చనిపోయిన నేవీ అధికారి సూరజ్ దూబే (ఫైల్ ఫోటో)
ముంబై: తమిళనాడులోని చెన్నైలో కిడ్నాప్‌కు గురైన నౌకాదళ అధికారి సూరజ్ కుమార్ దుబేని ముంబైలో సజీవదహనం చేయడంతో హత్యకు గురైన సంగతి తెలిసందే. ఈ క్రమంలో మహారాష్ట్ర పోలీసులు కేసు దర్యాప్తుకు సంబంధించి కీలక విషయాలు వెల్లడించారు. మృతి చెందిన సూరజ్‌కుమార్ దుబే షేర్ మార్కెట్ ట్రేడింగ్ చేసేవాడని.. ఈ క్రమంలో బ్యాంక్, స్నేహితుల దగ్గర భారీగా అప్పు చేశాడని తెలిసింది. మరో విషాదకర అంశం ఏంటంటే దూబేకి గత నెల 15న నిశ్చితార్థం జరిగింది.. ఈ ఏడాది ఏప్రిల్‌లో ఇద్దరికి వివాహం జరగాల్సి ఉంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చనిపోయిన సూరజ్ కుమార్ దుబే బ్యాంక్ ఖాతాలను పరిశీలించిన పోలీసులు అతడు చనిపోవడానికి ముందు బ్యాక్ నుంచి 8 లక్షల రూపాయల లోన్, ఓ కొలిగ్ వద్ద నుంచి 5.75 లక్షల రూపాయలు అప్పుగా తీసుకున్నాడని తెలిపారు. ఇదే కాక కాబోయే మామగారి దగ్గర నుంచి 9 లక్షల రూపాయలు తీసుకున్నట్లు తెలిసింది అన్నారు. ఇంత భారీ మొత్తం అప్పుగా తీసుకున్నప్పటికి ప్రస్తుతం అతడి ఖాతాలో కేవలం 392 రూపాయలు మాత్రమే ఉన్నాయని పోలీసులు తెలిపారు.
సూరజ్ దూబే అప్పు చేసిన ఈ మొత్తాన్ని షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఇక అప్పు ఇచ్చిన స్నేహితుడు డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా దూబేపై ఒత్తిడి తెచ్చినట్లు పోలీసులు గుర్తించారు. ఇక జనవరి నెల మొత్తం సెలవుల్లో ఉన్న దూబే విధుల్లో తిరిగి చేరడం కోసం జనవరి 30న ఉదయం 8 గంటలకు రాంచీ నుంచి హైదరాబాద్ వెళ్లే విమానం ఎక్కాడు. దిగాక తన కుటుంబ సభ్యులకు కాల్ చేశాడు. హైదరాబాద్ నుంచి బయలుదేరిన దూబే చెన్నైలో దిగగా ముగ్గురు వ్యక్తులు అతడిని గన్‌తో బెదిరించి కిడ్నాప్ చేశారు. మూడు రోజులు దూబేని చెన్నైలో ఉంచారు. ఇక దుబే నుంచి జనవరి 30 తర్వాత ఎలాంటి కాల్ రాకపోవడం.. ఫోన్ స్విచ్ఛాఫ్‌లో ఉండటంతో అతడి కుటుంబ సభ్యులు నేవీ ఉన్నతాధికారికి సమాచారం ఇచ్చారు.
దాంతో వారు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిబ్రవరి 1న దూబే మూడు ఫోన్‌లలో ఒక నెంబర్ రింగ్ అయినట్లు అతడి స్నేహితుడు తెలపడంతో పోలీసులు దాన్ని ట్రేస్ చేసే ప్రయత్నం చేశారు. దూబే ఈ నంబర్‌ని షేర్ మార్కెటింగ్ ట్రేడింగ్ కోసం వినియోగించేవాడని దర్యాప్తులో తెలిసిందన్నారు పోలీసులు. మరో నాలుగు రోజుల తర్వాత ఫిబ్రవరి 5న దుండగులు దూబేని పహల్‌గఢ్‌లోని ఎతైన కొండ ప్రాంతానికి తీసుకెళ్లి పెట్రోల్ పోసి నిప్పంటించారు. తీవ్రంగా గాయపడిన అతడిని ఆస్పత్రికి తీసుకెళ్లినప్పటికి లాభం లేకపోయింది. మరణించాడు. ఈ క్రమంలో జనవరి 31-ఫిబ్రవరి 5 మధ్యన ఆ ఆరు రోజుల పాటు ఏం జరిగి ఉంటుందనే విషయం కీలకంగా మారింది. ప్రస్తుతం పోలీసులు ఈ చిక్కు ముడిని విప్పే ప్రయత్నం చేస్తున్నారు. షేర్ మార్కెట్ ట్రేడింగ్, భారీ మొత్తంలో డబ్బు అప్పు చేయడం వంటి అంశాలే దూబే మరణానికి కారణమై ఉంటాయని పోలీసులు భావిస్తున్నారు.
దూబే మొబైల్‌కి ఓ నంబర్ నుంచి వరుసగా 13 కాల్స్ రావడంతో అది ఎవరిదనేది తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు పోలీసులు. మరి కొద్ది రోజుల్లోనే దోషులను పట్టుకుంటామని తెలిపారు. ఇక దూబేకి షేర్ మార్కెట్‌లో ఇన్వెస్ట్ చేసే అలవాటు ఉందని కానీ.. అతడి దగ్గర మూడు మొబైల్ ఫోన్లు ఉన్నాయనే విషయం కానీ కుటుంబ సభ్యులకు తెలియకపోవడం గమనార్హం.
చదవండి: బెంగుళూరులో చంపారు.. రావూరులో పూడ్చారు..
చెన్నైలో కిడ్నాప్.. ముంబైలో సజీవదహనం
Comments
Please login to add a commentAdd a comment