..ఇలా ఒక్కరిద్దరు కాదు.. రాష్ట్రంలో వేలాది మంది రైతులది ఇదే గోస! అకాల వర్షం అన్నదాతలను కుదేలు చేసింది. ఇప్పటివరకు 16 జిల్లాల్లో దాదాపు లక్ష ఎకరాల్లో పంట నష్టం జరిగింది. ఒక్క వరి పంటే 72 వేల ఎకరాల్లో దెబ్బతింది. అదంతా కోతకు సిద్ధంగా ఉన్నదే కావడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. అలాగే 15 వేల ఎకరాల్లో మొక్కజొన్నకు నష్టం వాటిల్లింది. 7,500 ఎకరాల్లో మామిడి కాయలు రాలిపోయాయి.
బత్తాయి, నిమ్మ తోటలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. అత్యధికంగా నల్లగొండలో 32 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లినట్టు వ్యవసాయ శాఖ వర్గాలు వెల్లడించాయి. తర్వాత ఖమ్మం జిల్లాలో 29 వేల ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. మరోవైపు అనేకచోట్ల గ్రీన్‌హౌస్ నిర్మాణాలు కూలిపోయాయి. వడగండ్లు పడడంతో చాలావరకు దెబ్బతిన్నాయి. దీంతో అందులో వేసిన పూలు, కూరగాయల తోటలకు నష్టం వాటిల్లింది. – సాక్షి, హైదరాబాద్
అంచనాలు సిద్ధం చేయండి
రాష్ట్రంలో పలుచోట్ల భారీ వర్షాలు, వడగండ్ల వానల నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని వెంటనే అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిక సమర్పించాల్సిందిగా ఆదేశించారు. అకాల వర్షాలు, వడగండ్ల వానలపై సోమవారం ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్.కె.జోషితో మాట్లాడారు.
గత 15 రోజులుగా వర్షాల వల్ల జరిగిన పంట నష్టాన్ని, రాబోయే రోజుల్లో పడే వర్షాలతో కలిగే నష్టాన్ని అంచనా వేయాలని ఆదేశించారు. నష్టపోయిన రైతులకు ఇన్‌పుట్ సబ్సిడీ ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని, నివేదికలు వెంటనే పంపించాలని ఆదేశించారు. సీఎం ఆదేశాలతో సీఎస్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ఫోన్లో మాట్లాడారు.
పంట నష్టాన్ని అంచనా వేసి పంపాలని సూచించారు. అధి కార బృందాలు తక్షణం గ్రామాల్లో పర్యటిం చాలని ఆదేశించారు. దీంతో వ్యవసాయశాఖ అధికారులు గ్రామాల్లో పర్యటించి అంచనా నివేదికలను రూపొందిస్తున్నారు. పంట నష్టాన్ని అంచనా వేశాక కేంద్రానికి పంపుతామని అధికారులు తెలిపారు.
6న గాలి బీభత్సం!
గత 24 గంటల్లో హయత్‌నగర్‌లో 5 సెం.మీ. వర్షపాతం నమోదైంది. బూర్గుంపాడులో 4, భద్రాచలంలో 3, భువనగిరి, ములుగు, కూసుమంచి, కంపాసాగర్, గోవిందరావుపేట, దేవరకొండల్లో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. మరోవైపు ఉపరితల ద్రోణి కారణంగా ఈ నెల 6న రాష్ట్రంలో అక్కడక్కడ గాలి బీభత్సం, వానలు ఉంటాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది.
జిల్లాల్లో బీభత్సం
నెట్‌వర్క్: పలు జిల్లాల్లో సోమవారం గాలివాన బీభత్సం సృష్టించింది. ఈదురుగాలులు, వడగండ్ల వర్షంతో వరి, అరటి, మొక్కజొన్న, మామిడి తోటలు నేలకొరిగాయి. వేలాది ఎకరాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. ఈదురుగాలులకు స్తంభాలు నేలకొరగడంతో పలుచోట్ల విద్యుత్ సరఫరాకు అంతరాయం కలిగింది.
కోదాడ మండలం ఎర్రవరంలో మొక్కజొన్న నష్టాన్ని చూసి తట్టుకోలేక కౌలు రైతు బంటు హుస్సేన్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. నేరేడుచర్ల మండలం దాసారంలో పొలం పనులు చేస్తుండగా తాటి చెట్టు కూలి కోటా మట్టయ్య (25) అనే రైతు మృతి చెందాడు. తుంగతుర్తి మండలం కొత్తగూడెంలో 80 సైబీరియన్ కొంగలు మృత్యువాత పడ్డాయి. తిరుమలగిరి మండలం మాలిపురంలో కోళ్లషెడ్డు ధ్వంసమవడంతో వెయ్యి కోళ్లు చనిపోయాయి.
Comments
Please login to add a commentAdd a comment