- ఆర్థిక భృతికోసం ముగిసిన దరఖాస్తు గడువు
- 50 వేలకు చేరువైన బీడీ కార్మికుల దరఖాస్తులు
సాక్షి, హైదరాబాద్: ఒంటరి మహిళల ఆర్థిక భృతి పథకానికి దరఖాస్తు గడువు ఆదివారంతో ముగిసింది. ఈ పథకానికి సంబంధించి దరఖాస్తులను స్వీకరించేందుకు ఈనెల 8 నుంచి గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ (సెర్ప్) ప్రత్యేక డ్రైవ్ నిర్వహించింది. ఆదివారం వరకు 1,41,769 మంది ఒంటరి మహిళలు దరఖాస్తులు సమర్పించగా, ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు మేరకు 49 వేలమంది బీడీ కార్మికులు కూడా ఆర్థిక భృతి కోసం దరఖాస్తు చేసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఒంటరి మహిళలకు ఏప్రిల్ 1 నుంచి ప్రతినెలా రూ.వెయ్యి ఆర్థిక భృతిని అందజేస్తామని గత శాసనసభ సమావేశాల్లో సీఎం కేసీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
ఆ మేరకు ఏప్రిల్, మే నెలలకు సంబంధించి ఆర్థిక భృతి మొత్తాన్ని (రూ.రెండు వేలను) జూన్ 2న లబ్ధిదారు లకు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయిం చింది. ఇదిలా ఉంటే.. ఒంటరి మహిళలుగా అర్హత ఉన్నవారు తమకు అభయహస్తం పింఛన్ బదులు ఆర్థ్ధిక భృతిని ఇవ్వాలని దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 96 వేలమంది అభయహస్తం పెన్షనర్లు ఉండగా, వీరిలో సుమారు 10వేలమంది దాకా ఒంటరి మహిళలున్నట్లు సమాచారం. రాష్ట్రం లో ఒంటరి మహిళల ఆర్థిక భృతికి 2 లక్షల నుంచి 3 లక్షల వరకు దరఖాస్తులు అందవ చ్చని ప్రభుత్వం అంచనా వేసింది. అయితే అందుకు భిన్నంగా 1,41,769 దరఖాస్తులు మాత్రమే వచ్చాయి.
సర్కారు నిర్ణయం మేరకే!
ప్రస్తుతం అభయహస్తం పథకం కింద నెలకు రూ.500 చొప్పున పింఛన్ పొందుతున్న వారిలో ఒంటరి మహిళలుగా ఆర్ధిక భృతి (రూ.1,000)ని పొందేందుకు అర్హత ఉన్న వారు ఉన్నట్లు మా దృష్టికి వచ్చింది. అభయహస్తం బదులు ఆర్థిక భృతిని ఇచ్చే అంశంపై ప్రభుత్వానికి నివేదిక పంపుతాం. ప్రభుత్వ నిర్ణయం మేరకు ఒంటరి మహిళలు, బీడీ కార్మికులకు జూన్ 2న ఆర్థిక భృతిని అందజేస్తాం.
– పౌసమి బసు, సెర్ప్ సీఈవో
ఒంటరి మహిళలు లక్షన్నర లోపే!
Published Mon, May 22 2017 12:45 AM | Last Updated on Tue, Oct 2 2018 5:51 PM
Advertisement