
‘ఎన్ని అడ్డంకులు, అవరోధాలు వచ్చినా తాను ఎంచుకున్న మార్గం నుంచి వైదొలగకుండా ఉంటే గెలుపు సింహాసనం సాక్షాత్కరిస్తుంది. దాన్ని నిజం చేసి చూపిన నేత ఏపీ సీఎం వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి. నిత్యం జనం మధ్య ఉంటూ వారి కష్టసుఖాలు తెలుసుకొని వారి కోసం పాటుపడితే వారి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోతారు. అందుకే ఆయన గొప్ప విజయం సాధించారు. ఆయనది జనామోదిత గెలుపు’
‘ఎంతటి క్లిష్టమైన సమస్య అయినా, ఎలాంటి విపత్కర పరిస్థితులైనా తొణక్కుండా, బెదరకుండా అద్భుత ప్రణాళికలు రచించి అమలు చేసి అద్భుత విజయాలు సొంతం చేసుకోవటం నిరంతర గెలుపు లక్షణం. దానికి నిదర్శనమే తెలంగాణ సీఎం కేసీఆర్’
‘అవకాశం వచ్చినప్పుడు మనకు మనం విశ్లేషించి ముందుకు సాగితే.. ఎవరికీ తెలియని విషయాలను మనం అందరికీ చెప్పొచ్చు. అందుకే అద్భుత విజయం న్యూటన్ వశమైంది’ఇవీ సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం రచనల్లో ఉటంకించిన అంశాలు.
సాక్షి, హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ అధికారి బుర్రా వెంకటేశం కలం నుంచి మరో పుస్తకం అందుబాటులోకి వచ్చింది. కీలక బాధ్యతల్లో ఉంటూనే పుస్తక రచనవైపు మళ్లిన ఆయన ఐదు నెలల క్రితం ‘సెల్ఫీ ఆఫ్ సక్సెస్’పేరుతో ఆంగ్లంలో ఓ రచనను జనం ముందుకు తెచ్చారు. అది అమెజాన్ ఆన్‌లైన్ మార్కెట్‌లో ప్రపంచ రచనలతో పోటీపడి కొన్ని రోజులపాటు తొలిస్థానంలో నిలబడి ఆశ్చర్యపరిచింది. కేవలం ఐదు నెలల కాలంలో ప్రపంచవ్యాప్తంగా 42 వేల కాపీలు అమ్ముడై ఇప్పటికీ ‘అమెజాన్’లో టాప్ పుస్తకాల్లో ఒకటిగా నిలచి ఉంది. ఇప్పుడు రెండో ప్రయత్నంగా ఆయన ‘గెలుపు పిలుపు’పేరుతో తెలుగులో పలకరించారు. సెల్ఫీ ఆఫ్ సక్సెస్ మూల విషయాన్ని తర్జుమాగా కాకుండా, అదనపు వ్యాఖ్యానాలతో ఈ పుస్తకాన్ని వెలువరించారు.
విజయం ఎలా వరిస్తుంది, దాన్ని ఎలా నిలుపుకోవాలి, గెలుపు దుష్పరిణామాలు ఏమిటి, దానివల్ల వచ్చే కష్టసుఖాలు, గెలుపు చేయించే తప్పొప్పులు, విజయసూత్రాన్ని ఎలా అనుకూలంగా మలుచుకోవాలి... ఇలాంటి విషయాలను విజయమే వివరిస్తున్నట్టుగా ఈ పుస్తక రచన సాగింది. ఈ అంశాలను కొందరి జీవిత కథలతో ముడిపెట్టి వివరించారు. ఇది కూడా అమెజాన్‌లో పుస్తక ప్రియులను పలకరిస్తోంది. ప్రస్తుతం అమెజాన్‌లో ఎనిమిదో స్థానంలో ఉంది. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన హైదరాబాద్ బుక్‌ఫెయిర్‌లో పాఠకుల ముంగిటకు వచ్చిన పుస్తకం ఇప్పుడు విజయవాడలో జరుగుతున్న పుస్తక ప్రదర్శనలో పలకరిస్తోంది. వరుసగా నాలుగైదు పుస్తకాలను అందుబాటులోకి తెచ్చే ప్రయత్నం లో ఉన్న బుర్రా వెంకటేశం రెండో రచన ఇది. సెల్ఫీ ఆఫ్ సక్సెస్ బెంగాలీ, స్పానిష్ రచనలనూ బుర్రా వెంకటేశం మార్కెట్‌లోకి తెచ్చారు. త్వర లో మరాఠీ, గుజరాతీ తదితర భాషల్లో రానున్న ట్టు వెల్లడించారు. మరో నెల రోజుల్లో తన మూ డో రచన వెలువరించనున్నట్టు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment