Senior IAS
-
సీఎంవోలో సీనియర్ ఐఏఎస్‌కు అవమానమా?
అమరావతి, సాక్షి: ఆయనో సమర్థవంతమైన ఐఏఎస్ అధికారి. డిప్యూటేషన్ మీద కేంద్రంలో కీలక శాఖల్లో పని చేసిన అనుభవమూ ఉంది. అయితే ఆయన సేవలు వాడుకుంటామంటూ.. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక ఆఘమేఘాల మీద ఆయన్ని కేంద్ర సర్వీసుల నుంచి రప్పించుకుంది. ఇప్పుడు సీఎంవోలో ఎలాంటి శాఖలు అప్పగించకుండా ఇప్పుడు ఖాళీగా కూర్చోబెట్టింది. ఏపీ క్యాడర్ ఐఎఎస్ అధికారి అయిన పీయూష్ కుమార్ కేంద్రంలో డెప్యూటేషన్ పై పని చేసేవారు. ఆయన కేంద్ర పరిశ్రమలు, వాణిజ్య విభాగంలోని అదనపు కార్యదర్శిగా విధులు న్విహించారు. అయితే ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువుదీరాక.. సీఎం చంద్రబాబు కేంద్రానికి రిక్వెస్ట్ పెట్టారు. దీంతో.. కేంద్రం ఆయనను కేంద్ర సర్వీసుల నుంచి రిలీవ్ చేసింది. వచ్చిరాగానే సీఎం ప్రిన్సిపాల్ సెక్రటరీగా, ఆ వెంటనే ఆర్థిక శాఖ ప్రధాన కార్యదర్శిగా, ఆ వెంటనే రాష్ట్ర ప్లానింగ్ సొసైటీ సీఈవోగా ఏపీ ప్రభుత్వం పూర్తి అదనపు బాధ్యతలు అప్పగించినట్లు హడావిడి చేశారు. అయితే.. తాజాగా సీఎంవోలోని అధికారులకు శాఖలు కేటాయిస్తూ సీఎం ముఖ్యకార్యదర్శి రవిచంద్ర ముద్దాడా ఉత్తర్వులు జారీ చేశారు. అందులో ముద్దాడా రవిచంద్ర, ప్రద్యుమ్న, రాజమౌళి, కార్తికేయ మిశ్రాలకే శాఖల కేటాయింపు ఉంది. కానీ, పీయూష్ కుమార్‌కు మాత్రం ఏ శాఖను చంద్రబాబు కేటాయించలేదు. దీంతో ఏ శాఖా కేటాయింపు లేకుండానే ఆయన సీఎంవోలో కూర్చుకున్నారు. మరోవైపు.. కావాలనే ఆయన్ని అవమానిస్తున్నారేమో? అని సీఎంవో అధికారులు గుసగుసలాడుకుంటున్నారు. -
మీ ముందుకు.. ‘గెలుపు పిలుపు’
‘ఎన్ని అడ్డంకులు, అవరోధాలు వచ్చినా తాను ఎంచుకున్న మార్గం నుంచి వైదొలగకుండా ఉంటే గెలుపు సింహాసనం సాక్షాత్కరిస్తుంది. దాన్ని నిజం చేసి చూపిన నేత ఏపీ సీఎం వై.ఎస్.జగన్మోహన్రెడ్డి. నిత్యం జనం మధ్య ఉంటూ వారి కష్టసుఖాలు తెలుసుకొని వారి కోసం పాటుపడితే వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అందుకే ఆయన గొప్ప విజయం సాధించారు. ఆయనది జనామోదిత గెలుపు’ ‘ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా, ఎలాంటి విపత్కర పరిస్థితులైనా తొణక్కుండా, బెదరకుండా అద్భుత ప్రణాళికలు రచించి అమలు చేసి అద్భుత విజయాలు సొంతం చేసుకోవటం నిరంతర గెలుపు లక్షణం. దానికి నిదర్శనమే తెలంగాణ సీఎం కేసీఆర్’ ‘అవకాశం వచ్చినప్పుడు మనకు మనం విశ్లేషించి ముందుకు సాగితే.. ఎవరికీ తెలియని విషయాలను మనం అందరికీ చెప్పొచ్చు. అందుకే అద్భుత విజయం న్యూటన్ వశమైంది’ఇవీ సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం రచనల్లో ఉటంకించిన అంశాలు. సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం కలం నుంచి మరో పుస్తకం అందుబాటులోకి వచ్చింది. కీలక బాధ్యతల్లో ఉంటూనే పుస్తక రచనవైపు మళ్లిన ఆయన ఐదు నెలల