
ఆదివారం సికింద్రాబాద్ లోని ఉజ్జయినీ మహంకాళి ఆలయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పూజలు.
ఘనంగా ఉజ్జయినీ మహంకాళి బోనాలు
అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించిన సీఎం కేసీఆర్
ప్రత్యేక పూజలు చేసిన కేంద్ర మంత్రులు వెంకయ్య, దత్తాత్రేయ
పోతురాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాలు.. డప్పుల దరువులు మధ్య ఆదివారం లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి జాతరకు వేలాది మంది తరలివచ్చి భక్తి ప్రపత్తులతో బోనాలు సమర్పించారు.
హైదరాబాద్: పోతురాజుల విన్యాసాలు.. శివసత్తుల పూనకాలు.. డప్పుల దరువుల మధ్య ఆదివారం లష్కర్ బోనాలు అంగరంగ వైభవంగా జరిగాయి. సికింద్రాబాద్ ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి బోనాల జాతరకు వేలాది మంది తరలి వచ్చి భక్తి ప్రపత్తులతో బోనాలు సమర్పించారు. తెల్లవారుజాము నుంచే అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.
పట్టువస్త్రాలు సమర్పించిన సీఎం
చారిత్రకఉజ్జయిని మహంకాళి అమ్మవారికి ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయనతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. సీఎం కేసీఆర్ మధ్యాహ్నం 12 గంటలకు అమ్మవారి దేవాలయానికి చేరుకున్నారు. ఆయనతో పాటు డి.శ్రీనివాస్, కే కేశవరావు, ఎమ్మెల్యే కొండా సురేఖ, కొండా మురళి ఉన్నారు. అప్పటికే దేవాలయం వద్ద ఉన్న మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిలు సీఎంకు ఘనస్వాగతం పలికారు. కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, దత్తాత్రేయ కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రులు నాయిని నర్సింహారెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, జగదీశ్వరరెడ్డి, పోచారం శ్రీనివాసరెడ్డి, శాసన మండలి చైర్మన్ స్వామి గౌడ్, డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్‌రెడ్డి, రాజ్యసభ సభ్యులు వి.హన్మంతరావు, ఎంపీలు కవిత, మల్లారెడ్డి కుటుంబ సమేతంగా అమ్మవారికి పూజలు చేశారు. ఎమ్మెల్యేలు గీతారెడ్డి, డీకే అరుణ, జి.సాయన్న, ఏనుగు రవీందర్‌రెడ్డి, తీగల కృష్ణారెడ్డి, రసమయి బాలకిషన్, శ్రీనివాస్‌గౌడ్, ఎన్‌వీవీఎస్ ప్రభాకర్, పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ బట్టి విక్రమార్క, మాజీ ఎమ్మెల్యే మర్రి శశిధర్‌రెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ ఉదయం 4 గంటలకు కుటుంబసమేతంగా ఆలయానికి చేరుకొని అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి తొలి పూజ చేశారు. కాగా, తెలంగాణలో జరిగే బోనాల ఉత్సవాలు ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలకు అద్దం పడతాయని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజలందరు సుఖశాంతులతో ఉండాలని అమ్మవారికి మొక్కుకున్నట్లు తెలిపారు.
పద్మారావు ఇంట సీఎం బోనాల విందు
ఉజ్జయినీ మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం కేసీఆర్ టకారా బస్తీలోని మంత్రి పద్మారావు స్వగృహంలో బోనాల విందుకు హాజరయ్యా రు. మధ్యాహ్నం 12.30కి మంత్రి ఇంటికి వచ్చిన సీఎం 1.30 గంటల వరకు అక్కడే ఉన్నారు.