తెలుపుతున్నారంటూ కేటీఆర్ మండిపడ్డారు.
ఇన్‌పుట్ సబ్సిడీ ఏది?
గతేడాది పంటలు నష్టపోయిన రైతులకు కేంద్రం నుంచి రూ.950 కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ మంజూరై తొమ్మిది నెలలవుతున్నా రైతులకు ఎందుకు పంపిణీ చేయలేదని షబ్బీర్ అలీ ప్రభుత్వాన్ని నిలదీశారు. నకిలీ విత్తనాలతో నష్టపోయిన రైతులను ఎలా ఆదుకుంటారో తెలపాలని డిమాండ్ చేశారు. పరిశ్రమల విధానం తరహాలో ప్రభుత్వం సమగ్ర వ్యవసాయ విధానాన్ని రూపొందించాలని కాంగ్రెస్ సభ్యుడు పొంగులేటి సుధాకర్‌రెడ్డి సూచించారు. రుణమాఫీపై గందరగోళం ఏర్పడిందని, రైతులకు కొత్త రుణాలు లభించడం లేదని బీజేపీ సభ్యుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు. నోట్ల రద్దుతో రుణాలు లభించక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, రైతులకు బ్యాంకుల నుంచి రుణాలు ఇప్పించాలని ఎంఐఎం సభ్యుడు అల్తాఫ్ రిజ్వీ సూచించారు.