షేర్లలో నష్టాలు.. భార్యపై అనుమానాలు.. | Losses in shares and doubts on the wife | Sakshi
Sakshi News home page

షేర్లలో నష్టాలు.. భార్యపై అనుమానాలు..

Published Wed, Jul 6 2016 1:45 AM | Last Updated on Tue, Aug 21 2018 5:54 PM

షేర్లలో నష్టాలు.. భార్యపై అనుమానాలు.. - Sakshi

షేర్లలో నష్టాలు.. భార్యపై అనుమానాలు..

- సింథియా హత్యకు దారితీసిన గొడవలు
- వివరాలు వెల్లడించిన శంషాబాద్ డీసీపీ
 
 సాక్షి, హైదరాబాద్ : షేర్ మార్కెట్‌లో నష్టాలు... భార్య మరొకరితో ఫేస్‌బుక్‌లో చాటింగ్‌తో ఆమెపై అనుమానం... గొడవలకు కారణాలై చివరకు హత్యకు దారితీసింది. కాంగో వాసి సింథియా వెచెల్‌ను చంపి ముక్కలు ముక్కలుగా చేసి, తగలబెట్టిన ఆగ్రా వాసి రూపేశ్‌కుమార్ మోహనాని అరెస్టు చేసిన పోలీసులు మంగళవారం ఆ వివరాలను వెల్లడించారు. శంషాబాద్ ఏసీపీ అనురాధతో కలిసి డీసీపీ సన్‌ప్రీత్‌సింగ్ మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఈ హత్యకు దారితీసిన కారణాలను తెలిపారు. రూపేశ్‌కుమార్(36) కుటుంబం అతని చిన్నప్పుడే ఆగ్రా నుంచి హైదరాబాద్‌కు వచ్చి స్థిరపడింది.

1999లో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న రూపేశ్ సెంట్రల్ ఆఫ్రికాలోని కాంగో వెళ్లి ఓ డిపార్ట్‌మెంటల్ స్టోర్‌లో సేల్స్‌మ్యాన్‌గా పనిచేశాడు. అదే సమయంలో అక్కడి మలిబు క్లబ్ డ్యాన్సర్ సింథియా వెచెల్(30)తో పరిచయం ప్రేమగా మారింది. 2008లో ఆమెను రూపేశ్ అక్కడే పెళ్లి చేసుకున్నాడు. అదే ఏడాది వారికి కుమార్తె సానియా జన్మించింది. 2012లో భార్య, కుమార్తె, వెచెల్ సోదరుడు డానిస్‌తో కలిసి హైదరాబాద్ వచ్చిన రూపేశ్ గచ్చిబౌలిలోని జైన్ శిల్ప సైబర్ వ్యూలో అద్దెకు దిగాడు.

 ఆ రాత్రి ఏం జరిగింది..!  
 షేర్ మార్కెట్‌లో నష్టాల కారణంగా భార్యాభర్తల మధ్య గొడవలు తలెత్తాయి. ఇదే సమయంలో సింథియా తరచూ ఫేస్‌బుక్‌లో ఆమె స్నేహితుడు కిన్యూని కమిటబుతో చాటింగ్ చేస్తుండేది. ఇది గమనించిన రూపేశ్... భార్యను పద్ధతి మార్చుకోవాలని చెప్పినా ఆమెలో ఎలాంటి మార్పు రాలేదు. ఈ నెల 3 అర్ధరాత్రి మూడు గంటల వరకు భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కూతురు సానియాను తీసుకుని ఫ్రాన్స్ వెళ్లిపోతానని సింథియా పట్టుబట్టడంతో అందుకు ఒప్పుకోని రూపేశ్ ఒంటరిగా వెళ్లమన్నాడు. దీంతో మాటమాట పెరిగి తోపులాట జరిగింది. సింథియా రూపేశ్‌ను తోయడంతో గోడకు తగిలి అతని తలకు గాయమైంది. దీంతో కోపోద్రిక్తుడైన రూపేశ్ ఒక్క ఉదుటున సింథియాపై పడి గొంతు నులుమడంతో ఆమె సృ్పహ తప్పింది.

ఈ ఘటన జరిగిన సమయంలో మరో గదిలో సానియా, డానిస్ ఉన్నారు. సింథియా చనిపోయిందని నిర్థారించుకున్న రూపేశ్... సోమవారం ఉదయం తన గది నుంచి బయటకు వచ్చి తాళం వేశాడు. సానియాను రోజూ మాదిరిగానే రెడీ చేసి కారులో మాదాపూర్‌లోని స్కూల్‌లో వదిలి తిరిగి ఇంటికి వచ్చాడు. ఆ తర్వాత డానిస్ నిద్ర లేచి బయటకు వెళ్లిపోయాడు. మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో... వణ్యప్రాణులను వేటాడే అలవాటున్న రూపేశ్ గతంలోనే కొనుగోలు చేసిన కత్తి, సుత్తి, గొడ్డలితో భార్య మృతదేహంలో తల, మొండాన్ని వేరు చేశాడు. వాసన రాకుండా స్ప్రే చల్లి, వాటిని పెద్ద సైజు బ్యాగులో వేశాడు. సాయంత్రం 4 గంటలకు పాపను స్కూల్ నుంచి తీసుకొని వచ్చి బ్యాగులో ఉన్న చెత్తను కాల్చివద్దామంటూ ఫోర్డ్ కారులో బయలుదేరాడు.
 
 దారిలో పెట్రోల్ కొనుగోలు..
 ఇంటి నుంచి బయలుదేరిన రూపేశ్.. దారి మధ్యలో పెట్రోల్ బంక్‌లో ఎనిమిది లీటర్ల పెట్రోలు కొనుగోలు చేశాడు. రాత్రి 7 గంటల సమయంలో మదన్‌పల్లి గ్రామ శివారు గ్రీన్ సిటీ వెంచర్‌లోని నిర్మానుష్య ప్రాంతానికి చేరుకున్నాడు. చెత్తను పడేసి వస్తానంటూ కొంత దూరం ముందే కూతుర్ని దింపేసి, భార్య మృతదేహన్ని తీసి పెట్రోలు పోసి తగులబెట్టాడు. తిరిగి వెళ్తున్న క్రమంలో వర్షం కారణంగా కారు బురదలో ఇరుక్కపోయింది. హెల్ప్ హెల్ప్ అంటూ రూపేశ్ అరవడంతో పక్కనే ఉన్న ఓ ఫాంహౌస్‌లో నుంచి ఇద్దరు కూలీలు వచ్చి కారును బయటకు లాగారు. ఈ లోగా అట్నుంచి బైక్‌పై వెళుతున్న ఇద్దరు యువకులు చీకట్లో దూరంగా మంటలు కనిపించడంతో అక్కడకు వెళ్లారు. మృతదేహం కాలుతుండటం చూసి... రూపేశ్‌పై అనుమానంతో దేహశుద్ధి చేశారు. శంషాబాద్ పోలీసులకు సమాచారమిచ్చారు. ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకోవడంతో హత్య విషయం వెలుగు చూసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement