18 నుంచి లాసెట్ దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: లాసెట్–2017 పరీక్షలకు ఈ నెల 18 నుంచి వచ్చే నెల 18 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని మంగళవారం లాసెట్ కన్వీనర్ ప్రొ.ఎంవీ రంగారావు తెలిపారు. అభ్యర్థులు ఎల్‌ఎల్‌బీ కోర్సు రిజిస్ట్రేషన్‌కు ఎస్సీ, ఎస్టీలు రూ.250, ఇతరులు రూ.350 ఫీజు చెల్లించా లన్నారు. ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశపరీక్షకు హాజరుకావాలనుకునే ఎస్సీ, ఎస్టీలు రూ.500, ఇతరులు రూ.600 చెల్లించాలని తెలిపారు. రూ.250 ఆలస్య రుసుముతో ఏప్రిల్ 19 నుంచి 28 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో వచ్చే నెల 29 నుంచి మే 6 వరకు, రూ.1000 ఆలస్య రుసుముతో మే 7 నుంచి 12 వరకు, రూ.1500 ఆలస్య రుసుముతో మే 13 నుంచి 15 వరకు ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాలను l్చఠీఛ్ఛ్టి.్టటఛిజ్ఛి.్చఛి.జీnలో పొందొచ్చన్నారు. న్యాయ కోర్సు ప్రవేశాలపై బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా విధించిన గరిష్ట వయసు నిబంధనపై సుప్రీం కోర్టు స్టే విధించడంతో ఈసారి గరిష్ట వయసు నిబంధన లేదన్నారు.
17 వరకు ఏపీ ఎంసెట్ దరఖాస్తు గడువు
బాలాజీచెరువు (కాకినాడ సిటీ): ఏపీ ఎంసెట్‌కు ఈ నెల 17లోగా అపరాధ రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చని కన్వీనర్ డాక్టర్ సీహెచ్ సాయిబాబు తెలిపారు. కాకినాడలోని జేఎన్‌టీయూలో మంగళవారం విలేకర్లతో మాట్లాడారు. మార్చి 26 వరకూ రూ.500, ఏప్రిల్ 10 వరకు రూ.1000, ఏప్రిల్ 17 వరకు రూ.5 వేలు, ఏప్రిల్ 22 వరకు రూ.10 వేల అపరాధ రుసుముతో దరఖాçస్తు చేసుకోవచ్చన్నారు. ఏప్రిల్ 19 నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చన్నారు.
ఇంజనీరింగ్ పరీక్ష ఏప్రిల్ 24, 25, 26, 27 తేదీల్లో ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 వరకు, మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు జరుగుతుందన్నారు. అగ్రికల్చర్, బీఫార్మసీ, డీఫార్మసీ, ఫుడ్ టెక్నాలజీ, హార్టికల్చర్ వంటి కోర్సులకు 28న, రెండు విభాగాలకూ హాజరయ్యే అభ్యర్థులకు ఆయా తేదీల ప్రకారం పరీక్ష నిర్వహిస్తామన్నారు. జిల్లాకు 3 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. హైదరాబాద్‌లో మౌలాలీ, నాచారం, హయత్‌నగర్‌ల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఎంసెట్ సందేహాల నివృత్తికి 0884–2340535లో సంప్రదించాలని కోరారు.