నగరాన్ని విశ్వనరకంగా మార్చారు
► ప్రభుత్వంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్ ఫైర్
►నగర రోడ్లు నరకానికి నకళ్లుగా మారాయి: కిషన్‌రెడ్డి
హైదరాబాద్: వంద రోజుల ప్రణాళికలో హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దుతామని చెప్పిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం.. దాన్ని విశ్వనరకంగా మార్చిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ ఆరోపిం చారు. నగరంలో గుంతలమయంగా మారిన రోడ్లు ప్రజల ప్రాణాలు హరిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఛిద్రమైన హైదరాబాద్ రోడ్లకు తక్షణమే మరమ్మతులు చేపట్టాలని డిమాండ్ చేస్తూ బీజేపీ శాసన సభా పక్ష నేత జి.కిషన్‌రెడ్డి శనివారం నల్లకుంట ఫీవర్ ఆస్పత్రి చౌరస్తా వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు.
ఇందులో లక్ష్మణ్ మాట్లాడుతూ.. ప్రజలపై పన్నుల భారం మోపిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం కనీస సదుపాయాలు కల్పించడంలో పూర్తిగా విఫలమైందన్నారు. విదేశీ పర్యటనలతో కాలయాపన చేస్తున్న మంత్రి కేటీఆర్ నగర అభివృద్ధిని గాలికి వదిలేశారని ధ్వజమెత్తారు. నగరంలోని సమస్యలను అధికారులు పట్టించుకోవడంలేదని కొందరు మంత్రులే స్వయంగా చెబుతున్నారంటే టీఆర్‌ఎస్ పాలన ఎంత అధ్వానంగా ఉందో అర్ధమవుతోందన్నారు. నాలాలకు రిటైనింగ్ వాల్ నిర్మిస్తే సరే... కానీ పేదల ఇళ్ల జోలికి వస్తే సహించేదిలేదన్నారు. చెరువుల భూము ల్లో నిర్మించిన అపార్ట్‌మెంట్లు, ఇళ్లకు ఎలా అనుమతులిచ్చారన్నారు.
అంతర్జాతీయ రోడ్లను తలపించేలా నగర రోడ్లను నిర్మిస్తామని చెప్పిన మంత్రి కేటీఆర్ నరకానికి మార్గంగా మారిన రోడ్లపై వివరణ ఇవ్వాలని కిషర్‌రెడ్డి డిమాండ్ చేశారు. ప్రభుత్వ భవనాలను కూల్చి కొత్తవి నిర్మించేందుకు కేటారుుస్తున్న నిధులతో పేదలకు ఇళ్లు నిర్మించి ఇవ్వాలన్నారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి ప్రకాశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.