ప్రేమిస్తున్నానంటూ.. ప్రియురాలితో కలసి విహరించాడు.
బంజారాహిల్స్: ప్రేమిస్తున్నానంటూ.. ప్రియురాలితో కలసి విహరించాడు. తీరా పెళ్లెప్పుడూ అంటే.. పెళ్లి చేసుకోను గాక చేసుకోనన్నాడు. దీంతో బాధితురాలు జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జూబ్లీహిల్స్‌రోడ్ నెం. 56లోని గురుబ్రహ్మనగర్ బస్తీలో నివసించే యాదగిరి ఎస్‌ఐ ఉద్యోగం కోసం పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నాడు.
ఇదే బస్తీలో నివసిస్తున్న ఓ యువతితో ప్రేమిస్తున్నానని చెప్పి ఏడాదిగా చెట్టా పట్టాలేసుకొని తిరిగాడు. తీరా పెళ్లి చేసుకోవాలని ఆమె కోరగా.. లేదని తేల్చి చెప్పాడు. దీంతో బాధితురాలు తల్లిదండ్రులతో కలసి సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించినా ఫలితం లేకపోవడంతో కేసు నమోదు చేశారు.