నిర్బంధంపై న్యాయపోరాటం
టీజేఏసీ చైర్మన్ కోదండరాం
సాక్షి, హైదరాబాద్: సభలు పెట్టి ప్రజల సమస్యలు తెలుసుకుందామంటే రాష్ట్ర ప్రభుత్వం అరెస్టులు చేస్తున్నదని, దీనిపై న్యాయపోరాటం చేస్తామని తెలంగాణ జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ ఎం.కోదండరాం చెప్పారు. జేఏసీ స్టీరింగ్ కమిటీ సమావేశం మంగళవారం సుదీర్ఘంగా జరిగింది. ఈ సమావేశం వివరాలను కోదండరాం మీడియాకు తెలిపారు. తెలంగాణ అమరవీరుల స్ఫూర్తియాత్ర, నిజామాబాద్‌లో నిర్బంధం వంటివాటిపై సమావేశంలో చర్చించినట్టు ఆయన వెల్లడించారు. ప్రభుత్వం ఎన్ని ఆటంకాలు సృష్టించినా యాత్ర విజయవంతమైందన్నారు. యాత్రలను కొనసాగించాలని సమావేశం నిర్ణయించిందన్నారు.
ప్రజల సమస్యలను తెలుసుకుని, ప్రజాస్వామ్యయుతంగా పోరాడే హక్కు రాజ్యాంగం కల్పించిందన్నారు. రాజ్యాంగ హక్కులను హరించే విధంగా తమను అరెస్టులు చేసిందని, ఈ పరిస్థితులు ఒక్క జేఏసీకే కాదని, అన్ని ప్రతిపక్షాలకూ ఎదురవుతున్నాయని అన్నారు. అవసరంలేని సందర్భంలోనూ సెక్షన్ 151 ప్రయోగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్బంధాన్ని విధిస్తున్నదని, ఈ సెక్షన్ మార్గదర్శకాల కోసం న్యాయ పోరాటం చేస్తామన్నారు.
ఢిల్లీలో జేఏసీ కార్యక్రమాలు...: ఢిల్లీ పర్యటన తరువాత ఐదో విడత అమరవీరుల స్ఫూర్తి యాత్రను ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నిర్వహిస్తామని కోదండరాం చెప్పారు. ధర్నాచౌక్ పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 22న టీఆర్‌ఎస్ మూడేళ్ల పాలనపై సభ నిర్వహిస్తామన్నారు. ఢిల్లీలో ఈ నెల 21, 22, 23 తేదీల్లో జేఏసీ కార్యక్రమాలుంటాయన్నారు. నిరుద్యోగ సమస్యపై దసరా తరువాత హైదరాబాద్‌లో బహిరంగ సభను ఏర్పాటు చేస్తామన్నారు. జేఏసీని సంస్థాగతంగా బలోపేతం చేస్తామన్నారు. సమావేశంలో జేఏసీ నేతలు రఘు, గోపాలశర్మ, ఇటిక్యాల పురుషోత్తం, భైరి రమేశ్ పాల్గొన్నారు.