‘సాక్షి’ వరుస కథనాలతో కదలిన సర్కారు
టెండరు లేకుండా రూ.3 కోట్ల ఫర్నిచర్ కొనుగోలు
వెంటిలేటర్ల టెండర్లపైనా విమర్శలు
మందుల నాణ్యత డొల్లే
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర మౌలిక వైద్యసదుపాయాల అభివృద్ధి సంస్థ(ఏపీఎంఎస్‌ఐడీసీ)లో జరుగుతున్న అక్రమాలపై ‘సాక్షి’ వరుస కథనాలతో ప్రభుత్వం స్పందించింది. మందులు, యంత్రాల కొనుగోలు, కాంట్రాక్టర్ల నుంచి నాసిరకం ఔషధాలు తీసుకోవడం, హెచ్‌ఐవీ కిట్‌లు, వెంటిలేటర్లు కొనుగోలులో అవకతవకలపై సర్కారు కదలింది. ఆదివారం జరిగిన ఐఏఎస్‌ల బదిలీలలో ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ ఎం.రవిచంద్రను బదిలీ చేశారు. అయితే ఎండీ ద్వారా అనూహ్యంగా మేనేజర్ స్థాయి పదవులు పొందిన లాజిస్టిక్ మేనేజర్‌ను బదిలీ చేస్తారా లేక ఇక్కడే కొనసాగిస్తారా? అనే చర్చ జరుగుతోంది.
లాజిస్టిక్ మేనేజర్‌పై ఇప్పటికే విజిలెన్స్ విచారణ జరుగుతోంది. ఏపీఎంఎస్‌ఐడీసీలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వాసుపత్రులకు వైద్య పరికరాల కొనుగోలు తీరే దీనికి నిదర్శనం. హెచ్‌ఐవీ కిట్ల కొనుగోలుపై తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొన్న సంస్థ అధికారులు, ఇరు రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారుల ఆగ్రహానికి గురయ్యారు. తాజాగా ఎలాంటి టెండరు లేకుండా ప్రభుత్వాసుపత్రులకు రూ.3 కోట్ల విలువైన ఫర్నిచర్ కొనుగోలు చేశారు. డ్రగ్స్ అండ్ డిస్పోజబుల్స్ పేరుతో నేరుగా కొన్నారు. టెండరు ద్వారా కొంటే కనీసం 50 శాతం రేటు తగ్గే అవకాశమున్నా తమకు అనుకూలమైన వ్యక్తికి కాంట్రాక్టు కట్టబెట్టారు.
తెలంగాణ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు
ఏపీఎంఎస్‌ఐడీసీ అధికారులపై చాలామంది వైద్యులు తెలంగాణ ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. వైద్యుల కమిటీకి ఎలాంటి ప్రాధాన్యం లేదని, ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీతో పాటు మరో ఫార్మసిస్ట్ తమ నివేదికలను బుట్టదాఖలు చేస్తున్నారని, అలాంటప్పుడు కమిటీలు ఎందుకని ఫిర్యాదు చేశారు. ఓ ఫార్మసిస్ట్‌కు లాజిస్టిక్ మేనేజర్‌గా పదవులు కట్టబెట్టడంపై ఆ శాఖకు చెందిన అధికారులే ముఖ్య కార్యదర్శికి ఫిర్యాదు చేశారు.తమను ఇతర విభాగానికి బదిలీ చేయాలని కోరినట్లు తెలిసింది. ఎండీపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావుకుఫిర్యాదులు రావటంతో బదిలీ వేటు పడినట్లు తెలిసింది.
ఏపీఎంఎస్‌ఐడీసీ ఎండీ బదిలీ
Published Mon, Nov 3 2014 1:14 AM | Last Updated on Mon, Aug 20 2018 8:20 PM
Advertisement
Advertisement