క్రితం ‘సెల్ఫీ ఆఫ్ సక్సెస్’పేరుతో ఆంగ్లంలో ఓ రచనను జనం ముందుకు తెచ్చారు. అది అమెజాన్ ఆన్లైన్ మార్కెట్లో ప్రపంచ రచనలతో పోటీపడి కొన్ని రోజులపాటు తొలిస్థానంలో నిలబడి ఆశ్చర్యపరిచింది. కేవలం ఐదు నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా 42 వేల కాపీలు అమ్ముడై ఇప్పటికీ ‘అమెజాన్’లో టాప్ పుస్తకాల్లో ఒకటిగా నిలచి ఉంది. ఇప్పుడు రెండో ప్రయత్నంగా ఆయన ‘గెలుపు పిలుపు’పేరుతో తెలుగులో పలకరించారు. సెల్ఫీ ఆఫ్ సక్సెస్ మూల విషయాన్ని తర్జుమాగా కాకుండా, అదనపు వ్యాఖ్యానాలతో ఈ పుస్తకాన్ని వెలువరించారు. విజయం ఎలా వరిస్తుంది, దాన్ని ఎలా నిలుపుకోవాలి, గెలుపు దుష్పరిణామాలు ఏమిటి, దానివల్ల వచ్చే కష్టసుఖాలు, గెలుపు చేయించే తప్పొప్పులు, విజయసూత్రాన్ని ఎలా అనుకూలంగా మలుచుకోవాలి... ఇలాంటి విషయాలను విజయమే వివరిస్తున్నట్టుగా ఈ పుస్తక రచన సాగింది. ఈ అంశాలను కొందరి జీవిత కథలతో ముడిపెట్టి వివరించారు. ఇది కూడా అమెజాన్‌లో పుస్తక ప్రియులను పలకరిస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన హైదరాబాద్ బుక్ఫెయిర్లో పాఠకుల ముంగిటకు వచ్చిన పుస్తకం ఇప్పుడు విజయవాడలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో పలకరిస్తోంది. వరుసగా నాలుగైదు పుస్తకాలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం లో ఉన్న బుర్రా వెంకటేశం రెండో రచన ఇది. సెల్ఫీ ఆఫ్ సక్సెస్ బెంగాలీ, స్పానిష్ రచనలనూ బుర్రా వెంకటేశం మార్కెట్లోకి తెచ్చారు. త్వర లో మరాఠీ, గుజరాతీ తదితర భాషల్లో రానున్న ట్టు వెల్లడించారు. మరో నెల రోజుల్లో తన మూ డో రచన వెలువరించనున్నట్టు పేర్కొన్నారు. -
చేసేందుకు పనేం లేదని...
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ ఆకునూరి మురళి స్వచ్ఛంద పదవీ విరమణకు అనుమతి కోరుతూ దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషిని కలిసి శనివారం ఆయన వీఆర్ఎస్ దరఖాస్తును అందజేశారు. చేసేందుకు పని లేదనే కారణంతోనే వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకున్నానని ఆయన ‘సాక్షి’కి తెలిపారు. తెలంగాణ రాష్ట్ర రాజ్యాభిలేఖన, పరిశోధన సంస్థ (స్టేట్ ఆర్కివ్స్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్) డైరెక్టర్‌గా ఏడాదిన్నరగా కొనసాగుతు న్నారు. ప్రాధాన్యతలేని పోస్టు కేటాయించారని గత కొంతకాలంగా ఆయన రాష్ట్ర ప్రభుత్వం పట్ల అసంతృప్తితో ఉన్నారు. పదవీ విరమణకు 10 నెలల ముందే వీఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవడం అధికారవర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. 