రూ. 50 కోట్లు ముంచేసి.. రాత్రికి రాత్రే పరార్‌ | Share Market Fraud In Narayanapet District | Sakshi
Sakshi News home page

రూ. 50 కోట్లు ముంచేసి.. రాత్రికి రాత్రే పరార్‌

Published Thu, Mar 25 2021 4:16 AM | Last Updated on Thu, Mar 25 2021 4:54 AM

Share Market Fraud In Narayanapet District - Sakshi

సాక్షి, మక్తల్‌: లక్ష రూపాయలు డిపాజిట్‌ చేస్తే నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు కమీషన్‌ ఇస్తానని చెప్పి, సుమారు రూ. 50 కోట్లకు కుచ్చుటోపీ పెట్టాడు ఓ ఘరానా మోసగాడు. మోసపోయామని తెలుసుకున్న బాధితులు లబోదిబోమంటూ పోలీసులను ఆశ్రయించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం, తూర్పుగోదావరి జిల్లా కాకినాడ అర్బన్‌ పరిధిలోని రామకృష్ణారావుపేటకు చెందిన షేక్‌ మహిబూబ్‌ సుబానీ, భార్యాపిల్లలతో కలిసి రెండేళ్ల క్రితం నారాయణపేట జిల్లా మక్తల్‌ పట్టణానికి వలస వచ్చాడు. గుర్లపల్లి రోడ్డు సమీపంలోని ఓ ఇంట్లో అద్దెకు ఉంటూ ‘మిత్ర’పేరుతో ఫర్టిలైజర్‌ షాపును తెరిచి పురుగు మందులను అమ్మేవాడు. స్థానికులతో పరిచయాలు పెంచుకున్న అనంతరం ఆరు నెలల క్రితం దుకాణం మూసేసి, మిత్ర ఎంటర్‌ప్రైజెస్‌ పేరుతో సంస్థను ఏర్పాటుచేసి షేర్‌ మార్కెట్‌ వ్యాపారం మొదలుపెట్టాడు.

రూ.లక్ష ఇస్తే నెలకు రూ.20 వేల నుంచి రూ.30 వేల వరకు కమీషన్‌ వస్తుందని డిపాజిట్‌దారులను నమ్మించాడు. దీంతో బాధితులు ఐసీఐసీఐ గద్వాల బ్రాంచ్‌లో ‘మిత్ర’సంస్థ పేరిట డబ్బులు జమచేసి రసీదును సుబానీకి ఇచ్చేవారు. ఆ డబ్బులతో మక్తల్‌ మండలం మంతన్‌గోడ్, ఊట్కూర్‌లో పదెకరాల చొప్పున సుబానీ కొనుగోలు చేశాడు. నెల క్రితం తన కుమారుడు షేక్‌ అస్జర్‌అలీ యజమానిగా శ్రీఅంజలి పేరుతో జ్యువెలరీ షాపు ప్రారంభించాడు. ఈ క్రమంలోనే ఈనెల 21న మక్తల్‌ మండలం చందాపూర్‌కు చెందిన హన్మంతు రూ.ఐదు లక్షలు సుబానీకి ఇచ్చాడు.  చదవండి: (టార్గెట్‌ రూ.216 కోట్లు! దొంగిలించేందుకు యత్నం)

బుధవారం తమ షాపు వద్దకు వస్తే ఐదు తులాల బంగారంతో పాటు నెలకు రూ.30 వేల చొప్పున కమీషన్‌ ఇస్తానని సుబానీ ప్రామిసరీ నోట్‌ రాసిచ్చాడు. బుధవారం అక్కడికి వెళ్లిన హన్మంతు షాపు మూసి ఉండటంచూసి కంగుతిన్నాడు. విషయం మిగతా వారికి చెప్పడంతో ఆరా తీయగా ఈనెల 23న అర్ధరాత్రే సుబానీ కుటుంబసభ్యులతో కలిసి ఇల్లు, దుకాణం ఎత్తేసి పరారయ్యాడని తెలిసింది. ఒక్కొక్కరి నుంచి రూ.5 లక్షలు మొదలుకుని రూ.25 లక్షల వరకు, సుమారు ఐదొందల మంది నుంచి డబ్బులు వసూలు చేశాడని సమాచారం. బాధితుల ఫిర్యాదుతో ఎస్‌ఐ రాములు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement