-కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్‌లో సంయుక్త కార్యదర్శిగా గిరిధర్ నియామకం
-రిలీవ్ చేయమని సీఎస్‌కు గిరిధర్ దరఖాస్తు
సాక్షి, హైదరాబాద్
రాష్ట్ర సర్వీసు నుంచి ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు కేంద్ర సర్వీసుకు వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం రాష్ర్ట పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శిగా పనిచేస్తున్న 1988 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఎ. గిరిధర్‌ను కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్‌లో సంయుక్త కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. దీంతో రాష్ట్ర సర్వీసు నుంచి రిలీవ్ అయ్యి కేంద్ర సర్వీసుకు వెళ్లిపోవాలని గిరిధర్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర సర్వీసు నుంచి రిలీవ్ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సోమవారం గిరిధర్ దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో గిరిధర్ కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అయితే రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరిక మేరకు కేంద్ర సర్వీసు నుంచి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసేందుకు రాష్ట్ర సర్వీసుకు గిరిధర్ వచ్చారు.
విభజన క్లిష్ట సమయంలో గిరిధర్ ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శిగా కీలక బాధ్యతలను నిర్వహించారు. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి పనిచేశారు. అయితే చెప్పుడు మాటలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గిరిధర్‌ను మున్సిపల్ శాఖకు బదిలీ చేశారు. మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శిగా కూడా గిరిధర్ సింగపూర్ ప్రభుత్వం, అక్కడ కంపెనీలతో రాజధాని మాస్టర్ ప్రణాళిక రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. అయితే సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు చెప్పినట్లు చేసేందుకు, ముఖ్యంగా మున్సిపల్ మంత్రి నారాయణ చెప్పినట్లు చేసేందుకు గిరిధర్ అంగీకరించలేదు. ఇక మున్సిపల్ శాఖలో పనిచేసే వాతావరణం లేదని గిరిధర్ అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు.
దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శిగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి గిరిధర్ కేంద్ర సర్వీసుకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మార్గం సుగమమైంది. మరో సీనియర్ ఐఏఎస్ అధికారి 1996 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన లవ్ అగర్వాల్ కూడా కేంద్ర సర్వీసుకు వెళ్లిపోతున్నారు. అగర్వాల్ ప్రస్తుతం విపత్తుల శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఇంతకు ముందు అగర్వాల్ గృహ నిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. ప్రభుత్వం ఇటీవల ఆయనను విపత్తుల శాఖ కమిషనర్‌గా బదిలీ చేసింది. లవ్ అగర్వాల్‌ను కేంద్ర ప్రభుత్వం వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శిగా నియమించింది. దీంతో అగర్వాల్ కూడా రాష్ట్ర సర్వీసు నుంచి కేంద్ర సర్వీసుకు వెళ్లిపోనున్నారు.
కేంద్ర సర్వీసులకు గిరిధర్, లవ్ అగర్వాల్
Published Tue, Aug 23 2016 6:01 PM | Last Updated on Tue, Sep 4 2018 5:21 PM
Advertisement