2006 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఆయన గతంలో సెర్ప్ సీఈఓగా, భూపాలపల్లి జయశంకర్ జిల్లా కలెక్టర్‌గా పనిచేశారు. భూపాలపల్లి జిల్లా కలెక్టర్‌గా చేసిన సమయంలో స్థానిక అటవీ ప్రాంతంలోని గిరిజనుల్లో క్షయ వ్యాధి నిర్మూలన పట్ల అవగాహన కల్పించేందుకు నిర్వహించిన కార్యక్రమంలో ఆయన చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. గిరిజనుల్లో పౌష్టికాహార లోపాన్ని నివారించేందుకు అడవి పంది, గొడ్డు మాంసం తినాలని ప్రోత్సహించే క్రమంలో ఆయన బ్రాహ్మణ సామాజికవర్గాన్ని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలపై ఆ వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. ఆ తర్వాత కొంత కాలానికి ప్రభుత్వం ఆయనను భూపాలపల్లి జిల్లా కలెక్టర్ పదవి నుంచి స్టేట్ ఆర్కివ్స్కు బదిలీ చేసింది. పోస్టింగ్‌ల కేటాయింపుల్లో దళిత, గిరిజన, బీసీ, మైనారిటీ వర్గాల అధికారులకు అన్యాయం జరుగుతోందని, అధిక శాతం అధికారులు ప్రాధాన్యతలేని పోస్టుల్లో మగ్గిపోవాల్సి వస్తోందని కొంతకాలంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దళితవర్గానికి చెందిన ఆయన కొంత మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల ఐఏఎస్‌లతో కలిసి శాసనసభ ఎన్నికలకు ముందు సీఎస్ ఎస్కే జోషిని కలిసి పోస్టింగ్‌ల విషయంలో తమ అసంతృప్తిని తెలియజేశారు. ఏడాదిన్నరగా ప్రభుత్వం తనకు కారును సైతం కేటాయించలేదని అసంతృప్తి వ్యక్తం చేసేవారు. కాళేశ్వరం ఎత్తిపోతల పథకం డిజైనింగ్‌లో తీవ్ర లోపాలున్నాయని పేర్కొంటూ ఇటీవల∙ఆయన చేసిన వ్యాఖ్యలు సైతం చర్చనీయాంశమయ్యాయి. -
ఇక రెవెన్యూ రేంజ్‌లు..!
సాక్షి, హైదరాబాద్: ప్రజలకు పాలనను మరింత చేరువ చేసేందుకు పాలనలో సంస్కరణలు తీసుకొచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోంది. జిల్లా స్థాయిలోని సమస్యలను వెంటనే పరిష్కరించడంతో యంత్రాంగానికి సూచనలిచ్చేలా మార్పులు చేయబోతోంది. ఇందుకు పోలీసు శాఖ తరహాలోనే రెవెన్యూ వ్యవస్థలోనూ రేంజ్‌లు ఏర్పాటు చేయాలని యోచి స్తోంది. ఐదారు జిల్లాలకో రేంజ్‌ను ఏర్పాటు చేసి, సీనియర్ ఐఏఎస్‌ను ప్రత్యేకాధికారిగా పర్యవేక్షణకు నియమిస్తే మెరుగైన ఫలితాలొస్తాయని భావిస్తోంది. ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో..: రాష్ట్రంలో కొత్త జిల్లాలు ఏర్పాటై ఏడాది కావస్తోంది. జిల్లాలు పెరగడం, రాష్ట్రంలో ఐఏఎస్‌ల కొరత వల్ల జూనియర్ ఐఏఎస్‌లకు కలెక్టర్లుగా పనిచేసే అవ కాశం లభించింది. 31 జిల్లాల్లో ఆరుగురు మినహా మిగతా వారంతా జూనియర్ ఐఏఎస్‌లే కలెక్టర్లుగా ఉన్నారు. ఏడాది కాలంలో వీరి పనితీరు బాగుందని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. సీఎం సైతం కలెక్టర్లు చురుగ్గా పని చేస్తున్నారని ప్రశంసించారు. అయితే అనుభవం లేకపోవటంతో అప్పుడ ప్పుడు క్షేత్రస్థాయి సమస్యలొస్తున్నాయి. జిల్లా యంత్రాంగం, రాష్ట్ర ప్రభుత్వానికి ఇవి ఇబ్బంది పెడుతున్నాయి. మరోవైపు ప్రజా ప్రతినిధులతో సమన్వయ లోపాలతో చిక్కులొస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్లకు సూచనలిచ్చేందుకు రేంజ్‌లు ఏర్పాటు చేయాలని, ఇప్పటికే కొన్ని రాష్ట్రాల్లో