రాష్ట్ర బడ్జెట్ మొత్తం అంకెల గారడీయే. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతలు ఎదురు చూస్తున్న రుణమాఫీ గురించి ప్రస్తావనే లేదు. యనమల బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా ఉంది.
బడ్జెట్ అంతా అంకెల గారడీయే
రాష్ట్ర బడ్జెట్ మొత్తం అంకెల గారడీయే. రైతులు, డ్వాక్రా మహిళలు, చేనేతలు ఎదురు చూస్తున్న రుణమాఫీ గురించి ప్రస్తావనే లేదు. యనమల బడ్జెట్ పూర్తి నిరాశాజనకంగా ఉంది. మేనిఫెస్టోను చూపి ఓట్లేయించుకుని పేదప్రజల్ని నిలువునా వంచించారు. సంక్షేమ పథకాలకు కేటాయింపులు నామమాత్రమే.
- గడికోట శ్రీకాంత్‌రెడ్డి వైఎస్సార్‌సీపీ నేత
పన్నులన్నా పెంచాలి.. కోతలైనా పెట్టాలి
టీడీపీ ప్రభుత్వం పదేళ్ల తరువాత ప్రవేశపెట్టిన బడ్జెట్ ఏ మాత్రం ఆచరణ సాధ్యం కాదు. నిధులు ఎలా సమీకరిస్తారో బడ్జెట్‌లో పేర్కొనలేదు. బడ్జెట్ లెక్కలు వాస్తవ రూపంలోకి రావాలంటే ప్రభుత్వం ఎడాపెడా పన్నులనైనా పెంచాలి.. లేదంటే బడ్జెట్ గణాంకాలకు చివర్లో భారీగా కోతలైనా పెట్టాలి.
- సి. రామచంద్రయ్య మండలి ప్రతిపక్ష నేత
ఇది చరిత్రాత్మక బడ్జెట్
విభజన తర్వాత ఈ తొలి బడ్జెట్ చరిత్రాత్మకమైనది. సర్వజనామోదంగా రూపొందించారు. ఇంద్రధనుస్సులో ఏడు రంగులు ఉన్నట్లుగా ఏడు ప్రాధాన్య రంగాలకు కేటాయింపులు చేశారు. ఎన్నికల హామీలు, ప్రభుత్వ ప్రాధాన్యతలకు బడ్జెట్‌లో పెద్దపీట వేశారు. రైతు రుణమాఫీకి కట్టుబడ్డామనడానికి నిదర్శనం.
- గంటా శ్రీనివాసరావు రాష్ట్ర మంత్రి
బాబు మోసం చేశారు..
అధికారంలోకి వస్తే అన్ని రకాల రుణాలు రద్దు చేస్తామని చెప్పిన చంద్రబాబు నేడు ప్రజల్ని మోసం చేశారు. బాబు తొలి సంతకాలను అపహాస్యం చేశారు. ఎన్నికల ముందు అన్ని రుణాలు పూర్తిగా రద్దుచేస్తామని చెప్పి నేటికీ వాటిని రద్దుచేయకపోగా డ్వాక్రా రుణమాఫీకి కొత్తభాష్యం చెబుతున్నారు.
- ఎంవీఎస్ నాగిరెడ్డి రైతు నేత