టీఆర్‌ఎస్ పాలనలో పారదర్శకత లోపం
మీట్ ది ప్రెస్‌లో రాష్ట్ర ప్రభుత్వంపై లక్ష్మణ్ ధ్వజం
సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ప్రభుత్వ పాలనలో పారదర్శకత, జవాబుదారీతనం లోపిం చాయని బీజేపీ అధ్యక్షుడు లక్ష్మణ్ ధ్వజమెత్తారు. అవినీతితో పాటు అధికార కేంద్రీకరణ పెరిగి కేసీఆర్ ప్రభుత్వ పాలనలో సామాజికన్యాయం, ప్రజాస్వామ్యం కొరవడ్డాయని విమర్శించారు. శుక్రవారం ప్రెస్ క్లబ్ హైదరాబాద్ ఆధ్వర్యంలో నిర్వహించిన మీట్ ది ప్రెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రెస్‌క్లబ్ అధ్యక్ష, ఉపాధ్యక్షులు రాజమౌళిచారి, జనార్దనరెడ్డి సమన్వయ కర్తలుగా వ్యవహరించారు. ఈ సందర్భంగా లక్ష్మణ్ మాట్లాడుతూ రోజుకో మాట, పూటకో వాగ్దానం అన్న విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తుండడంతో వివిధ వర్గాల ప్రజలు తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు.
కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.లక్షకోట్ల ఇచ్చామని బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రకటించిన నేపథ్యంలో అసెంబ్లీలో ఈ అంశంపై చర్చ పెడితే గణాంకాలతో నిరూపిస్తామన్నారు. తమ పార్టీ విధానాలు. మోదీ చేస్తున్న అభివృద్ధి నచ్చి, ఎలాంటి షరతులు లేకుండా వస్తే టీడీపీనే కాదు ఏ పార్టీ నాయకుడు వచ్చినా బీజేపీలో చేర్చుకుంటామని ఒక ప్రశ్నకు ఆయన బదులిచ్చారు. కాగా, రాష్ట్రంలో మోదీ ప్రభావం, బీజేపీ ఊపు అంతర్లీనంగా కనిపిస్తోందని, అయితే ఎన్నికల ద్వారానే ఆ ప్రభావం నిరూపితమవుతుందని భావిస్తున్నామని లక్ష్మణ్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో ఒంటరి పోరుతోనే బీజేపీ అధికారంలోకి వస్తుందనే ధీమాను ఆయన వ్యక్తంచేశారు.
సామాజిక తెలంగాణ కోసం కృషి చేయాలి
సామాజిక, ప్రజాస్వామిక తెలంగాణ నిర్మాణానికి పార్టీ కార్యకర్తలు అంకితభావంతో పనిచేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పిలుపునిచ్చారు. నవతెలంగాణ దిశగా అడుగులు వేయాలని, ప్రజల్లో ఆత్మస్ధైర్యం నింపి, రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలని అన్నారు. మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు రాష్ట్రం లోని పేదలకు అందే విధంగా చేసి ప్రజల మన్ననలు పొందాలన్నారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా శుక్రవారం పార్టీ కార్యాలయంలో జాతీయ పతాకాన్ని ఎగురవేసిన అనంతరం ఆయన మాట్లాడుతూ, పోరాడి సాధించుకున్న తెలంగాణలో బీజేపీ నిర్వహించిన పాత్ర మరవలేనిదన్నారు. అమరుల త్యాగాల పునాదులపై అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్ తెలంగాణ ద్రోహులకు పెద్ద వేసిందని బీజేఎల్పీ నేత జి.కిషన్‌రెడ్డి విమర్శించారు.