ఇలాంటి విధానం అమల్లో ఉందని అధికారులు చెబుతున్నారు. ప్రత్యేక ప్రధాన కార్యదర్శులకు బాధ్యతలు? రాష్ట్రంలోని 10 మంది ప్రత్యేక ప్రధాన కార్యదర్శు లకు ‘రేంజ్’ బాధ్యతలు అప్పగించాలని ప్రభుత్వం యోచి స్తోంది. వివిధ హోదాల్లో పనిచేసిన అనుభం, ప్రభుత్వ కార్యక్రమాలపై స్పష్టమైన అవగాహన వీరి పర్యవేక్షణలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు మరింత వేగవంతం చేయొచ్చని భావిస్తోంది. ప్రణాళికా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బీపీ ఆచార్య ఈ దిశగా కొంత మేర ప్రయత్నం చేస్తున్నారు. పాత వరంగల్ జిల్లా పరిధిలోని ఐదుగురు కలెక్టర్లకు సలహాలిస్తున్నారు. టీం కాకతీయ పేరుతో ప్రత్యేక వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో మిగతా కలెక్టర్లకూ సీనియర్ ఐఏఎస్‌ల మార్గదర్శనం ఉండాలన్న ప్రతిపాదన అధికార వర్గాల్లో వినిపిస్తోంది. -
కేంద్ర సర్వీసులకు గిరిధర్, లవ్ అగర్వాల్
-కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్లో సంయుక్త కార్యదర్శిగా గిరిధర్ నియామకం -రిలీవ్ చేయమని సీఎస్‌కు గిరిధర్ దరఖాస్తు సాక్షి, హైదరాబాద్ రాష్ట్ర సర్వీసు నుంచి ఇద్దరు సీనియర్ ఐఏఎస్ అధికారులు కేంద్ర సర్వీసుకు వెళ్లిపోతున్నారు. ప్రస్తుతం రాష్ర్ట పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శిగా పనిచేస్తున్న 1988 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఎ. గిరిధర్‌ను కేంద్ర కేబినెట్ సెక్రటేరియట్లో సంయుక్త కార్యదర్శిగా కేంద్ర ప్రభుత్వం నియమించింది. దీంతో రాష్ట్ర సర్వీసు నుంచి రిలీవ్ అయ్యి కేంద్ర సర్వీసుకు వెళ్లిపోవాలని గిరిధర్ నిర్ణయించుకున్నారు. ఇందులో భాగంగానే రాష్ట్ర సర్వీసు నుంచి రిలీవ్ చేయాల్సిందిగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి సోమవారం గిరిధర్ దరఖాస్తు చేసుకున్నారు. రాష్ట్ర విభజన సమయంలో గిరిధర్ కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్నారు. అయితే రాష్ట్రం విడిపోయిన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరిక మేరకు కేంద్ర సర్వీసు నుంచి ముఖ్యమంత్రి కార్యాలయంలో పనిచేసేందుకు రాష్ట్ర సర్వీసుకు గిరిధర్ వచ్చారు. విభజన క్లిష్ట సమయంలో గిరిధర్ ముఖ్యమంత్రి ముఖ్యకార్యదర్శిగా కీలక బాధ్యతలను నిర్వహించారు. రాత్రి పగలు తేడా లేకుండా కష్టపడి పనిచేశారు. అయితే చెప్పుడు మాటలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి గిరిధర్‌ను మున్సిపల్ శాఖకు బదిలీ చేశారు. మున్సిపల్ శాఖ ముఖ్యకార్యదర్శిగా కూడా గిరిధర్ సింగపూర్ ప్రభుత్వం, అక్కడ కంపెనీలతో రాజధాని మాస్టర్ ప్రణాళిక రూపకల్పనలో కీలక పాత్ర పోషించారు. అయితే సింగపూర్ ప్రైవేట్ కంపెనీలు చెప్పినట్లు చేసేందుకు, ముఖ్యంగా మున్సిపల్ మంత్రి నారాయణ చెప్పినట్లు చేసేందుకు గిరిధర్ అంగీకరించలేదు. ఇక మున్సిపల్ శాఖలో పనిచేసే వాతావరణం లేదని గిరిధర్ అక్కడి నుంచి వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ఆయనను పబ్లిక్ సర్వీసు కమిషన్ కార్యదర్శిగా బదిలీ చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి గిరిధర్ కేంద్ర సర్వీసుకు వెళ్లిపోవాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు మార్గం సుగమమైంది. మరో సీనియర్ ఐఏఎస్ అధికారి 1996 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన లవ్ అగర్వాల్ కూడా కేంద్ర సర్వీసుకు వెళ్లిపోతున్నారు. అగర్వాల్ ప్రస్తుతం విపత్తుల శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్నారు. ఇంతకు ముందు అగర్వాల్ గృహ నిర్మాణ శాఖ ముఖ్యకార్యదర్శిగా పనిచేశారు. ప్రభుత్వం ఇటీవల ఆయనను విపత్తుల శాఖ కమిషనర్‌గా బదిలీ చేసింది. లవ్ అగర్వాల్‌ను కేంద్ర ప్రభుత్వం వైద్య, కుటుంబ సంక్షేమ శాఖ సంయుక్త కార్యదర్శిగా నియమించింది. దీంతో అగర్వాల్ కూడా రాష్ట్ర సర్వీసు నుంచి కేంద్ర సర్వీసుకు వెళ్లిపోనున్నారు. -
సీఎస్‌గా జ్ఞానదేశికన్
సాక్షి, చెన్నై: రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి మోహన్ వర్గీస్ సుంకత్ను హఠాత్తుగా బదిలీ చేశారు. ఆయన స్థానంలో విద్యుత్ బోర్డు చైర్మన్ జ్ఞానదేశికన్‌ను సీఎస్‌గా రంగంలోకి దించారు. అలాగే, పలువురు సీనియర్లను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఐఏఎస్‌లను కలవరపాటుకు గురి చేసింది. షీలా బాలకృష్ణన్ పదవీ విరమణతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పగ్గాల్ని సీనియర్ ఐఏఎస్ అధికారిగా ఉన్న మోహన్ వర్గీస్ సుంకత్ చేపట్టారు. సీఎస్‌గా మోహన్ వర్గీస్ బాధ్యతలు చేపట్టి 8 నెలలవుతోంది. ఇది వరకు ప్రధాన కార్యదర్శులుగా ఉన్న వాళ్లందరూ పదవీ విరమణ పొంది ప్రభుత్వానికి ప్రత్యేక సలహాదారులుగా వ్యవహరించారు. షీలా బాలకృష్ణన్ అయితే, నేటికీ ప్రత్యేక సలహాదారుగా వ్యవహరిస్తూ వస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బాధ్యతలు చేపట్టి 8 నెలలే అవుతున్న మోహన్ వర్గీస్‌ను హఠాత్తుగా బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం చర్చకు దారి తీసింది. అదే సమయంలో పలువురు సీనియర్ ఐఏఎస్‌లను సైతం బదిలీ చేయడం ఐఏఎస్‌లను షాక్ గురి చేసింది. గురువారం నుంచి అసెంబ్లీ శీతాకాల సమావేశాలు ఆరంభమవుతున్న సమయంలో ఏకంగా సీఎస్‌ను బదిలీ చేయడంతో ఏదేని కారణాలు ఉన్నాయా..? అన్న చర్చ బయలు దేరి ఉన్నది. సీఎస్‌గా జ్ఞాన దేశికన్: తన బదిలీ, మరి కొందరు ఐఏఎస్‌ల స్థాన చలనం ఉత్తర్వుల్ని తానే స్వయంగా జారీ చేసుకుంటూ సీఎస్ హోదాలో మోహన్ వర్గీస్ సుంకత్ మంగళవారం ప్రకటన విడుదల చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా విద్యుత్ బోర్డు చైర్మన్ కె జ్ఞాన దేశికన్‌ను నియమించినట్టు ఉత్తర్వులు జారీ చేశారు. తన వద్ద అదనంగా ఉన్న విజిలెన్స్, అడ్మినిస్ట్రేటివ్ కమిషనర్ పదవులను సైతం జ్ఞానదేశికన్‌కు