నిరీక్షణ
బరువెక్కిన గుండెలతో.. నీళ్లింకిన కళ్లతో
ఆశలు గల్లంతు..ఎంతకీ చిక్కని ఆచూకి బాధిత కుటుంబాలు బెంబేలు బిడ్డల కోసం ఎదురుచూపులు
సిటీబ్యూరో:
నిరీక్షణ.. వేదన.. రోదన.. బియాస్ ఘటనలో బాధిత కుటుంబాలు తెరిపిన పడటంలేదు. గల్లంతైన బిడ్డలు క్షేమంగానే ఉన్నారా?.. ఆచూకీ చిక్కుతుందా? అనేది అంతులేని వేదనకు గురిచేస్తోంది. ప్రమాదం జరిగిన నాలుగు రోజులైనా ఇప్పటికీ తమ వారి జాడ లేకపోవడంతో నిద్రహారాలు లేకుండా కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. లార్జీ డ్యామ్ వద్ద విద్యార్థులు నీటి ఉధృతిలో కొట్టుకుపోతున్న దృశ్యాలను అమర్‌ఉజాలా.కామ్ అనే వెబ్‌సైట్ బుధవారం విడుదల చేసింది. ఆ వీడియో క్లిప్పింగ్‌లు మీడియాలో ప్రసారం కావడంతో బాధిత కుటుంబాలు మరింతగా తల్లడిల్లాయి. బంధుమిత్రుల హృదయాలు కకావికలమయ్యాయి. విద్యార్థులు నీటి ఉధృతికి కొట్టుకుపోతున్న దృశ్యాలు గుండెల్ని బరువెక్కిం చాయి. ఈ వీడియోలో కొట్టుకుపోతూ కనిపించిన వారు తమ తోటి విద్యార్థులేనని ఈ దుర్ఘటన నుంచి సురక్షితంగా బయటపడిన దివ్య ‘సాక్షి’కి తెలిపింది. గట్టుపైనున్న వారు తమ వీడియో కెమెరాలో ఈ దృశ్యాలను బంధించారన్నారు. అందరూ చూస్తుండగానే నిమిషం వ్యవధిలో ఘోరం జరిగిపోయిందంటూ ఆమె విలపించారు.
అప్పుడూ.. ఇప్పుడూ..అదే విషాదం
గతేడాది చోటుచేసుకున్న చార్‌ధామ్ విషాదంలోనూ కొందరి ఆచూకీ తెలియరాలేదు. అప్పట్లో బాధిత బాధిత కుటుంబాల బాధ వర్ణనాతీతం. తాజా సంఘటన కూడా అలాంటి చేదు అనుభవాలను మిగులుస్తుందేమోనని విద్యార్థుల బంధువులు ఆందోళన చెందుతున్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్ నదిలో 24 మంది విద్యార్థులు కొట్టుకుపోగా ఇప్పటివరకు ఆరు మృతదేహాలు మాత్రమే లభించాయి. మిగతా వారి ఆచూకీ లేకుండా పోయింది. వారు బతికే ఉన్నారా?, గాయపడి ఎక్కడైనా ఇరుక్కుపోయారా? అనే వివరాలు తెలియ రావడం లేదు. నదిలో బండ రాళ్లు ఉండడం, నీరు చల్లగా ఉండడంతో అసలు తమ పిల్లలు ఏ పరిస్థితుల్లో ఉన్నారో తెలియక బాధిత కుటుంబసభ్యులు తల్లడిల్లిపోతున్నారు. ఏ క్షణాన ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని బెంబేలెత్తిపోతున్నారు. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం, జాతీయ విపత్తు నిర్వహణ బృందాలు లార్జీ, మండి డ్యామ్ పరిసరాలను జల్లెడ పడుతున్నా ఫలితం కనిపించకపోవడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. జాతీయ రిమోట్‌సెన్సింగ్ ఏజెన్సీ (ఎన్‌ఆర్‌ఎస్‌ఏ) సహకారంతో విద్యార్థుల ఆచూకీ కనుగొని కన్నవారి శోకాన్ని కొంతమేరైనా తగ్గించాలని నిపుణులు సూచిస్తున్నారు. నగర వాసులకు జూన్ నెలలో టూర్ల రూపంలో వచ్చిపడుతున్న విపత్తులు సర్వత్రా కలవర పెడుతున్నాయి.
ఆశలు తలకిందులేనా..?
వరద ప్రవాహంలో కొట్టుకుపోయి నాలుగు రోజులు కావడంతో విద్యార్థులు సజీవంగా ఉన్నారా..? లేదోనన్న ఆందోళన వ్యక్తమవుతుంది. సదరు విద్యార్థులు క్షతగాత్రులై కొండకోనల్లో చిక్కుకున్న పక్షంలో వారికిసరైన చికిత్స, ఆహారం, మంచినీరు అందే పరిస్థితి లేకపోవడంతో వారు బతకడం కష్టమేనని వైద్యనిపుణులు చెబుతున్నారు. గల్లంతైన విద్యార్థుల ఆచూకీని కనుగొనేందుకు రాష్ట్ర హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి హిమాచల్ ప్రదేశ్‌లోనే మకాం వేసి గాలింపు చర్యలను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు. హోంమంత్రితోపాటు బాలానగర్ డీసీపీ ఏఆర్ శ్రీనివాస్, పేట్‌బషీరాబాద్ ఏసీపీ శ్రీనివాస్‌రావు, దుండిగల్ ఇన్‌స్పెక్టర్ వెంకటేశ్వర్లు గత మూడు రోజులుగా హిమాచల్ ప్రదేశ్‌లోనే ఉన్నారు. తమ వారి ఆచూకీ కోసం గాలిస్తూనే ఉన్నారు.
వీరి ఆచూకీ కోసం ఎదురు చూపులు....
వీఎన్‌ఆర్-వీజేఐటీ కళాశాలకు చెందిన గల్లంతైన విద్యార్థుల్లో ఇప్పటికి ఆరుగురి మృతదేహాలు లభించిన విషయం తెలిసిందే. ఇంకా దాసరి శ్రీనిధి, రిషితారెడ్డి, పాపాని రిధిమ, ఆశిష్‌మంత, కిరణ్‌కుమార్, అఖిల్, తరుణ్, ఉపేందర్, శివప్రకాశ్‌వర్మ, సాయిరాజ్, బస్వరాజ్ సందీప్, రిత్విక్, జగదీష్, పరమేశ్వర్, అఖిల్ మిట్టపల్లి, విష్ణువర్ధన్‌రెడ్డి, అరవింద్‌కుమార్, కల్లూరి శ్రీహర్ష ఆచూకీ తెలియాల్సి ఉంది.
కులు వెళ్తున్నానన్నాడు...
మండి నుంచి కులు వెళ్తున్నట్టు చెప్పాడు.. అంతలో నీళ్లలో పడి గల్లంతైనట్టు వార్తలు.. చివరకు బుధవారం మృతదేహమై తేలినట్టు తెలిసి సాబేర్ కుటుంబం ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. గుల్‌మొహర్‌పార్కు కాలనీలో విషాదం అలముకుంది.