అప్పగించారు. సీఎస్‌గా తప్పుకున్న మోహన్ వర్గీస్‌ను అదనపు ప్రధాన కార్యదర్శి హోదాలో అన్నా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ డెరైక్టర్ జనర్ల్గా నియమించారు. ఈ పదవిలో ఉన్న ఇరై అన్భును ప్రధాన కార్యదర్శి హోదాలో ఆర్థిక, గణంకాల విభాగానికి బదిలీ చేశారు. ఇక్కడ ఉన్న నిరంజన్ మార్డిన్ను తమిళనాడు మేరిటైం బోర్డుకు బదిలీ చేయగా, అక్కడ పనిచేస్తున్న రమేష్‌కుమార్ ఖన్నా పదవీ విరమణ పొందారు. జ్ఞానదేశికన్ ప్రధాన కార్యదర్శిగా బదిలీ కావడంతో ఆయన చేతిలో ఉన్న విద్యుత్ బోర్డు చైర్మన్ పదవి ప్రజా పనుల శాఖ ప్రధాన కార్యదర్శి ఎంసాయి కుమార్‌ను వరించింది. స్థాన చలనం : గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ విభాగం ప్రధాన కార్యదర్శి ఎన్ఎస్ పళనియప్పన్‌ను ప్రజా పనుల శాఖకు, రెవెన్యూ విభాగం ప్రధాన కార్యదర్శి గగన్ దీప్ సింగ్ బేడీని గ్రామీణాభివృద్ధి, పంచాయతీ రాజ్ శాఖకు మార్చారు. టౌన్ ప్లానింగ్ విభాగం కమిషనర్ ఆర్ వెంకటేశన్‌ను రెవెన్యూ విభాగం కార్యదర్శిగా, యువజన సర్వీసుల విభాగం ప్రధాన కార్యదర్శి నజీముద్దీన్‌ను సహకార, ఆహార, వినియోగదారుల సంక్షేమ విభాగానికి, సమాచార సేకరణ విభాగం కమిషనర్ ధర్మేంద్ర ప్రతాప్యాదవ్ను హౌసింగ్, అర్బన్ డెవలప్ మెంట్ విభాగానికి కార్యదర్శిగా స్థాన చలనం చేశారు. ఈ పదవిలో ఉన్న మోహన్ పేరిని యువజన సర్వీసుల విభాగానికి ,పుదుకోట్టై జిల్లా కలెక్టర్‌గా ఉన్న సీ మనోహరన్‌ను వ్యవసాయ శాఖ మార్కెటింగ్ విభాగం డెరైక్టర్‌గా, సహకార, ఆహార, వినియోగదారుల సంక్షేమ విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎంపీ నిర్మలను చిన్న తరహా పరిశ్రమల కార్పొరేషన్(టాన్సీ) చైర్ పర్సన్‌గా నియమించారు. -
సర్వే కోసం జిల్లాకో సీనియర్ ఐఏఎస్
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమగ్ర ఇంటింటి సర్వే పర్యవేక్షణకు జిల్లాకో సీనియర్ ఐఏఎస్ అధికారిని ప్రత్యేకాధికారిగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. డాక్టర్ అశోక్ ( ఆదిలాబాద్), సి.పార్థసారథి (కరీంనగర్), రాహుల్ బొజ్జా (వరంగల్), నీరబ్‌కుమార్ ప్రసాద్ (ఖమ్మం), వి. అనిల్‌కుమార్(నల్లగొండ), ఎం. జగదీశ్వర్ (మహ బూబ్‌నగర్), బీఆర్ మీనా (రంగారెడ్డి), సోమేష్‌కుమార్(హైదరాబాద్), బి.వెంకటేశం (మెదక్), బి.జనార్దన్‌రెడ్డి(నిజామాబాద్) ఆయా జిల్లాలకు ప్రత్యేక అధికారులుగా నియమితులయ్యారు. ఈనెల 14 నుంచి వచ్చేనెల 6వ తేదీ వరకు వీరంతా సర్వేను పర్యవేక్షిస్తారు. 3.69 లక్షల మంది సిబ్బంది నియామకం సర్వే కోసం జిల్లాల్లో కలెక్టర్లు ఇప్పటికే 3.69 లక్షల మంది ఉద్యోగులను నియమించారు. సర్వే ఏర్పాట్లపై రాజీవ్‌శర్మ, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్యకార్యదర్శి రేమండ్ పీటర్, ప్రణాళిక శాఖ ముఖ్యకార్యదర్శి బీపీ ఆచార్యలు కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.